Nandamuri Balakrishna: నందమూరి వారసుడి ఎంట్రీ.. బాలయ్య ఫ్లానింగ్ అదిరింది!
ABN , Publish Date - Nov 22 , 2025 | 10:14 PM
నటసింహ బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ కోసం అభిమానులు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు. సోలో హీరోగానే ఎంట్రీ ఇస్తాడని వినిపించింది.
నటసింహ బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటవారసుడు మోక్షజ్ఞ కోసం అభిమానులు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు... సోలో హీరోగానే ఎంట్రీ ఇస్తాడని వినిపించింది. కానీ, ఇప్పుడు తండ్రితో కలసి మోక్షజ్ఞ తొలిసారి తెరపై తళుక్కుమన బోతున్నాడని సమాచారం. ఆ ముచ్చటేంటో చూద్దాం...
ఆనందాల వేళ అనుకోకుండా కొన్ని పదాలు వెలువడతాయి... తరువాత అవి నిజరూపం దాలుస్తూ ఉంటాయి... నటునిగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న బాలకృష్ణ (Nandamuri Balakrishna) కు 'ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా' ప్రారంభం రోజునే సన్మానం జరిగింది... ఈ ఆనంద సమయంలో బాలకృష్ణ తన తరువాతి ప్రాజెక్ట్స్ గురించి చెబుతూ 'ఆదిత్య 369' సీక్వెల్ గా 'ఆదిత్య 999 మ్యాక్స్స (Aditya 999)రానుందని తెలిపారు.
అంతేకాదు, అందులో తనయుడు మోక్షజ్ఞ (Mokshagna) తో కలసి నటిస్తాననీ బాలయ్య చెప్పారు. దాంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఎందుకంటే బాలయ్య నటవారసునిగా మోక్షజ్ఞను తెరపై చూడాలని ఫ్యాన్స్ ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు. అది త్వరలోనే కార్యరూపం దాల్చబోతున్నందుకు అభిమానుల ఆనందం అంబరమంటుతోందని చెప్పవచ్చు.
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను తెరపై చూడాలని అభిమానులు ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్నారు. 2001వ సంవత్సరంలో బాలకృష్ణ ఓ భారీ జానపద చిత్రంలో నటించారు... రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాక అది అనివార్య కారణాల వల్ల అటకెక్కింది. మొట్టమొదటిసారి ఆ సినిమాలో మోక్షజ్ఞ కనిపిస్తారని విశేషంగా వినిపించింది.
ఆ సమయానికి మోక్షు వయసు ఏడు సంవత్సరాలు. పైగా ఆ చిత్రాన్ని బాలయ్యకు పలు గోల్డెన్ జూబ్లీ హిట్స్ ఇచ్చిన భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎస్.గోపాల్ రెడ్డి నిర్మిస్తూన్నారు. అందువల్ల మోక్షు ఆ జానపదంలో కనిపించడం ఖాయమని ఫ్యాన్స్ భావించారు. అది కార్యరూపం దాల్చలేదు.
'లెజెండ్' షూటింగ్ సమయంలో కొన్ని షూటింగ్ స్టిల్స్ లో మోక్షజ్ఞ కనిపించాడు. దాంతో 'లెజెండ్'లో మోక్షు నటిస్తాడనీ ఆశించారు అభిమానులు. అప్పుడూ వారికి నిరాశే మిగిలింది. తరువాత బాలయ్య నూరవ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'లోనూ మోక్షజ్ఞ కనిపిస్తాడని వినిపించింది. అప్పుడూ జరగలేదు. చివరకు మొన్న 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందని వినిపించింది. ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. అయితే ఎందువల్లో ఆ షూటింగ్ సాగలేదు... ప్రశాంత్ వర్మ కూడా వేరే ప్రాజెక్ట్ లో బిజీ అయిపోయారు.
ఇలా ప్రతీసారి బాలయ్య నటవారసుడు మోక్షు అరంగేట్రంపై న్యూస్ వినిపించడం తరువాత 'తూచ్...' ఇప్పుడు కాదు అనడం పరిపాటి అయిపోయింది. కానీ, ఇప్పుడు బాలకృష్ణనే స్వయంగా 'ఆదిత్య 999 మ్యాక్స్'లో తనయునితో కలసి నటిస్తానని చెప్పడంతో మళ్ళీ ఫ్యాన్స్ లో ఆశలు చిగురించాయి.
నటరత్న యన్టీఆర్ తన నటవారసులు హరికృష్ణ, బాలకృష్ణ ఇద్దరినీ తొలుత తన సినిమాల్లో నటింప చేశారు. ఆ తరువాతే బాలకృష్ణ సోలో హీరోగా నటించారు. అదే తీరున ముందు మోక్షజ్ఞను తన చిత్రాల్లో నటింప చేసి, ఆ తరువాతే ఫ్రీలాన్సర్ గా వదలాలని బాలయ్య ఆశిస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీన బాలకృష్ణ నటించిన 'అఖండ-2- తాండవంస (Akhanda 2) సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. శుక్రవారం 'అఖండ-2' ట్రైలర్ ను చిక్కబల్లాపూర్ లోని చింతామణి బైపాస్ లో ఆవిష్కరించారు. ఆ వేడుకలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
'అఖండ-2' ట్రైలర్ సైతం బాలయ్య ఫ్యాన్స్ లో మరింత జోష్ నింపిందని చెప్పవచ్చు. ఓ వైపు బాలయ్యకు ఇఫ్ఫీ సన్మానం, మరోవైపు మోక్షజ్ఙ అరంగేట్రం కన్ఫమ్ కావడం, ఇంకో వైపు 'అఖండ-2' ట్రైలర్ లాంచ్ - ఇవన్నీ ఫ్యాన్స్ లో ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఈ ఊపులో రాబోయే 'అఖండ-2'ను చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి 'అఖండ-2' అభిమానులకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తుందో చూడాలి.