Modi - RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై మోదీ ప్రశంసలు...

ABN , Publish Date - May 01 , 2025 | 11:12 PM

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు.


ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ముంబైలోని జియో కన్వెన్షన్‌ సెంటర్‌లో వరల్డ్‌ ఆడియో విజువల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ (Waves- వేవ్స్‌ 2025)ను ఆయన ప్రారంభించారు. ఈ సదస్సు మే ఒకటో తేది నుంచి మే 4 వరకు జరగనుంది. ఈ సందర్భంగా మోదీ చేసిన ప్రసంగంలో పలువురు సినీ ప్రముఖుల గురించి ప్రస్తావించారు. రజనీకాంత్‌, మోహన్‌లాల్‌, షారుఖ్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌, రణబీర్‌ కపూర్‌, అలియా భట్‌, రాజ్‌ కపూర్‌, సత్యజిత్‌ రే, ఎఆర్‌ రెహమాన్‌, ఎస్‌ఎస్‌ రాజమౌళి వంటి పలువురు సినీ దిగ్గజాలను ఆయన ప్రశంసించారు. ప్రపంచ వేదికపై భారతీయ సినిమాకు దక్కిన గౌరవం గురించి ఆయన మాట్లాడారు. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన  దర్శకుడు రాజమౌళి గురించి ఆయన మాట్లాడారు. ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఎంతగా పాపులర్‌ అయిందో తెలిసిందే.  ఈ పాటకు ఆస్కార్‌ రావడంతో దీని గురించి వేవ్స్‌ సదస్సులో ప్రధాని మోదీ గుర్తు చేశారు. భారతీయ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లడంలో మన దేశ సినిమా రంగం విజయం సాధించిందన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్‌ దక్కడమే అందుకు నిదర్శనమని చెప్పారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం, రాజమౌళి సినిమాలు భారతీయ సంస్కృతిని ప్రపంచానికి తీసుకువెళ్లిందని అన్నారు. రష్యాలో రాజ్‌ కపూర్‌ పాపులారిటీ, కేన్స్‌లో సత్యజిత్‌ రే పాపులారిటీ, ఆస్కార్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ విజయం సాక్ష్యమని వేవ్స్‌ సదస్సులో ప్రధాని మోదీ పేర్కొన్నారు. వేవ్స్‌ 2025 సదస్సులో మోదీ భారతీయ సినిమాకు చెందిన ఐదుగురు దిగ్గజ వ్యక్తులు గురుదత్‌, పి భానుమతి, రాజ్‌ ఖోస్లా, రిత్విక్‌ ఘటక్‌, సలీల్‌ చౌదరిలపై స్మారక పోస్టల్‌ స్టాంపులను విడుదల చేశారు. 

Updated Date - May 01 , 2025 | 11:12 PM