Mayabazar: తెలుగు సినిమా రంగంలో ఎప్పటికి క్లాసిక్.
ABN , Publish Date - May 20 , 2025 | 07:04 PM
ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి.రంగారావు, సావిత్రి, రేలంగి, గుమ్మడి, ముక్కామల, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, ఆర్. నాగేశ్వర రావు, సూర్యకాంతం, రమణా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన పౌరాణిక చిత్రం 'మాయాబజార్'.
ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి.రంగారావు, సావిత్రి, రేలంగి, గుమ్మడి, ముక్కామల, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, ఆర్. నాగేశ్వర రావు, సూర్యకాంతం, రమణా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన పౌరాణిక చిత్రం 'మాయాబజార్'. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి చిత్రాన్ని రూపొందించారు. దర్శకుడు కె.వి.రెడ్డి "మాయాబజార్" చిత్రాన్ని తెలుగు తెరపై ఓ సెల్యులాయిడ్ కావ్యంగా మలిచారు. మాయాబజార్" చిత్రాన్ని ఈనెల 28న మహానటుడు ఎన్. టి. రామారావు 102వ జయంతి సందర్భంగా బలుసు రామారావు విడుదల చేస్తున్నారు.
మాయాబజార్. సినిమాకు పింగళి నాగేంద్ర రావు అద్భుతమైన మాటలను అందించారు. ఛాయాగ్రాహకుడు మార్కస్ బార్ట్ లే ఈ సినిమాను నవరస భరితంగా తెరమీద చూపించారు.
ఘంటసాల సంగీత దర్శకత్వంలో ఈ చిత్రాల్లోని పాట్లను ఈ తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి.
శ్రీకృష్ణుడు గా ఎన్. టి. రామారావు, ఘటోత్కచుడు గా ఎస్. వి. రంగారావు, శశి రేఖగా సావిత్రి, అభిమన్యుడిగా అక్కినేని నాగేశ్వర రావు ఆయా పాత్రలను సజీవంగా మన ముందు నిలబెట్టారు .27 మార్చి 1957లో ఆంధ్ర దేశంలో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను కలర్ లో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల కోసం రామారావు బలుసు ఈనెల 28న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మాయాబజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ శ్రీ టి.డి.జనార్ధన్ మాట్లాడుతూ "మాయాబజార్ సినిమా అప్పటి ఇప్పటి తరానికి ఒక మైలు రాయి లాంటిది. ఇప్పటి తరంలో ఎన్నో గ్రాఫిక్స్ వచ్చినా ఆనాడే గ్రాఫిక్స్ లేని సమయంలో ఎంతో అద్భుతంగా మాయాబజార్ ను మలిచి తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. మళ్లీ ఇప్పుడు మాయాబజార్ ని బలుసు రామారావు విడుదల చెయ్యడం అభినందించదగ్గ విషయం. సినీరంగంలో రారాజుగా నిలిచిన ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఓ ధృవతారగా అభివర్ణించారు. ఎన్టీఆర్ ముందు, తర్వాతగా తెలుగునాట రాజకీయాల్ని చెప్పుకోవాలని, రాజకీయాల్లో నైతిక విలువల్ని, ప్రజాస్వామ్య విధానాల్ని, సంక్షేమ శకాన్ని ప్రారంభించిన మహాపురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. 2023లో ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీని ఏర్పాటు చేశాము, ఎన్టీఆర్ నమ్మి ఆచరించిన మహోన్నత ఆశయాలు, సిద్ధాంతాలు, విధానాల్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో తాము ఎన్టీఆర్‌కు సంబంధించిన అపురూప గ్రంధాలను వెలువరిచాము. మాయాబజార్ విడుదలై గొప్ప విజయం సాధిస్తుంది అని నమ్మకం నాకుంది. మే 28 న మహానాడులో పాల్గొంటున్న కారణంగా ఆ రోజు నేను మాయాబజార్ ను వీక్షించలేకపోయినా, కుటుంబ సమేతంగా మర్నాడు చూస్తాను. అందరూ దీనిని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
వీర శంకర్ మాట్లాడుతూ.. బలుసు రామారావు నేను చాలా మంచి స్నేహితులం. మే 28 న మాయాబజార్ ను విడుదల చేస్తున్నారని చెప్పడంతో నేను సలహాలు, సూచనలు ఇచ్చాను. NT రామారావు గారితో ఉన్న అభిమానంతో బలుసు రామారావు తన స్వామి భక్తిని చాటుకుంటున్నాడు. ఈ ప్రయత్నం మంచి విజయం సాధించాలని, మే 28 న అందరూ థియేటర్ కి వచ్చి మాయాబజార్ చిత్రాన్ని వీక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
బలుసు రామారావు మాట్లాడుతూ.. నేను రామారావు గారికి వీరాభిమానిని, రామారావు గారి దగ్గర పనిచేసే అదృష్టం నాకు కలిగింది. ఆయన మీదున్న అభిమానంతో నేను మాయాబజార్ ను రిలీజ్ చేస్తున్నాను. నా కోసం వచ్చిన TD జనార్దన్ గారికి, రమేష్ ప్రసాద్ గారికి తదితరులకు రుణపడి ఉంటాను. మే 28 న అందరూ థియేటర్ కి వచ్చి సినిమా చూసి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.