Nandamuri Mokshagna: బాలయ్య వారసుడి ఎంట్రీ.. కొత్త ఏడాదిలోనా.. నమ్మొచ్చా

ABN , Publish Date - Dec 31 , 2025 | 02:00 PM

నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా, ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న క్షణం.. మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం. ఇదిగో అదిగో అంటూ కాలం గడిచిపోతున్నా, నందమూరి సింహం నటవారసుడి ఎంట్రీ కోసం ఎదురుచూపులు మాత్రం తగ్గలేదు.

Nandamuri Mokshagna

Nandamuri Mokshagna: నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా, ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న క్షణం.. మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం. ఇదిగో అదిగో అంటూ కాలం గడిచిపోతున్నా, నందమూరి సింహం నటవారసుడి ఎంట్రీ కోసం ఎదురుచూపులు మాత్రం తగ్గలేదు. ఒక దశలో మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) అసలు సినిమాల్లోకి వస్తాడా లేదా అన్న సందేహాలు, అతని లుక్స్‌పై విమర్శలు వచ్చాయి. కానీ, వాటన్నింటికీ స్వస్తి చెబుతూ మోక్షజ్ఞ ఇప్పుడు పక్కా హీరో మెటీరియల్‌లా మారిపోయాడు. జిమ్‌లో కఠిన కసరత్తులు చేసి, సినిమా శిక్షణతో సరికొత్త లుక్‌లో సిద్ధమయ్యాడట.

గత ఏడాది మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను 'హను-మాన్' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ తీసుకున్నారు. ఇది సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే సినిమా అని టాక్ కూడా నడిచింది. కానీ ఆ సినిమాకు హఠాత్తుగా బ్రేక్ పడింది. మళ్లీ ఆ సినిమా ఊసే వినిపించలేదు. దీంతో మళ్లీ మోక్షజ్ఞ అరంగేట్రంపై మళ్ళీ అభిమానుల్లో అయోమయం మొదలైంది. అసలు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడా? రాడా? అన్న సందేహాలు ముసురుకున్నాయి.

ఇక బాలకృష్ణ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ఆదిత్య 369'. దీనికి సీక్వెల్‌గా 'ఆదిత్య 999' చేయాలన్నది బాలయ్య చిరకాల కోరిక. ఈ అద్భుతమైన కథతోనే తన కొడుకును పరిచయం చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సిద్ధం చేసిన ఈ స్క్రిప్టును, ఆయన వయసు రీత్యా డైరెక్ట్ చేసే అవకాశం లేదు. దీంతో ఈ భారీ బాధ్యతను బాలయ్య నమ్మకస్తుడైన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి చేతిలో పెట్టినట్లు సమాచారం. ఇది కాల ప్రయాణం చుట్టూ తిరిగే సోషియో ఫాంటసీ కథ. ఇందులో తండ్రీకొడుకులు ఇద్దరూ కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.

ఇక ఈ ప్రాజెక్ట్ కోసం మోక్షజ్ఞ ఇప్పటికే వర్క్ షాప్స్‌లో పాల్గొంటున్నాడట. తన పాత్రకు కావాల్సిన మేకోవర్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ ఈ వార్త విన్న అభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే కొన్నేళ్లుగా మోక్షు ఎంట్రీ ఈ ఏడాది.. వచ్చే ఏడాది అంటూ చెప్పుకొస్తూనే ఉన్నారు. కానీ, అది మాత్రం జరగడం లేదు. దీంతో అభిమానులు ఈసారైనా నమ్మొచ్చా అని మాట్లాడుకుంటున్నారు. మరి ఈ ఏడాది అయినా మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడా లేదా అనేది చూడాలి.

Updated Date - Dec 31 , 2025 | 02:01 PM