Chiranjeevi: ఆరేళ్ల వయసులో రమ దూరమైంది..
ABN , Publish Date - Mar 08 , 2025 | 12:21 PM
అమ్మకు ఇప్పుడు మేము ఐదుగురు బిడ్డలం. అయితే, మరో ముగ్గురు బిడ్డలు చిన్న వయసులోనే చనిపోయారు. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు రమ అని నాకొక సోదరి ఉండేది.
"అమ్మకు ఇప్పుడు మేము ఐదుగురు బిడ్డలం. అయితే, మరో ముగ్గురు బిడ్డలు చిన్న వయసులోనే చనిపోయారు. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు రమ అని నాకొక సోదరి ఉండేది. అనారోగ్యంతో ప్రభుత్వం ఆసుపత్రిలో కన్నుమూసింది. నాన్నకు సమాచారం అంది ఆయన వచ్చేసరికి అంతా అయిపోయింది. ఆ క్షణాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. తలచుకుంటే బాధగా అనిపిస్తుంది’’ అని చిరంజీవి భావోద్వేగానికి (Chiranjeevi Emotional) గురయ్యారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 'మెగా ఉమెన్స్' (Mega womens) పేరుతో స్పెషల్ ఇంటర్వ్యూ విడుదలైంది. అమ్మ అంజనాదేవి (Anjana Devi), చెల్లెళ్లు మాధవి, విజయదుర్గ, సోదరుడు నాగబాబు(Nagababu)తో ఇంటర్వ్యూ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. తమ జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. (International Women's Day)
వీడు మా అబ్బాయి కాదని చెప్పేసింది: చిరంజీవి
మా ఇంట్లో అందరికంటే నేనే ఎక్కువ యాక్టివ్‌గా ఉండేవాడిని. నాకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడు జరిగిన సంఘటనను అమ్మ ఎప్పుడూ చెబుతుంటుంది. సరదాగా ఆడుకుంటూ ఇంట్లో నుంచి రోడ్డు మీదకు వచ్చేసి.. ఎటు వెళ్లాలో అర్థం కాక ఏడ్చుకుంటూ రోడ్డు మీద కూర్చొన్నాను. అక్కడే ఉన్న ఒకాయన నన్ను చూసి తన కొలిమిలోకి తీసుకువెళ్లారు. ఇంట్లో వాళ్లకు కబురు చేశారు. అమ్మ వచ్చేసరికి నేను ఒళ్లంతా మసి పూసుకుని కూర్చొన్నా. నన్ను చూసి అమ్మ గుర్తు పట్టలేకపోయింది. వీడు మా అబ్బాయి కాదు అని చెప్పేసింది. ఎందుకో అనుమానం వచ్చి ఆగి వెనక్కి వచ్చి గుర్తు పట్టింది. ఆ తర్వాత ఇంటికి తీసుకు వచ్చి నన్ను తాళ్లతో కట్టేసింది. అమ్మ నా చలాకీ తనాన్ని అల్లరి అనుకునేది.
తలచుకుంటే బాధగా అనిపిస్తుంది..
అమ్మకు ఇప్పుడు మేము ఐదుగురు బిడ్డలం. అయితే, మరో ముగ్గురు బిడ్డలు చిన్న వయసులోనే చనిపోయారు.
నాన్న ఉద్యోగరీత్యా పనుల్లో బిజీగా ఉంటే అమ్మే ఇంట్లోని అన్ని పనులు చూసుకునేవారు. గృహిణిగా అన్ని బాధ్యతలు ఆమె ఒక్కరే చూసుకునేవారు. దాంతో చిన్నప్పటి నుంచి నేను ఆమెకు పనుల్లో సాయం చేస్తూ ఉండేవాడిని. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు రమ అని నాకొక సోదరి ఉండేది. ఒకసారి తను అనారోగ్యానికి గురైంది. దాంతో తనని అమ్మ, నేను కలిసి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లాం. నాన్నకు ఈ విషయం తెలియదు. రెండు రోజుల తర్వాత చనిపోవడంతో ఆమెను చేతుల్లో ఎత్తుకొని ఇంటికి తీసుకువెళ్లాం. చుట్టుపక్కల వాళ్లు సాయం చేయడంతో ఆ తర్వాత కార్యక్రమాలు పూర్తిచేశాం. తెలిసిన వారి ద్వారా నాన్నకు సమాచారం అందించాం. ఆయన వచ్చేసరికి అంతా అయిపోయింది. ఆ క్షణాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. తలచుకుంటే బాధగా అనిపిస్తుంది.
