Manchu Mohan Babu: నా మాటలు ఆమెకు వినిపిస్తే ఎంత బావుండేదో పరమేశ్వరా..

ABN , Publish Date - Jun 05 , 2025 | 06:32 PM

కలక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) ప్రస్తుతం తన పెద్ద కొడుకు మంచు విష్ణు(Manchu Vishnu)ను హీరోగా నిలబెట్టడానికి కష్టపడుతున్నాడు.

Mohan Babu

కలక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) ప్రస్తుతం తన పెద్ద కొడుకు మంచు విష్ణు(Manchu Vishnu)ను హీరోగా నిలబెట్టడానికి కష్టపడుతున్నాడు. ఇప్పటివరకు మంచు కుటుంబంపై వచ్చిన ట్రోల్స్ వలన విష్ణు నటించిన ప్రతి సినిమా పరాజయం పాలవుతూ వచ్చింది. ఇక ఈసారి ఎలాగైనా మంచి హిట్ ను ఇవ్వాలని కన్నప్ప(Kannappa) చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు మోహన్ బాబు.

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న కన్నప్ప జూన్ 27 న రిలీజ్ కు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన విష్ణు.. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారాడు. ఇంకోపక్క మోహన్ బాబు(Mohan Babu) కూడా సినిమాపై అంచనాలను పెంచడానికి ప్రయత్నిస్తున్నాడు. తాజాగా మోహన్ బాబు కన్నప్ప వెనుక ఉన్న స్టోరీని ఒక వీడియో ద్వారా తెలిపాడు. తన జీవితంలో అసలైన కన్నప్ప ఎవరో రివీల్ చేశాడు.

" అమాయకుడు, ఆటవికుడైన తిన్నడు.. పరమేశ్వురుడైన శివుడుకు కన్ను ఇచ్చి చరిత్రలో నిలిచిపోయాడు. మన ఆకలి తెలుసుకొని అమ్మ ఆకలి తీరుస్తుంది. మనకేదీ కావాలంటే అది శక్తికి మించి అమ్మానాన్నలు మనకు ఇస్తారు. నా దృష్టిలో మా అమ్మానాన్నలు కన్నప్పలు. మా అమ్మ పేరు లక్ష్మమ్మ. దురదృష్టవశాత్తు పుట్టకతో ఆమెకు రెండు చెవులు వినిపించవు. ఆ మహాతల్లికి పరమేశ్వరుడు ఐదు మంది సంతానం ఇచ్చాడు. ఒకచోట బస్సు దిగి మా ఊరుకు వెళ్లాలి అంటే ఐదు కిలోమీటర్లు నడవాలి. ఆ దారి కూడా అంతంతమాత్రమే. చెవులు వినిపించని నా తల్లి ఐదుమంది బిడ్డలను మోసుకొని మా ఊరుకు వెళ్ళేదంటే ఎంత కష్టమో ఆలోచించండి. దారిలో ఒక కాలువ, ఒక సువర్ణముఖి నది ఉంది. అది దాటి వెళ్ళాలి.

మాది ద్వీపం లాంటి ఊరు. అప్పుడప్పుడు ఈ విషయాలు తలుచుకుంటే ఒళ్ళు గగుర్పాటు పొడుస్తుంది. నా కంఠాన్ని అందరు మెచ్చుకుంటూ ఉంటే... ఈ మాటలు నా తల్లికి వినిపించి ఉంటే ఎంత బావుండేది పరమేశ్వరా అని అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను. నాకు నా కన్నతల్లే కన్నప్ప" అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Updated Date - Jun 05 , 2025 | 06:32 PM