Tollywood: సమస్యల పరిష్కారానికి కమిటీ... థియేటర్స్ బంద్ ఉండదు

ABN , Publish Date - May 24 , 2025 | 01:40 PM

జూన్ 1 నుండి థియేటర్ల బంద్ ఉండదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కె.ఎల్. దామోదర ప్రసాద్ తేల్చి చెప్పారు. సినిమా నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, బయర్స్ తో చర్చించి, ఓ కమిటీని వేయబోతున్నామని అన్నారు.

తెలుగు సినిమా (Telugu Cinema) రంగానికి ఝలక్ ఇస్తూ జూన్ 1 నుండి పర్సంటేజ్ సిస్టమ్ కు అంగీకరించకపోతే థియేటర్లు బంద్ చేస్తామని కొద్ది రోజుల ముందు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎగ్జిబిటర్స్ ప్రకటించారు. అయితే సింగిల్ థియేటర్ల యజమానులు ఇచ్చిన ఈ అల్టిమేటమ్ పై నిర్మాతలు, పంపిణీదారులు మల్లగుల్లలు పడ్డారు. రెంట్ కాకుండా పర్సంటేజ్ విధానం కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదువుతాయనే దానిపై వీరు కొద్ది రోజులుగా చర్చలు జరిపారు. అయితే ఇవేవీ ఓ కొలిక్కి రాలేదు. ఇక శుక్రవారం సాయంత్రం ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) థియేటర్ల బంద్‌ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఎక్కడ నుండి ఆ ప్రపోజల్ వచ్చిందో ఆరా తీయమంటూ స్టేట్ హోమ్‌ సెక్రటరీని కోరడంతో ఈ వివాదం వేడెక్కింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న 'హరిహర వీరమల్లు' (Harihara Veera Mallu) సినిమా జూన్ 12న విడుదల కాబోతున్న నేపథ్యం లో ఆ సినిమా నిర్మాతలను ఇబ్బంది పెట్టాలనే ఎగ్జిబిటర్స్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? అనే అనుమానాలూ కొందరు వ్యక్తం చేశారు. ఎందుకంటే గత ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమా 'బ్రో' (Bro) విడుదల సమయంలోనూ ఇలానే సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో తాత్సారం చేసింది. చివరకు ఆ సినిమాను విడుదల చేసిన తర్వాత టిక్కెట్ రేట్ల పెంపు విషయంలో నిర్ణయం తీసుకుంది.


అయితే... శనివారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి, ది తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు చెందిన కార్యవర్గం సమావేశమైంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్ తో వీరు చర్చలు జరిపారు. అనంతరం జరిగిన మీడియాతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కె.ఎల్. దామోదర ప్రసాద్ మాట్లాడారు. గత కొంతకాలంగా తమ మధ్య ఉన్న సమస్యలపై చర్చించామని, ఈ నెల 30న ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ను ఏర్పాటు చేసి, ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని, థియేటర్స్ పర్సంటేజ్, రెంటల్ విధానంపై వారు కూలంకషంగా చర్చలు జరిపిన తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటామని, అంతవరకూ థియేటర్ల బంద్ ఉండదని స్పష్టం చేశారు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. మొత్తం మీద... పర్సంటేజ్ విధానం అమలు చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడానికి వేసే కమిటీ తీసుకునే నిర్ణయంపై ఎగ్జిబిటర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Also Read: Mukul Dev: సినిమా ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం.. ప్ర‌భాస్, ర‌వితేజ విల‌న్ క‌న్నుమూత‌

Also Read: HIT3 OTT: ఆ ఓటీటీకి నాని హిట్‌3.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే....

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 24 , 2025 | 02:27 PM