మా అమ్మని హగ్ చేసుకుంటే ఎనలేని ఎనర్జీ: నాగబాబు
‘చిన్నతనంలో నేను ఎక్కువగా పని చేసేవాడిని కాదు. అన్ని పనులు అన్నయ్యే చేసేవారు. నాకు చెప్పిన పనుల్ని కూడా అన్నయ్యకే ఇచ్చేవాడిని. అలా అప్పుడప్పుడు అన్నయ్య చేతిలో నాకు దెబ్బలు కూడా పడ్డాయి (నవ్వుతూ). చిన్నప్పుడు మా తమ్ముడు కళ్యాణ్ బాబు చాలా వీక్‌గా ఉండేవాడు. అందుకే మా అమ్మ కళ్యాణ్ బాబు మీద ఎక్కువ కేరింగ్‌గా ఉండేవారు. ఇప్పటికీ కళ్యాణ్ బాబు వస్తున్నాడంటే ఇష్టమైన వంటకాలన్నీ వడ్డిస్తుంటారు. తిండి విషయంలో అన్నయ్య ఏం పెట్టినా సైలెంట్‌గా తినేసేవారు. కానీ నేను మాత్రం ఇంట్లో అల్లరి చేసేవాడిని. కళ్యాణ్ బాబు అయితే నచ్చితే తింటాడు లేదంటే సైలెంట్‌గా వెళ్లిపోతాడు. సైలెంట్‌గానే నిరసన తెలిపేవాడు. మా అమ్మని హగ్ చేసుకుంటే నాకున్న బాధలన్నీ మాయం అవుతాయి. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఉన్నట్టుగా.. మా అమ్మ దగ్గర ఆ శక్తి ఉంటుంది. మా అమ్మని హగ్ చేసుకుంటే నాకు ఎనలేని ఎనర్జీ వస్తుంది’
శంకర్ బాబు కష్టజీవి: అంజనమ్మ
మాట్లాడుతూ .. ‘మా శంకర్ బాబు చిన్నతనం నుంచి ఎక్కువగా కష్టపడ్డాడు. చిన్నప్పుడు అంతా నాతోనే ఉండేవాడు. నాకు పనుల్లో సాయం చేస్తుండేవాడు. ఇంటా, బయట పనులు చేసేవాడు. అందరూ కలిసి ఉండాలి.. అందరితో ప్రేమగా ఉండాలి.. ఉమ్మడి కుటుంబంగానే ఉండాలి అని నా పిల్లలకు నేర్పించాను. కానీ ఇప్పుడు అంతగా ప్రేమలు కనిపించడం లేదు. ఉమ్మడి కుటుంబాలు కూడా కనిపించడం లేదు. అందరూ కలిసి మెలిసి ప్రేమతో ఉండాలి’ అని అన్నారు.
అమ్మే మా ధైర్యం: మాధవి, విజయ దుర్గ
విజయదుర్గ మాట్లాడుతూ .. ‘మా అమ్మ ఎప్పుడూ కూడా మమ్మల్ని స్వతంత్ర భావాలతోనే పెంచారు. ఎప్పుడూ ఎవరి మీదా ఆధారపడకూడదు. నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి.. సొంతంగా ఎదగాలి.. సొంతగా నిలబడాలి అని చెబుతూ ఉండేవారు. ఇప్పటికీ నాకు మా అమ్మ చెప్పిన మా మాటలు గుర్తుకు వస్తాయి. ఆ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి. అందుకే నాకు ఎన్ని సమస్యలు వచ్చినా ఒంటరిగా పోరాడేందుకు ప్రయత్నిస్తాను. ఈ ధైర్యాన్ని నాకు మా అమ్మే ఇచ్చారు’ అని అన్నారు.
‘'మా అమ్మ నాకు ఎప్పుడూ సపోర్టివ్‌గా ఉంటారు. కొన్ని సందర్భాల్లో నేను ఒంటరిని అయిపోయానే అని బాధపడుతూ ఉన్నాను. ఆ టైంలో మా అమ్మ నా వద్దకు వచ్చి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఎవ్వరు ఏమన్నా.. ఏం జరిగినా.. ఈ అమ్మ నీ వెంటే ఉంటుంది.. నీకు సపోర్ట్‌గా నిలుస్తుంది అని చేయి పట్టుకుని ధైర్యాన్ని ఇచ్చారు. మా అమ్మ నాకు ఎప్పుడూ అండగా ఉంటారు’ అని మాధవి అన్నారు.