Meenakshi Chaudhary: పురాతత్త్వ శాస్త్రవేత్తగా...

ABN, Publish Date - May 19 , 2025 | 11:57 AM

మీనాక్షి చౌదరి తన తాజా చిత్రంలో ఆర్కియాలజిస్ట్ గా నటిస్తోంది. నాగచైతన్య సైతం అదే పాత్రను చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమాను కార్తీక్ దండు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కెరీర్ సుశాంత్ (Sushanth) 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'తో మొదలైంది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా... మీనాక్షి చౌదరికి మాత్రం మంచి గుర్తింపు లభించింది. గడిచిన నాలుగేళ్ళలో తమిళంతో కలిసి దాదాపు పది పన్నెండు సినిమాల్లో మీనాక్షి చౌదరి నటించింది. విశేషం ఏమంటే... సుశాంత్ తో టాలీవుడ్ లో కెరీర్ మొదలు పెట్టిన ఆమె... సుశాంత్ బావమరిది నాగ చైతన్య (Naga Chaitanya) తో ఇప్పుడు జోడీ కడుతోంది. సుశాంత్ నాగార్జున (Nagarjuna) మేనల్లుడు కావడంతో... అతనికి నాగచైతన్య బావమరిది అవుతాడు. అలా బావ, బావమరుదులతో అమ్మడు జంటగా నటిస్తోందన్న మాట. అంతేకాదు... నాగచైతన్య మేనమావతోనూ మీనాక్షి చౌదరి జోడీ కట్టిన సందర్భంగా ఈ యేడాదే జరిగింది. సంక్రాంతి కానుకగా వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీలో వెంకటేశ్‌ (Venkatesh) ప్రియురాలిగా నటించి, మెప్పించింది మీనాక్షి చౌదరి. వెంకటేశ్ సొంత సోదరి కొడుకే నాగచైతన్య. సో... మీనాక్షి చౌదరి ఇటు మేనమామ, మేనల్లుడితోనూ జోడీ కట్టినట్టు అయిపోయింది.


ఈ ఫ్యామిలీ రిలేషన్స్ ను పక్కన పెడితే... ఇంకా పేరు నిర్ణయించని నాగచైతన్య సినిమాలో మీనాక్షి చేయబోతున్న పాత్ర చాలా కీలకం అని తెలుస్తోంది. ఆమె ఆర్కియాలజిస్ట్ గా ఇందులో నటిస్తోందట. ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ సమీపంలో నిర్మాత బి.వి.యస్.ఎన్. ప్రసాద్ ఓ భారీ అండర్ గ్రౌండ్ సెట్ ను వేశారు. నాగచైతన్య ది కూడా ఆర్కియాలజిస్ట్ పాత్రే అంటున్నారు. దర్శకుడు కార్తీక్ దండు తన తొలి చిత్రం 'విరూపక్ష'(Virupaakasha) లోనూ కథానాయిక సంయుక్త (Samyuktha) కు చాలా కీలకమైన పాత్రను ఇచ్చాడు. కథంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. నిజం చెప్పాలంటే.. సంయుక్త తొలుత సైన్ చేసిన తెలుగు సినిమా కూడా అదే. అయితే చిత్ర నిర్మాణంలో జాప్యం జరగడంతో ఆ సినిమా ఆలస్యంగా విడుదలైంది. 'విరూపాక్ష'లో సంయుక్త పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో... నాగచైతన్య సినిమాలోనూ మీనాక్షి చౌదరికి అంతే ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని మీనాక్షి కూడా స్వయంగా చెప్పింది. తన కెరీర్ లో ఇలాంటి పాత్రను చేయలేదని, బడ్జెట్ పరంగా కూడా తన గత చిత్రాలకు మించి ఇది ఉంటుందని తెలిపింది. ఇంతవరకూ మీనాక్షి చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తు కాగా... నాగచైతన్య మూవీలో ఆమె చేస్తున్న పాత్ర మరో ఎత్తు అంటున్నారు. మరి ఈ సినిమా తర్వాత మీనాక్షి చౌదరి ఏ స్థాయికి చేరుకుంటుందో చూడాలి.

Also Read: Shah Rukh Khan: కింగ్ లో క్వీన్ కీలకపాత్రలో...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 19 , 2025 | 11:58 AM