Krishna Master: రేప్‌ కేసు.. ఢీ, బీబీ జోడి డాన్స్ మాస్టర్‌ కృష్ణ అరెస్ట్

ABN , Publish Date - Aug 03 , 2025 | 03:29 PM

ఢీ, బీబీ జోడీ, నీతోనే డాన్స్, డాన్స్ ఐకాన్, సూప‌ర్ జోడి షోల్లో డ్యాన్స్ మాస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Krishna Dance Master

టాలీవుడ్‌లో మ‌రోమారు లైంగిక ఆరోప‌ణ‌ల కేసు న‌మోదైంది. తెలుగులో ఢీ (DHEE), బీబీ జోడీ (BB JODI ), నీతోనే డాన్స్, డాన్స్ ఐకాన్ (𝐃𝐀𝐍𝐂𝐄 𝐈𝐊𝐎𝐍), సూప‌ర్ జోడి (SUPER JODI) లాంటి షోల్లో మెంటర్‌గా, టాప్ కొరియోగ్రాఫర్‌గా మంచి డ్యాన్స్ మాస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ మాస్టర్ (KRISHNA MASTER)ను పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికపై లైంగిక దాడి చేశాడన్న ఆరోపణలపై అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. ఇదిలాఉంటే.. రీసెంట్‌గా వ‌రుణ్‌తేజ్ మ‌ట్కా సినిమాతో పాటు పలు స్టార్ హీరోల సినిమాల్లో డాన్స్ మాస్టర్‌గా కూడా పని చేశాడు.

వివ‌రాల్లోకి వెళితే.. గచ్చిబౌలి (Gachibowli) ప్రాంతానికి చెందిన ఓ పెళ్లయిన మహిళతో కృష్ణ మాస్టర్‌కు సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఆమె కూతురిపై కూడా కృష్ణ‌ లైంగిక దాడి చేశాడంటూ స‌ద‌రు మ‌హిళ‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గచ్చిబౌలి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైన వెంటనే ప‌రారీలో ఉన్న కృష్ణను సైబరాబాద్ పోలీసులు గుర్తించి అతన్ని బెంగుళూరులో ప‌ట్టుకుని అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. కోర్టులో హాజరు పరచిన అనంతరం ప్రస్తుతం రిమాండ్‌లో ఉంచారు.

ఈ నేప‌థ్యంలో.. కృష్ణ మాస్టర్ (KRISHNA MASTER)విష‌యంలో కొత్త విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా యువతులను పరిచయం చేసుకుని, ప‌లువురిని సైతం మోసం చేసిన‌ట్లు అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. ఇదిలాఉంటే కృష్ణ ఇటీవ‌లే ఓ మ‌హిళ‌ను వివాహం చేసుకుని భార్య‌ ద‌గ్గ‌ర ఉన్న రూ.9.50 ల‌క్ష‌లు ఎత్తుకెళ్లి బెంగ‌ళూరులోని త‌న సోద‌రుడి ఇంట్లో త‌ల‌దాచుకున్న‌ట్లు తెలిసింది.

Updated Date - Aug 03 , 2025 | 03:29 PM