Tollywood: ఆరోజు.. టాలీవుడ్ ఇండస్ట్రీకి హాలిడే! నో షూటింగ్స్
ABN , Publish Date - May 20 , 2025 | 08:08 PM
తెలంగాణా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉత్తమ చిత్రాలకు గద్దర్ అవార్డుల ప్రధానోత్సవానికి సర్వం సిద్ధమైంది
తెలుగు సినీ పరిశ్రమను ఎంకరేజ్ చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని గద్దర్ అవార్డులను (Gaddar Awards) ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉత్తమ చిత్రాలకు గద్దర్ అవార్డుల ప్రధానోత్సవానికి సర్వం సిద్ధమైంది. జూన్ 14న ఈ అవార్డులను అందించనున్నట్లు ఇప్పటికే ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ దిల్‌రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం మాదాపూర్ హైటెక్స్ వేదికగా నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ రోజు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి హాలిడే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ రోజున ఎలాంటి షూటింగ్‌లు లేకుండా, ఉన్న వాటిని రద్దు చేసేలా వీలైనంత వరకు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హజరయ్యేలా చూసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
గద్దర్ తెలుగు ఫిల్మ్ అవార్డుల నేపథ్యంలో ఇప్పటికే జయసుధ నేతృత్వంలో 15మందితో కూడిన జ్యూరీని సైతం ఏర్పాటు చేశారు. వారు 2024 ఏడాదిలో వచ్చిన సినిమాలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి ఈ నెల (మే) చివరి నాటికి ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు’ కమిటీకి పంపనుంది. ఆ తరువాత జ్యూరీ పంపిన వివరాలను పరిశీలించి, అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నభూతో న భవిష్యత్తు అన్నట్టుగా అన్ని అవార్డు ఫంక్షన్ల వలే నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్దమైంది.
ఇదిలాఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పినట్టుగా 2014 నుంచి 2023 వరకు యేడాది ఒక ఉత్తమ చిత్రం చొప్పున ఎంపిక చేయడానికి మరో కమిటీని వేసింది. ఈ కమిటీ ఉత్తమ చిత్రాలతో పాటు స్పెషల్ అవార్డ్స్ అర్హులను సైతం ఎంపిక చేస్తుంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్టీఆర్ జాతీయ అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు, బి.ఎన్. రెడ్డి, నాగిరెడ్డి - చక్రపాణి అవార్డులను కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ అవార్డులతో పాటు అదనంగా పైడి జయరాజ్, కాంతారావు పేరుర్లతోనూ అవార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మురళీమోహన్ ఛైర్మన్ గా దర్శకుడు కె. దశరథ్, నిర్మాత డి.వి.కె. రాజు, నటి ఊహ, సీనియర్ జర్నలిస్ట్ ఉమామహేశ్వరరావు, నర్తకి వనజా ఉదయ్, దర్శకుడు కూచిపూడి వెంకట్, కె. శ్రీధర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎం.డి కమిటీ సభ్యులుగా ఈ అవార్డులకు అర్హులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది.