Star Boy Siddhu: హీరోగా ఆరు... సితారలో మూడు!
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:49 AM
ఇప్పటికే సిద్ధూ జొన్నలగడ్డతో 'బ్యాడాస్' మూవీని ప్రకటించిన సూర్యదేవర నాగవంశీ ఇప్పుడు కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. దీనికి స్వరూప్ ఆర్.ఎస్.జె. డైరెక్షన్ చేస్తున్నట్టు చెప్పారు. దాంతో 'బ్యాడాస్' మూవీపై నీలినీడలు అలుముకున్నాయి.
స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda)ను తాజా చిత్రం 'తెలుసు కదా' (Telusu kada) కాస్తంత నిరాశకు గురిచేసింది. అలానే దానికి ముందు వచ్చిన 'జాక్' కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో సిద్ధు ఆచితూచి అడుగులు వేయబోతున్నాడు. అతనితో ఇప్పటికే 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాలు నిర్మించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) మరో సినిమా నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. తమ బ్యానర్ లో సిద్ధు నటిస్తున్న మూడో ప్రాజెక్ట్ ఇదని నాగవంశీ ప్రకటించారు. ఇది హీరోగా సిద్ధు జొన్నలగడ్డకు ఆరో సినిమా. ఈ సినిమాను 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె. (Swaroop RSJ) డైరెక్ట్ చేయబోతున్నాడు. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' తర్వాత స్వరూప్ ఆర్.ఎస్.జె. 'మిషన్ ఇంపాజిబుల్' మూవీని డైరెక్ట్ చేశాడు. సందీప్ కిషన్ హీరోగా స్వరూప్ తెరకెక్కించిన 'వైబ్' (Vibe) మూవీ విడుదల కావాల్సి ఉంది. తాజాగా సిద్దుతో నాగవంశీ నిర్మిస్తున్న సినిమాకు దర్శకుడు స్వరూపే కథ, కథనాలను సమకూర్చుతున్నాడు. ఈ సినిమాతో ఓ కొత్త ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నామని నాగవంశీ చెప్పారు.

ఆ సినిమా పరిస్థితి ఏమిటో!?
నిజానికి సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో సిద్థు జొన్నలగడ్డ హీరోగా రవికాంత్ పేరెపు దర్శకత్వంలో 'కోహినూర్' అనే సినిమాను గతంలో ప్రకటించారు. అది రెండు భాగాలుగా వస్తుందని చెప్పారు. కానీ కొన్ని నెలల తర్వాత వీరిద్దరి కాంబోలోనే 'బ్యాడాస్' మూవీని తీస్తున్నట్టు నాగవంశీ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా ప్రస్తక్తి లేకుండా మరో కొత్త చిత్రాన్ని ప్రకటించడంతో 'బ్యాడాస్' మూవీ ఉండదనే భావనను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై నాగవంశీ, రవికాంత్ పేరెపు వివరణ ఇస్తారేమో చూడాలి.
