Balakrishna: బాల‌కృష్ణ కొత్త అవ‌తారం.. సింగర్‌గా మారుతోన్న‌ బాలయ్య‌! 'సాహోరే బాహుబలి' తరహాలో సాంగ్

ABN , Publish Date - Dec 18 , 2025 | 10:04 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. త్వ‌ర‌లో ఆయ‌న మ‌రో కొత్త అవ‌తారం ఎత్త‌నున్నాడు.

Nandamuri Balakrishna

నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన అఖండ 2 (Akhanda2 Thaandavam) చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో, 'అఖండ' మొదటి భాగం విజయంతో పెరిగిన అంచనాలకు తగ్గట్టుగానే, ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదలైంది. థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమా, విడుదలైన మొదటి రోజే ఏకంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి సంచలనం సృష్టించింది. అంతేగాక సినిమా విడుద‌లైన వారంలోనే100 కోట్ల మార్కును సైతం దాటి 200 కోట్ల మార్కును ట‌చ్ చేసింది

ఇక 'అఖండ 2' తర్వాత బాలకృష్ణ తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి సారించారు. ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా అధికారికంగా ప్రారంభమైంది. 'వీర సింహారెడ్డి' వంటి ఘన విజయం తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో చిత్రమిది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ మహారాజు పాత్రలో కనిపించనున్నారు. మహారాణి పాత్రకు స్టార్ హీరోయిన్ నయనతారను ఎంపిక చేశారు. బాలయ్య ఈ సినిమాలో మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతుండటం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది.

ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ తాజాగా మూవీకి సంబంధించిన ఒక సర్‌ ప్రైజింగ్ అప్‌ డేట్‌ను వెల్లడించారు. ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైన 'స్పెషల్ సాంగ్' ఉండబోతుందని చెప్పారు. ఆ పాటను స్వయంగా బాలకృష్ణే పాడబోతున్నారని అన్నారు. తమన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. ఆ పాట 'బాహుబలి' సినిమాలో దలేర్ మెహందీ పాడిన "సాహోరే బాహుబలి" తరహాలో, పవర్‌ఫుల్‌గా, రాజసం ఉట్టిపడే విధంగా ఉంటుందని ఆయన వివరించారు. బాలకృష్ణ గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'పైసా వసూల్' సినిమాలో "మామా ఎక్ పెగ్ లా" అనే చార్ట్‌బస్టర్ సాంగ్‌ను పాడారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆయన సింగర్‌గా మారబోతుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు బాలకృష్ణ – తమన్ కాంబినేషన్ టాలీవుడ్‌లో విజయవంతమైన జంటగా నిలిచింది. ఇప్పటికే వీరి కాంబోలో డిక్టేటర్, అఖండ, వీర సింహా రెడ్డి, డాకు మహారాజ్, భగవంత్ కేసరి, అఖండ-2 వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. దీంతో వీరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ విజయవంతమైన కాంబినేషన్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

Updated Date - Dec 18 , 2025 | 10:04 AM