Anushka Shetty: వరుస సినిమాలతో...
ABN, Publish Date - May 03 , 2025 | 02:01 PM
ప్రస్తుతం తెలుగులో క్రిష్ దర్శకత్వంలో అనుష్క 'ఘాటీ' సినిమా చేస్తోంది. ఈ సినిమా తర్వాత ఆమె మరో మూడు నాలుగు సినిమాలను లైన్ లో పెట్టిందని తెలుస్తోంది.
టాలీవుడ్ లోనే కాదు... దక్షిణాదిలో అనుష్క శెట్టి (Anushka Shetty) కి నటిగా మంచి పేరుంది. ఇక 'బాహుబలి' (Baahubali) లో నటించిన తర్వాత అనుష్క పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మ్రోగిపోయింది. అయితే... ఆ తర్వాత మాత్రం అనుష్క ప్రేక్షకుల ఆశలకు తగ్గ సినిమాలు చేయలేదు. ఒకానొక సమయంలో ఆమె నటనకు స్వస్తిపలికేస్తుందేమో అని అభిమానులు భయపడ్డారు కూడా. కానీ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' (Miss Shetty Mr Polishetty) మూవీ చేసి... అలాంటి పుకార్లకు చెక్ పెట్టింది. సినిమాలు తగ్గించుకోవడానికి ప్రత్యేక కారణం ఇది అని ఆమె ఎప్పుడూ చెప్పలేదు. బట్... ఆ సినిమా తర్వాత క్రిష్ డైరెక్షన్ లో 'ఘాటీ' మూవీలో నటించింది. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. త్వరలోనే ఇది జనం ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే... అనుష్క శెట్టి కాస్తంత వెనకడుగు వేసింది తప్పితే... చిత్రసీమ నుండి దూరంగా వెళ్ళిపోలేదు. ఇదివరకంత వేగంగా సినిమాలు చేయడం లేదు అంతే! ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ తన దృష్టికి వస్తే భాషతో నిమిత్తం లేకుండా వాటికి పచ్చజెండా ఊపుతోంది. అలా ఆమె ఓ మలయాళ చిత్రంలో నటిస్తోంది. 'కథనార్' అనే ఈ సినిమాలో అనుష్క నటిస్తోంది. 9వ శతాబ్దానికి చెందిన కడమట్టతు అనే క్రైస్తవ పూజారికి సంబంధించిన కథ ఇది. ఇందులో అనుష్క కాలియన్ కట్టు నీల అనే పాత్రను పోషిస్తోంది. దీని తర్వాత యూవీ క్రియేషన్స్ తీయబోతున్న 'భాగమతి -2' (Bhagamathi -2)లో నటించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రీప్ట్ వర్క్ ప్రస్తుతం జరగుతోందట. అలానే ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ ప్రభాస్ తో 'సలార్ -2' (Salaar -2) కాకుండా మరో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించింది. అందులో అనుష్క కథానాయికగా చేస్తోందనే వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. మొత్తానికి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ 'ఘాటీ' తర్వాత అనుష్క సినిమాలు వరుసగా రాబోతున్నాయన్నది వాస్తవం.
Also Read: Vijay Devarakonda: అందరి వేలు అతనివైపే...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి