NTR: నాలుగోత‌రం NTR సినిమా ప్రారంభ‌మైంది

ABN, Publish Date - May 12 , 2025 | 11:01 AM

ఎన్టీఆర్ కుటుంబం నుంచి నాలుగోతరం నట వారసుడు హరికృష్ణ మనవడు ఎన్టీఆర్ తొలి చిత్రం సోమ‌వారం ఎన్టీఆర్ ఘాట్‌లో అంగ‌రంగ‌వైభ‌వంగా ప్రారంభం అయింది.

ntr

ఎన్టీఆర్ కుటుంబం నుంచి నాలుగోతరం నట వారసుడు హరికృష్ణ మనవడు ఎన్టీఆర్ (Nandamuri Taraka RamaRao) తొలి చిత్రం సోమ‌వారం ఎన్టీఆర్ ఘాట్‌లో అంగ‌రంగ‌వైభ‌వంగా ప్రారంభం అయింది. ప్ర‌ము్ దర్శ‌కుడు వైవీఎస్ చౌద‌రి (Y V S Chowdary) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వీణారావు (Veenah Rao) ఆరంగేట్రం చేస్తోంది. కీర‌వాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ కార్య‌క్ర‌మానికి ఎన్టీఆర్ కుమార్తెలు నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరీ (Purandeswari), గారపాటి లోకెశ్వరిల‌తో పాటు బాలకృష్ణ సతీమణి వసుంధరలు ముఖ్య అతిథులుగా హ‌జ‌ర‌య్యారు. నారా భువ‌నేశ్వ‌రి ( Bhuvaneshwari) క్లాప్ కోట్ట‌గా నంద‌మూరి మోహ‌న కృష్ణ (Nandamuri Mohana Krishna )ఫ‌స్ట్‌ షాట్‌కు దర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా పురందేశ్వరీ, నారా భువనేశ్వరిలు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గారు నటుడిగా చిరస్మరణీయులు, ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ ,హరికృష్ణ .. కళామతల్లికి సేవలు అందించారు. అనంతరం కల్యాణ్ రామ్ ,తారక్ అంకితభావంతో పని చేస్తున్నారు. ఇప్పుడు నందమూరి నాలుగోతరం నుంచి వ‌స్తోన్న‌ మరో హీరో రామ్‌కు ఎన్టీఆర్, హరికృష్ణ, జానకీరామ్ ఆశీస్సుల‌తో పాటు మా అందరి ఆశీస్సులు ఉంటాయన్నారు. తన ముత్తాత ఎన్టీఆర్ లానే కీర్తి ప్రతిష్టలు లభించాలని, ప్రతిభతో గొప్ప స్దాయికి ఎదగాలని కాంక్షించారు. ఎన్టీఆర్ గారి లెగసీని నాలుగోతరం పెద్దమనవడు ఎన్టీఆర్ కొనసాగిస్తున్నాడు. ఎన్టీఆర్ గారికి వైవిఎస్ భక్తుడు వారు న్యూ టాలెంట్ రోర్ పేరుతో ఎన్టీఆర్ ను హీరోగా ఎన్టీఆర్ ఘాట్‌లో ఈ చిత్ర ప్రారంభం కావటం ఆనందంగా ఉందనన్నారు.

నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ.. నేను అస్త్ర సన్యాసం చేసి 25 ఏళ్లయింది. నా చివరి సినిమా గొప్పింటి అల్లుడు. ఇప్పుడు నా మనవడు సినిమా ఫస్ట్ షాట్ చేశాను అన్నారు. ఎన్టీఆర్ గారికి జానకీరామ్ ముద్దుల మనవడని జానకీ రామ్ కొడుకు ఫారిన్‌లో పుట్టాడని, తాతగారి మీద అభిమానంతో ఎన్టీఆర్ పేరు పెట్టడం జరిగిందని, అతనికి అలా ఎన్టీఆర్ అనేది పుట్టుకతో వచ్చిన పేరని అన్నారు. వైవిఎస్ , గీత గార్ల‌కు ఈ సినిమాతో లాభాలు రావాలి.. మా ఎన్టీఆర్ కు పేరు ప్రఖ్యాతలు రావాలని కోరుకుంటున్నా అన్నారు. ఆపై నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనరూప, గారపాటి శ్రీనివాస్, గారపాటి లోకేశ్వరీలు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కళామతల్లి ముద్దుబిడ్డ అని వారి ముని మనవడు ఎన్టీఆర్ హీరోగా ఎదగాలని, వైవిఎస్ మంచి సబ్జెక్ట్ రెడీ చేశారని, వైవిఎస్ ,గీతల‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. హనుమంతుని హృదయంలో రాముడు వలే.. వైవిఎస్ గారి హృదయంలో ఎన్టీఆర్ గారు ఉంటారన్నారు.


సినిమా షూటింగ్ ప్రారంభం అనంత‌రం ద‌ర్శ‌కుడు వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ.. ఈ సినిమా తెలుగు సంస్కృతి ,హైందవ సాంప్రదాయం నేపథ్యంలో ఉంటుందని, కీరవాణి ,సాయిమాధవ్ బుర్రా వంటి గొప్ప టెక్నిషియన్స్ వర్క్ చేస్తున్నారని అన్నారు. నందమూరి కుటుంబసభ్యులంతా ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి మా సినిమా ప్రారంబోత్సవానికి వచ్చారని, బాలకృష్ణ గారి సతీమణి వసుంధర గారు మా గీతకు ప్రత్యేకంగా ఆశీస్సులు అందించారని శుభసూచికంగా భావిస్తున్నామ‌న్నారు.

Updated Date - May 12 , 2025 | 11:08 AM