Ram Charan Vs Nani: పెద్ది వర్సెస్ ప్యారడైజ్.. బాక్సాఫీస్ పోరు..
ABN , Publish Date - Dec 09 , 2025 | 04:21 PM
టాలీవుడ్ (Tollywood Boxoffice0 బాక్సాఫీస్ వేడెక్కుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ సీజన్‌ను టార్గెట్ చేస్తూ రెండు భారీ పాన్-ఇండియా చిత్రాలు ఒకేసారి తలపడనున్నాయి.
టాలీవుడ్ (Tollywood Boxoffice0 బాక్సాఫీస్ వేడెక్కుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ సీజన్‌ను టార్గెట్ చేస్తూ రెండు భారీ పాన్-ఇండియా చిత్రాలు ఒకేసారి తలపడనున్నాయి. ఒక్క రోజు వ్యవధిలో మార్చి 26న నాని (Nani)- శ్రీకాంత్ ఓదెల (Srikanth odela) కాంబినేషన్‌లో వస్తున్న ది ప్యారడైజ్, మార్చి 27న రామ్ చరణ్ (Ram charan) - బుచ్చిబాబు సానా (buchcuibabu sana) కాంబోలో వస్తున్న పెద్ది సినిమాలు రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ క్లాష్ ఇద్దరు స్టార్ హీరోల అభిమానులకు పండగే అయినా, కలెక్షన్ల పరంగా, థియేటర్ల లభ్యత పరంగా ఇది ఇరు చిత్రాలకు మైనస్ అయ్యే ప్రమాదం ఉంది. సినీ పరిశ్రమలో రిలీజ్ డేట్ అనేది కేవలం ఒక తేదీ మాత్రమే కాదు, ఒక సినిమా భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశం. పెద్ద సినిమాలకు అనుకూలమైన డేట్‌ను సెట్ చేయడంలో ఏ మాత్రం తేడా వచ్చినా, ఆ ప్రభావం ఫలితంపై పడడం ఖాయం. ఒకే సీజన్‌లో రెండు పెద్ద సినిమాలు రాకుండా మేకర్స్ సాధారణంగా జాగ్రత్త పడుతుంటారు. కానీ, ఇక్కడ కేవలం ఒకే రోజు తేడాతో ఈ రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాయి. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు టాలీవుడ్‌తో పాటు పాన్-ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ఉంది. మరి, ఈ హోరాహోరీ పోరులో వెనక్కి తగ్గి, మంచి ఓపెనింగ్ కోసం తమ రిలీజ్ డేట్‌ను రీ-షెడ్యూల్ చేసుకునేది ఎవరన్నది సస్పెన్స్.. (Peddi vs The paradise)
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే, పెద్ది చిత్రం నిర్మాణ పరంగా స్పష్టంగా ఒక అడుగు ముందున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పెద్ది షాట్, చికిరి చికిరి సాంగ్ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ రెండూ కూడా పెద్ది సినిమాపై అంచనాలను భారీ స్థాయిలో పెంచాయి. పైగా చికిరి చికిరి సాంగ్ సోషల్ మీడియాలోనూ ట్రెండ్ సృష్టిస్తోంది. ఇక పెద్ది షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయినట్లు సమాచారం. జనవరి నెలాఖరుకల్లా సినిమా షూటింగ్ మొత్తం పూర్తిచేసేందుకు మేకర్స్ గట్టి ప్లాన్ వేశారు. ప్రస్తుతం శివ రాజ్‌కుమార్, రామ్ చరణ్‌లకు సంబంధించిన కీలకమైన యాక్షన్ ఘట్టాలను చిత్రీకరిస్తున్నారట. షూటింగ్ త్వరగా పూర్తయితే, మిగిలిన సమయాన్ని పూర్తిస్థాయిలో పోస్ట్-ప్రొడక్షన్ పనులకు, భారీ ప్రమోషన్స్‌కు కేటాయించే అవకాశం ఉంటుంది. ఇది సినిమాకు కలిసొచ్చే పెద్ద ప్లస్ పాయింట్.
మరోవైపు ది ప్యారడైజ్ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ, అనుకున్న సమయానికి వచ్చే విషయంలో కాస్త వెనకబడినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి షూటింగ్ కంటే కూడా పోస్ట్-ప్రొడక్షన్ పనులు, ముఖ్యంగా గ్రాఫిక్స్ పని ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. భారీ స్థాయిలో గ్రాఫిక్స్ పనులు ఉండడం వల్ల, అనుకున్న మార్చి 26 రిలీజ్ డేట్‌కు సిద్ధం కావడం కష్టమే అని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అందుకే ది ప్యారడైజ్ మేకర్స్ ఏప్రిల్ చివరి వారం లేదా మే నెల మొదటి వారంలో రిలీజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. వేసవిలో పూర్తిస్థాయి ప్రేక్షకులను ఆకర్షించడానికి ఇది తెలివైన నిర్ణయం కావచ్చు. రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు లేదా ఒక్కరోజు గ్యాప్‌లో రిలీజైతే జరిగే నష్టం అంతా ఇంతా కాదు. థియేటర్ల సమస్య, తొలిరోజు కలెక్షన్లలో కోత, ప్రేక్షకులలో గందరగోళం వంటివి అనివార్యం. పెద్ది టీమ్ వారి రిలీజ్ డేట్‌పై పట్టుదలతో ఉండి, షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తుంటే, ది ప్యారడైజ్ టీమ్ పోస్ట్-ప్రొడక్షన్ పనుల కారణంగా వెనక్కి తగ్గే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే, చివరి నిమిషంలో అనూహ్యంగా పెద్ది టీమ్ కూడా పోస్ట్-ప్రొడక్షన్ క్వాలిటీ కోసం వెనక్కి తగ్గే ఛాన్స్ లేకపోలేదు. సోలో సోలోగా రిలీజ్ అయితే కలెక్షన్ల పరంగా కచ్చితంగా ప్రయోజనం చేకూరుతుంది. చూడాలి ఏం జరుగుతుందో!?