NTR-Padmanabham: ఎన్టీఆర్–పద్మనాభం స్నేహం.. సినిమాలకతీతమైన అనుబంధం
ABN , Publish Date - Sep 08 , 2025 | 07:42 PM
నటరత్న యన్టీఆర్ (NTR)కు పలు సెంటిమెంట్స్ ఉండేవి. అలాగే తనతో అనుబంధం ఉన్నవారందరినీ ఆయన గుర్తుంచుకొనేవారు. అంతేకాదు వారు ఏమైనా అడిగితే తనకు చేతనైన సాయం అందించడంలోనూ ముందుండేవారు రామారావు.
నటరత్న యన్టీఆర్ (NTR)కు పలు సెంటిమెంట్స్ ఉండేవి. అలాగే తనతో అనుబంధం ఉన్నవారందరినీ ఆయన గుర్తుంచుకొనేవారు. అంతేకాదు వారు ఏమైనా అడిగితే తనకు చేతనైన సాయం అందించడంలోనూ ముందుండేవారు రామారావు. యన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం 'పల్లెటూరి పిల్ల' అయినా, విడుదలైన మొదటి సినిమా విజయావారి 'షావుకారు'. ఆ చిత్రంలో పూలయ్య పాత్రలో పద్మనాభం (Padmanabham) నటించారు. విజయా సంస్థకు అదే తొలి చిత్రం. విమర్శకుల ప్రశంసలు అందుకుందే కానీ, ఆర్థిక పుష్టిని అందించలేదు. తరువాత అదే విజయా సంస్థ నిర్మించిన జానపద చిత్రం 'పాతాళభైరవి'తోనే యన్టీఆర్ సూపర్ స్టార్ గా నిలిచారు. ఈ చిత్రంలోనూ పద్మనాభం నటించారు. అందులో నేపాల మాంత్రికుని శిష్యుడు సదాజపునిగా పద్మనాభం కనిపించారు. అప్పటి నుంచీ యన్టీఆర్ - పద్మనాభం అనుబంధం కడదాకా కొనసాగింది.
పద్మనాభం, అతని మిత్రుడు వల్లం నరసింహారావు కలసి రేఖా అండ్ మురళీ కంబైన్స్ సంస్థ ను పెట్టి సినిమాను తీయాలని ఆశించారు. తొలి చిత్రంలోనే యన్టీఆర్ ను నటింప చేస్తే బాగుంటుందని భావించారు. ఆ విషయాన్ని యన్టీఆర్ ముందుంచారు పద్మనాభం. ఆయన మరో మాట లేకుండా సినిమాలో నటించడానికి అంగీకరించారు. అలా రూపొందిన 'దేవత' చిత్రంతోనే పద్మనాభం నిర్మాతగా మారారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అందులో కొన్ని పాటలను యన్టీఆర్, సావిత్రిపై ఔట్ డోర్ లో తీశారు. యన్టీఆర్ పై 'బొమ్మను చేసి ప్రాణం పోసి...' పాటలో కొన్ని షాట్స్ ఔట్ డోర్ లో చిత్రీకరించారు. అలా ఆలస్యమైంది. యన్టీఆర్ ను కారులో పద్మనాభం స్వయంగా ఇంటి దగ్గర దింపాలని ఆశించారు. తిరిగి మద్రాసుకు వస్తూండగా, బాగా చీకటిపడింది. అర్ధరాత్రి అవుతోంది. ఆ సమయంలో పద్మనాభం ముందు సీటులో కూర్చొని డ్రైవర్ కు దారి చెబుతున్నారు. వెనకాల యన్టీఆర్ నిద్రపోతున్నారు. ఆ సమయంలో ఓ పెద్దపులి రోడ్డుకు అడ్డంగా పడుకొని ఉంది. డ్రైవర్ పై ప్రాణాలు పైనే పోయాయి. పద్మనాభం అతణ్ణి కంగారు పడవద్దని చెప్పి హెడ్ లైట్స్ ఆపేయమన్నారు. లైట్స్ ఆపేయగానే పులి చాలా సేపు రోడ్డుపై అటూ ఇటూ తిరిగి వెళ్ళిపోయింది. ఇదంతా వెనకాల నిద్రపోతున్న యన్టీఆర్ కు తెలియదు. తరువాత మెలకువ వచ్చి ఏమిటి కారు ఆపారు అని అడిగారు రామారావు. విషయం వివరించి చెప్పారు పద్మనాభం. 'అది పులి... కానీ మా కారులో సింహం ఉందని తెలుసుకొని పలాయనం చిత్తగించింది' అంటూ పద్మనాభం తన సహజ శైలిలో నవ్వేశారు. రామారావు కూడా తనపై పద్మనాభంకు ఉన్న అభిమానానికి ఆనందించారు. యన్టీఆర్ నటించిన అనేక చిత్రాలలో పద్మనాభం పలు పాత్రలు పోషించారు. అలా పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘికాలన్నిటా పద్మనాభం నటించగలిగారు.
యన్టీఆర్ తన 200వ చిత్రం 'కోడలు దిద్దిన కాపురం'లో పద్మనాభం కు అదే పనిగా ఓ పాత్రను క్రియేట్ చేశారు. అందులో యన్టీఆర్ చెల్లెలుగా సంధ్యారాణి నటించారు. ఆమె భర్త పాత్రలో పద్మనాభం ను నటింప చేశారు రామారావు. పద్మనాభం పోషించిన శంకరం పాత్ర సినిమాలో హాస్యం పండించింది. అలా తన స్పెషల్ మూవీలోనూ పద్మనాభంకు అవకాశం కల్పించారు రామారావు.
యన్టీఆర్ అంటే పద్మనాభంకు వల్లమాలిన అభిమానం. ఆయన ముఖ్యమంత్రి కావాలని పూజలు చేశారు. యన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత హైదరాబాద్ వచ్చినప్పుడు కలుసుకున్నారు పద్మనాభం. ఆ సమయంలో క్లిక్కుమన్న ఫొటో ఇది. రామారావుతో పద్మనాభంకు ఎంత చనువుందో ఈ ఛాయాచిత్రం చూస్తేనే అర్థమవుతుంది. యన్టీఆర్ భుజంపైనే చేయి వేసి మరీ ఫోటో తీయించుకున్నారు పద్మనాభం. తనతో అనుబంధం ఉన్నవారందరినీ యన్టీఆర్ ఏ నాడూ మరచిపోరు అన్నదానికి పద్మనాభంతో అనుబంధం ఓ చిన్న ఉదాహరణ.