Nithiin, Vikram K Kumar: నితిన్‌, విక్ర‌మ్ స్పోర్ట్స్ డ్రామా.. అంతా సిద్దం

ABN , Publish Date - Jul 30 , 2025 | 01:13 PM

త‌మ్ముడు సినిమాతో తీవ్రంగా నిరాశ ప‌ర్చిన నితిన్ కెరీర్ తిరోగ‌మ‌నంలో ప‌డిన సంగ‌తి తెలిసిందే.

Nithiin

టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా విజయం కోసం ఎదురుచూస్తున్న కుర్ర హీరోల్లో నితిన్ (Nithiin) టాప్ ప్లేస్‌లో ఉంటాడు.

ఇటీవ‌ల త‌మ్ముడు సినిమాతో తీవ్రంగా నిరాశ ప‌ర్చిన నితిన్ కెరీర్ తిరోగ‌మ‌నంలో ప‌డిన సంగ‌తి తెలిసిందే. 2016 అ ఆ సినిమా స‌క్సెస్‌ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన డ‌జ‌న్ సినిమాల్లో 2018లో వ‌చ్చిన భీష్మ మిన‌హా మ‌రో స‌క్సెస్ లేక కెరీర్ ఇర‌కాటంలో ప‌డింది. ఐదారేండ్లుగా అలాంటి హిట్ కోసం మొఖం వాచి ఉన్న నితిన్‌ చెక్, రంగ్ దే, మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్టార్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్ ఇప్పుడు త‌మ్ముడు (Thammudu) వంటి వ‌రుస సినిమాలు చేసినా మంచి కాంబినేష‌న్లు ప‌డినా విజ‌యంమాత్రం ద‌రి చేర‌క అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని అన్న చందంలా ప‌రిస్థితి త‌యారైంది.

Nithiin

అయితే.. త‌మ్ముడు రిలీజ్‌కు ముందే క‌మీట్ అయిన రెండు చిత్రాలు ఇప్పుడు నితిన్ చేతిలో ఉండ‌గా అవే ప్ర‌స్తుతం వాటి పైనే ఆయ‌న కెరీర్ ఆధార ప‌డి ఉంది. ఆ చిత్రాల్లో ఒక‌టి మ‌రోసారి దిల్ రాజు (Dil Raju) బ్యాన‌ర్‌లో బ‌ల‌గం (Balagam) వేణు (Venu Yeldandi) ద‌ర్శ‌క‌త్వంలో ఎల్ల‌మ్మ (Yellamma) అనే చిత్రం ఉండ‌గా, మ‌రో వైపు త‌న కేరీర్ క్లోజ్ అనుకున్న స‌మ‌యంలో ఇష్క్ (ISHQ) వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన విక్ర‌మ్ కే కుమార్ (Vikram K Kumar) డైరెక్ష‌న్‌లోనూ ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ప్ర‌స్తుతం త‌మ్ముడు ఎఫెక్ట్‌తో ఎల్ల‌మ్మ కాస్త వాయిదా ప‌డిన‌ట్లు తెలుస్తోండ‌గా విక్ర‌మ్ సినిమానే నితిన్ త‌ర్వాతి ప్రాజెక్టుగా ఉండ‌నుంది. గ‌తంలో సూర్య‌తో 24, మాద‌వ‌న్‌తో 13బీ, నాగ‌చైత‌న్య‌తో మ‌నం, దూత‌, నానితో గ్యాంగ్ లీడ‌ర్‌ వంటి సినిమాలు, సిరీస్‌లు తెర‌కెక్కించిన విక్ర‌మ్‌కు తెలుగు, త‌మిళ రాష్ట్రాల్లో ప్ర‌త్యేక ఫ్యాన్ బేస్ ఉంది.

అలాంటిది ఆయ‌న మ‌రోసారి నితిన్‌తో సినిమా అనేస‌రికి ఇప్పుడు నితిన్‌తో పాటు ఫ్యాన్స్‌కు మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రో ర‌కంగా చెప్పాలంటే ఈ కాంబోపైనే నితిన్ అశ‌ల‌న్నీ ఉన్నాయి. కాగా.. ఇప్పుడు ఈ చిత్రం విష‌యంలో ప‌లు ఆస‌క్తిక‌ర అప్టేట్స్ బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు ఆల్మోస్ట్ పూర్త‌యింద‌ని తెలుస్తోండ‌గా స్పోర్ట్స్, థ్రిల్ల‌ర్‌ బ్యాక్‌డ్రాప్‌లో మూవీ ఉండ‌నుంది. నితిన్ (Nithiin) ఇందులో హార్స్ రైడ‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడ‌ని, ఈ చిత్రానికి 'స్వారీ' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే షూటింగ్ మొద‌లు పెట్టి 2026లో థియేట‌ర్ల‌కు తీసుకు రావాల‌ని ఫ్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌నున్నాయి.

Updated Date - Jul 30 , 2025 | 01:14 PM