Vanara: నందు హీరోగా వెనక్కి... విలన్ గా ముందుకు..

ABN , Publish Date - Dec 10 , 2025 | 01:55 PM

నందు హీరోగా నటించిన 'సైక్ సిద్ధార్థ' మూవీ జనవరి 1కి వాయిదా పడగా, అతను విలన్ గా నటించిన 'వానర' మూవీ డిసెంబర్ 26న రాబోతోంది.

Vanara Telugu movie

యువ నటుడు నందు చాలా కాలం తర్వాత హీరోగా నటించి, నిర్మించిన సినిమా 'సైక్ సిద్ధార్ధ'. డిసెంబర్ 12న జనం ముందుకు రావాల్సిన ఈ సినిమా 'అఖండ 2' కారణంగా వాయిదా పడింది. ఏకంగా జనవరి 1కి వెళ్ళిపోయింది. చిత్రం ఏమంటే... ఇక ఈ యేడాది నందు నటించిన మూవీ రాదని అనుకోవడానికి లేదు. ఎందుకంటే నందు విలన్ గా నటించిన 'వానర' సినిమా ఇప్పుడు డిసెంబర్ 26న విడుదల కాబోతోంది.

నందు, యామిని భాస్కర్, ప్రియాంక రెబెకా, సాక్షి అత్రీ, మౌనిక 'సైక్ సిద్ధార్థ' మూవీలో కీలక పాత్రలు పోషించారు. వరుణ్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీనందు, శ్యామ్ సుందర్ రెడ్డి నిర్మించారు. రానా దగ్గుబాటి ఇప్పుడీ సినిమాను జనవరి 1న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే దీనికి ఆరు రోజుల ముందు డిసెంబర్ 26న రాబోతున్న 'వానర' మూవీలో నందు విలన్ గా చేశాడు. సో... హీరోగా నటించిన సినిమా వెనక్కి వెళితే... దానికంటే ముందు విలన్ గా నటించిన సినిమా రాబోతోంది.


ఇక 'వానర' మూవీ విషయానికి వస్తే... అవినాశ్ తిరువీధుల హీరోగా నటించి, డైరెక్ట్ చేసిన సినిమా ఇది. సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటించగా, నందు విలన్ గా చేశాడు. ఈ మూవీని అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, సి. అంకిత్ రెడ్డి ప్రొడ్యూస్ చేశారు. మైథలాజికల్ రూరల్ డ్రామాగా తెరకెక్కిన 'వానర'కు సాయి మాధవ్ బుర్రా మాటలు రాశాడు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందించాడు. విశేషం ఏమంటే ఈ మధ్య కాలంలో డిఫరెంట్ పబ్లిసిటీ చేస్తూ ఈ సినిమాను మేకర్స్ జనంలోకి బాగా తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'లంకా దహనానికి వానర సేన సిద్ధం' అంటూ దీనిని రిలీజ్ చేశారు. అయితే ఇప్పటికే క్రిస్మస్ సీజన్ లో ఆది సాయికుమార్ 'శంబాల', రోషన్ మేకా 'ఛాంపియన్', 'పతంగ్', 'దండోరా' విడుదల కాబోతున్నాయి. తాజాగా డిసెంబర్ 12న రావాల్సిన 'ఈషా' మూవీని డిసెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. సో... డిసెంబర్ 26న రాబోతున్న 'వానర' బాక్సాఫీస్ బరిలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

Updated Date - Dec 10 , 2025 | 01:55 PM