Nagarjuna: ‘మజ్ను’ బ్రేక్ ఇచ్చింది.. ‘గీతాంజలి’ అలా సెట్ అయింది..
ABN , Publish Date - Aug 17 , 2025 | 08:45 PM
జగపతి బాబు వ్యాఖ్యాతగా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షో చేస్తున్నారు. మొదటి ఎపిసోడ్‌కి నాగార్జున అతిథిగా హాజపరయ్యారు. కెరీర్ బిగినింగ్ జ్ఞాపకాలను సరదా షేర్ చేశారు
జగపతి బాబు (Jagapati babu) వ్యాఖ్యాతగా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షో చేస్తున్నారు. మొదటి ఎపిసోడ్‌కి నాగార్జున (Nagarjuna) అతిథిగా హాజపరయ్యారు. కెరీర్ బిగినింగ్ జ్ఞాపకాలను సరదా షేర్ చేశారు. నాగార్జున, జగపతి బాబు తమ మధ్య అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తాను నటుడిగా మారేందుకు నాగార్జున ప్రోత్సాహం కారణమని జగపతిబాబు చెప్పారు. ఈ ఎపిసోడ్ ‘జీ 5’ ఓటీటీలో స్ర్టీమింగ్ అవుతోంది. అలాగే గీతాంజలి సినిమా ఎలా సెట్ అయిందనేది చెప్పుకొచ్చారు.
ఆయన మాట్లాడుతూ ‘నేను నటించిన మొదటి సినిమాను ‘నాగేశ్వరరావుగారి అబ్బాయి’ అని ప్రేక్షకులు చూశారు. కొందరు మెచ్చుకున్నారు. మరికొందరు విమర్శించారు. ఇంకొందరికి నేను నచ్చలేదు. తర్వాత సినిమాలు చేయమంటున్నారు కదా అని ఓ అరడజను సినిమాలు చేశా. అలా వచ్చిన సినిమాల్లో ‘మజ్ను’ బ్రేక్ ఇచ్చింది. ‘నాగార్జునలో నటుడు ఉన్నాడు’ అని ప్రేక్షకులకు నమ్మకం కలిగించిన చిత్రమది. కమర్షియల్ చిత్రాల్లో ‘ఆఖరి పోరాటం’ సక్సెస్ అయింది. రాఘవేంద్రరావు, హీరోయిన్ శ్రీదేవి వల్లే అది కుదిరింది. ఆ సినిమాలో నేనొక బొమ్మలా ఉన్నానంతే. నాకు నచ్చిందే చేయాలని ఫిక్స్ అయిపోయా. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘మౌనరాగం’ బాగా నచ్చింది. ఆయన తెరకెక్కించే సున్నితమైన కథలకు సరిపోతానని నాకు అనిపించింది. ఆయన వాకింగ్‌కు వెళ్లే పార్క్ వివరాలు తెలుసుకుని, నెలపాటు ఆయన వెంటపడ్డా. పది నిమిషాలు కలిసి నడిచిన తర్వాత ఆయన టెన్నిస్ ఆడేందుకు వెళ్లిపోయేవారు. చివరకు ఏదోలా ఒప్పించా. అలా గీతాంజలి సినిమా కుదిరింది. ఆయన తమిళంలో ఆ సినిమా తీయాలనుకున్నారు. తెలుగులో తీసి, మార్కెట్ పెంచుకోండని ఆయనకు చెప్పా. మేం అనుకున్నట్లుగానే ఆ సినిమా హిట్ అయింది. ఆయనకు టాలీవుడ్‌లో క్రేజ్ దక్కింది’ అని నాగార్జున చెప్పారు.