UV Creations : వరుస వాయిదాలతో సతమతం
ABN , Publish Date - Jul 02 , 2025 | 10:22 AM
యువీ క్రియేషన్స్ కు కొంతకాలంగా టైమ్ కలిసి రావడం లేదు. ఆ సంస్థ చేపట్టిన ఏ ప్రాజెక్ట్ కూడా ఇన్ టైమ్ లో పూర్తి కావడం లేదు. అనుకున్న సమయానికి విడుదల అవ్వడం లేదు. సంస్థ చేతిలో ఇప్పుడు నాలుగైదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రాలలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తో తీస్తున్న ప్రతిష్ఠాత్మక సినిమా 'విశ్వంభర' (Viswambhara) ఒకటి. ఈ మూవీ ఇప్పటికే పలు మార్లు వాయిదా పడింది. చివరకు విసిగి వేసారిన చిరంజీవి సినిమా ఫస్ట్ కాపీ సిద్థం అయ్యేవరకూ విడుదల తేదీని ప్రకటించవద్దనే కండీషన్ పెట్టినట్టు తెలుస్తోంది. ఒక్క పాట మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తయిందట. బాలెన్స్ ఉన్న పాటకు ఎం.ఎం. కీరవాణి (MM Keeravani) బిజీగా ఉండటంతో భీమ్స్ సిసిరోలియోతో ట్యూన్ చేయించుకుని తీయబోతున్నారు. ఈ ప్రత్యేక గీతంలో చిరంజీవి సరసన బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్ (Mouni Roy) నటించబోతోందటూ వార్తలు వస్తున్నాయి. పాట చిత్రీకరణ పూర్తి అయినా... విఎఫ్ఎక్స్ వర్క్ ఎప్పుడు పూర్తయితే అప్పుడే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించబోతున్నారు.
అలానే ఈ సంస్థ నిర్మిస్తున్న మరో సినిమా 'ఘాటీ' (Ghaati). అనుష్క శెట్టి (Anushka Sheety) తో యూవీ క్రియేషన్స్ కు స్పెషల్ బాండింగ్ ఉంది. ఆమె నాయికగా నటించిన 'మిర్చి' సినిమాతోనే ఈ సంస్థ మొదలైంది. అలానే అనుష్కతో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ 'భాగమతి' (Bhaagamathi) ని నిర్మించిందీ యూవీ క్రియేషన్సే. అనుష్క నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'నీ ఈ సంస్థే ప్రొడ్యూస్ చేసింది. ఇప్పుడు 'ఘాటీ'ని క్రిష్ దర్వకత్వంతో వారి భాగస్వామ్యంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. జులై 11న 'ఘాటీ' విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ కూడా కాకపోవడంతో ఇప్పుడు మూవీని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
ఈ రెండు సినిమాలు కాకుండా యూవీ క్రియేషన్స్ సంస్థ వరుణ్ తేజ్ - మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో ఓ ఇండో-కొరియన్ హారర్ కామెడీని నిర్మిస్తోంది. ఈ సినిమా కూడా కాస్తంత ఆలస్యంగా సెట్స్ పైకి చేరింది. ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని జనం ముందుకు వస్తుందో క్లారిటీ లేదు.
అలానే శర్వానంద్ తో ఈ సంస్థ నాలుగో సినిమాను మొదలు పెట్టింది. దాని అప్ డేట్స్ పెద్తగా లేవు. ఇక సంతోష్ శోభన్ (Santhosh Sobhan) హీరోగానూ 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీని నిర్మిస్తోంది. ఈ సినిమా కూడా ఎప్పటి నుండో అలా సెట్స్ మీదనే ఉంది. నిజానికి ఈ యేడాది ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే సందర్భంగా దీనిని రిలీజ్ చేస్తామని అప్పుడెప్పుడో ప్రకటించారు.
ఇలా ఈ సంస్థనుండి రావాల్సిన సినిమాలన్నీ విపరీతమైన ఆలస్యం అవుతున్నాయి. మరి సంస్థ అధినేతలు వంశీ, ప్రమోద్ ఓసారి కూర్చుని సమస్య ఎక్కడ ఉందో తెలుసుకుని రెక్టిఫై చేసుకుంటారేమో చూడాలి.
Also Read: Tv Movies: బుధవారం.. టీవీ తెలుగు సినిమాలివే