Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు.. వైరల్ ఫీవర్! అందోళనలో అభిమానులు
ABN , Publish Date - Sep 23 , 2025 | 09:43 PM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం విషయంలో ఆందోళన కలిగించే వార్త బయటకు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆరోగ్యం విషయంలో ఆయన అభిమానులకు ఆందోళన కలిగించే వార్త బయటకు వచ్చింది. రెండు రోజులుగా ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. పవన్ కల్యాణ్ నటించిన ఓజీ (OG) మరో రోజులో విడుదల కానుండగా ఇప్పుడు ఈ న్యూస్ రావడంతో పార్టీ కార్యకర్తలు, ఫ్యాన్స్ ఒకింత బాధ వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
అయితే జ్వరం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అలాగే సోమవారం నాడు కీలకమైన అధికారుల సమీక్షలు కూడా నిర్వహించారు. దీంతో ఆయన జ్వరం మరింతగా పెరగడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తగినంత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు డిప్యూటీ సీఎంకు సూచించారు.
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. తొలుత సెప్టెంబర్ 30 వరకు జరగాలని నిర్ణయించినా, తర్వాత తేదీలను కుదించారు. సెప్టెంబర్ 25న ప్రభుత్వ బిజినెస్‌తో పాటు ఆరోగ్యంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. 26న లాజిస్టిక్స్, ఉపాధి కల్పన, పరిశ్రమలపై చర్చిస్తారు. 27న సూపర్ సిక్స్ అంశంపై చర్చకు అవకాశం ఉంది.