Mohan Babu: నా తల్లే నాకు కన్నప్ప
ABN , Publish Date - Jun 06 , 2025 | 05:27 AM
మంచు విష్ణు హీరోగా ముఖేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’. మోహన్‌బాబు కీలక పాత్రలో నటించారు. ఈ నెల 27న సినిమా విడుదలవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మోహన్‌బాబు...
మంచు విష్ణు హీరోగా ముఖేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’. మోహన్‌బాబు కీలక పాత్రలో నటించారు. ఈ నెల 27న సినిమా విడుదలవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మోహన్‌బాబు ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘ఓ అమాయకుడు, ఆటవికుడైన తిన్నడు, ఆ పరమేశ్వరునికి తన కళ్లు ఇచ్చి కన్నప్పగా చరిత్రలో మిగిలిపోయారు. మన ఆకలి తెలుసుకున్న అమ్మ, అడగకుండానే అన్నం పెడుతుంది. మనకు ఏది కావాలనుకుంటే అది, వారికి శక్తికి మించి ఉన్నా కూడా మన అమ్మానాన్నలు అందిస్తారు. నా దృష్టిలో మా అమ్మానాన్నలు నాకు కన్నప్పలు. మా అమ్మ పేరు లక్ష్మమ్మ. దురదృష్టవశాత్తు పుట్టుక నుంచే ఆమెకు రెండు చెవులూ వినిపించేవి కావు. ఆ మహాతల్లికి పరమేశ్వరుడు ఐదుగురు సంతానాన్ని ప్రసాదించాడు. మా ఊరు టౌన్‌కు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఓ కాలువ, సువర్ణముఖి నదిని దాటితే గాని ఊరిని చేరలేం. దారి కూడా అంతంత మాత్రమే.
మా ఐదుగురిని మోసుకుంటూ ఆమె ఆ కష్టమైన దారిలోనే ప్రయాణించేది. అది ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. మా కోసం ఆమె చేసినవి గుర్తొస్తే బాధేస్తుంది. నా గొంతును అందరూ మెచ్చుకుంటునప్పుడు ‘ఈ మాటలు నా తల్లి వింటే ఎంత బాగుండేది పరమేశ్వరా’ అని అనుకునేవాడిని. నాకు నా కన్నతల్లే కన్నప్ప’’ అని పేర్కొన్నారు.