Nandamuri Balakrishna: ఏం చూసుకొనిరా బాలయ్యకు అంత పొగరు..
ABN , Publish Date - Dec 14 , 2025 | 09:25 PM
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) - బోయపాటి శ్రీను (Boyapati Sreenu) కాంబోలో వచ్చిన నాలుగో సినిమా అఖండ 2 తాండవం (Akhanda 2 Thaandavam).
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) - బోయపాటి శ్రీను (Boyapati Sreenu) కాంబోలో వచ్చిన నాలుగో సినిమా అఖండ 2 తాండవం (Akhanda 2 Thaandavam). 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించాడు. నిర్మాతల గొడవ వలన అఖండ 2 డిసెంబర్ 5 నుంచి 12 కి వాయిదా పడిన విషయం తెల్సిందే. ఇక ఎన్నో అంచనాల మధ్య 12 న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకుంటుంది. దీంతో మేకర్స్ హైదరాబాద్ లో అఖండ భారత్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పేరుతో సక్సెస్ మీట్ ని నిర్వహించారు.
ఇక ఈ సక్సెస్ మీట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ.. భారతదేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఏ ఉద్దేశ్యంతో అయితే ఈ సినిమా తీశామో ఆ ఉద్దేశ్యాన్ని ప్రేక్షకులు పాటించాలి. గుడికెళ్ళి పాటలు వింటే భక్తి అవుతుంది. అదే లోకాన్ని అవగాహన చేసుకుంటే జ్ఞానం అవుతుంది. ఇక ఈ సినిమా చూసిన అందరూ ఏమంటున్నారు అంటే.. ఈనాడు సనాతన హైందవ ధర్మం మీసం మెలేసిందని.. మంత్రోచ్ఛారణ, భారత దేశం మూలాలు, మన ధర్మం, మన గర్వం.. మన తేజస్సు కలగలిపిన సినిమా అఖండ అని అందరూ అంటున్నారు.
యావత్ ప్రపంచం అఖండ అద్భుతమని చెప్తున్నారు. ఇలాంటి అద్భుతమైన సినిమా మాకు అందించినందుకు బోయపాటికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో ప్రతి డైలాగ్ ఒక ఆణిముత్యం. ప్రతి సీన్ లో ఉద్వేగం, ఉత్తేజ ప్రకంపనలు అని జనం అంటున్నారు. సినిమా అంటే మనిషికి అన్నవస్త్రాలతో పాటు ఒక అవసరంగా మార్చుకున్నాడు. ఈరోజు నాకు గర్వంగా ఉంది. ఇది ఐదో సినిమా .. త్వరలో ఆరోది రాబోతుంది. చరిత్రలో చాలామంది ఉంటారు. కానీ, సృష్టించిన చరిత్రను మరలా.. మరలా తిరగరాసి.. మరలా మరలా సృష్టించేది ఒక్కరే. అది ఒక శక్తి. నేనే ఆ శక్తి.. నాదే ఆ శక్తి. చరిత్ర రాయాలన్నా మేమే.. చరిత్ర సృష్టించాలన్నా మేమే .. ఆ చరిత్రను తిరగరాయాలన్నా మేమే. ఇదంతా నేనేదో పొగరుతో మాట్లాడడం లేదు. చాలామంది అంటారు.. ఏం చూసుకొనిరా బాలయ్యకు ఇంత పొగరు అంటారు.. నన్ను చూసుకొనే నాకు పొగరు. ఎవరిని చూసుకొనిరా బాలయ్యకు ఇంత దైర్యం అంటారు.. నా వ్యక్తిత్వమే నన్ను ఉసిగొల్పే విప్లవంగా అడుగుడగునా చూపిస్తాను. ఏంట్రా వీడికి అన్ని తెలుసా అంటారు. నన్ను నేను తెలుసుకోవడం కన్నా గొప్ప విద్య ఏం ఉంటుంది అని సవాలుగా నిలబడతాను. ఇదంతా పొగరు కాదు. అంతా ఆ పరమేశ్వరుడు దయ.
సినిమా, సంగీతం వలనే నాకు ఉత్సాహం రెట్టింపు అవుతుంది. నా వృత్తే నా దైవం.. ఆ వృత్తే ఈ అఖండ సినిమాలో నా పాత్ర. ఈ పాత్ర ఎలా అచేశారు అంటే.. యాక్టింగ్ అంటే నవ్వడం, అరవడమో, కళ్ళలో కన్నీళ్లు తెప్పించడమో కాదు. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం.. అది నా తండ్రి ఎన్టీఆర్ నుంచి వచ్చింది. భారతదేశమే కాదు యావత్ ప్రపంచం ప్రేక్షకులకు సంబంధించిన సినిమా. ఎక్కడచూసినా అశాంతి, యుద్దాలు, విభేదాలు ఇవే ఉన్నాయి. ఇది కేవలం మహా భారతం అనే కాదు ఇందులో బైబిల్, ఖురాన్ కూడా ఉన్నాయి. సినిమా అంత గొప్ప మాధ్యమం ఇంకొకటి లేదు. దాన్ని సరిగ్గా వాడుకోవాలి. సినిమా అంటే అన్ని ఉండాలి. కానీ, అవి ఎంతవరకు వాడుకోవాలి అనేది తెలిసి ఉండాలి. ఈ విజయం నా ఒక్కడిదే కాదు.. అందరి శ్రమ, కృషి ఉంది. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు.. అందరూ కుటుంబ సమేతంగా అఖండ 2 ని వీక్షించండి' అని బాలయ్య చెప్పుకొచ్చాడు.