Nani Sujeeth: నాని, సుజిత్.. మొదలు పెట్టారు! టైటిల్ అదేనా
ABN , Publish Date - Oct 03 , 2025 | 06:50 AM
నాని హీరోగా సుజీత్ దర్శకత్వంలో కొత్త సినిమా హైదరాబాద్‌లో లాంచ్ అయింది. వెంకటేశ్ ముఖ్య అతిథిగా క్లాప్ కొట్టారు.
నాని (Nani), సుజీత్ (Sujeeth) కాంబినేషన్‌పై ఎప్పటినుంచో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ‘ఓజీ’ సినిమా విడుదలకు ముందే ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటికీ, ఈ తర్వాత ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ప్రాజెక్ట్ కాస్త నిలిచి పోయిందనే అనుమానాలు పెరిగాయి. అయితే వాటన్నింటికీ ఎట్టకేలకు బ్రేక్ వేశారు మేకర్స్.
దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకకు టాలీవుడ్ సీనియర్ స్టార్ వెంకటేశ్ (Venkatesh) ముఖ్య అతిథిగా హాజరై, ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. సోషల్ మీడియాలో ఇప్పటికే పూజా కార్యక్రమాల ఫొటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ ప్రాజెక్ట్‌పై సుజీత్ ఇటీవలే స్పందిస్తూ, ఇది ‘ఓజీ యూనివర్స్’లో భాగం కాదని, తన తొలి హిట్ ‘రన్ రాజా రన్’ లాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుందని చెప్పాడు. అయితే.. ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo) అనే టైటిల్ వినిపిస్తున్నప్పటికీ, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. నిర్మాత వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుందని, వరుస అప్‌డేట్స్ రాబోతున్నాయని ఆయన తెలిపారు.
ప్రస్తుతం నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ (The Paradise) అనే చిత్రంలో నటిస్తుండగా, సుజీత్ మాత్రం తన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఓజీ’ విజయోత్సాహంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో నాని – సుజీత్ కాంబినేషన్ కొత్త సినిమాపై అంచనాలు సహజంగానే పెరిగాయి. ఒకవైపు నాని రొమాంటిక్ – యాక్షన్ రోల్స్‌లో మంత్రముగ్ధుల్ని చేస్తుంటే, మరోవైపు సుజీత్ స్టైలిష్ టేకింగ్‌కి పేరుగాంచాడు. దీంతో ఈ సినిమా యువతను, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటుందని ట్రేడ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా అనంతరం సుజీత్ ఓజీ ఫ్రీక్వెల్ గానీ సీక్వెల్ ఏదైనా స్టార్ట్ చేసే అవకాశం ఉంది.