Kasarla Shyam: పల్లె పాటకు గౌరవం
ABN , Publish Date - Aug 02 , 2025 | 06:12 AM
వరంగల్‌లో జన్మించిన కాసర్ల శ్యామ్ బాల్యం నుంచే కళల పట్ల ఆసక్తిని ఏర్పరచుకొన్నారు. సినిమాల్లోకి రాకముందు శ్యామ్ జానపద
వరంగల్‌లో జన్మించిన కాసర్ల శ్యామ్ బాల్యం నుంచే కళల పట్ల ఆసక్తిని ఏర్పరచుకొన్నారు. సినిమాల్లోకి రాకముందు శ్యామ్ జానపద గీతాలు రాసి పాడారు. సుమారు 50కి పైగా ఆల్బమ్స్‌కి ఆయన పాటలు రాశారు. 2003లో జయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చంటిగాడు’ సినిమాతో శ్యామ్‌కు తొలి అవకాశం వచ్చింది. 2009లో వచ్చిన ‘మహాత్మా’ సినిమాలో రాసిన ‘నీలపురి గాజుల ఓ నీలవేణి’ పాటకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటి వరకు ఆయన వంద సినిమాల్లో 250కి పైగా పాటలు రాశారు. ‘బలగం’ సినిమాలో ‘ఊరూ పల్లెటూరు’ పాటకు జాతీయ స్థాయిలో ఉత్తమ గేయ రచయిత అవార్డు దక్కింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ‘ ఎందరో ప్రముఖుల తర్వాత ‘ఊరు పల్లెటూరు’ పాటకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అదృష్టంగా భావిస్తున్నా. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ పల్లె స్వచ్ఛతను, చాటి చెప్పిన ఈ పాట జాతీయ స్థాయిలో నాకు గుర్తింపు తీసుకొచ్చినందుకు తెలుగు వాడిగా చాలా సంతోషపడుతున్నా. ఈ అవార్డు రావడానికి కారణమైన చిత్ర దర్శకుడు వేణుకు, నిర్మాతలు హర్షిత్‌రెడ్డి, హర్షిత, దిల్‌రాజుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత మంచి పాటకు సంగీతం సమకూర్చిన భీమ్స్‌కు, గాయకులు రామ్ మిరియాల, మంగ్లీకి నా కృతజ్ఞతలు’ అని అన్నారు.