Kannappa Event: ఆ శివుడే నన్ను ఎన్నుకున్నాడనుకుంటున్నా
ABN , Publish Date - Jun 08 , 2025 | 11:19 AM
‘బలవంతుడు ఎదురొచ్చినప్పుడు తలదించిన వాడు బాగుపడతాడు. ఎదురించిన వాడు వాగులో పడతాడు’ ‘నిన్న జరిగింది మర్చిపోను.. నేడు జరగాల్సింది వాయిదా వేయను.. రేపటి గురించి ఆలోచించను.. దటీజ్ రామన్న’ అంటూ మోహన్‌బాబు (Mohan Babu) డైలాగ్‌లతో అలరించారు.
‘బలవంతుడు ఎదురొచ్చినప్పుడు తలదించిన వాడు బాగుపడతాడు. ఎదురించిన వాడు వాగులో పడతాడు’ ‘నిన్న జరిగింది మర్చిపోను.. నేడు జరగాల్సింది వాయిదా వేయను.. రేపటి గురించి ఆలోచించను.. దటీజ్ రామన్న’ అంటూ మోహన్‌బాబు (Mohan Babu) డైలాగ్‌లతో అలరించారు. గుంటూరులో జరిగిన కన్నప్ప ప్రీ రిలీజ్ (Kannappa Pre Release) వేడుకలో ఆయన సందడి చేశారు. సినిమా డైలాగ్‌లతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. మంచు విష్ణు టైటిల్ పాత్ర పోషించిన చిత్రం కన్నప్ప. ముకేశ్ కుమార్ సింగ్ (Mukesh Kumar singh) దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా గుంటూరులో ప్రీ-రిలీజ్ వేడుక నిర్వహించారు.
ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ "ఎవరైతే రోజూ శివ నామస్మరణ చేస్తూ ఉంటారో వాళ్లు వందేళ్లు అష్టైశ్వర్యాలు,, ఆయురారోగ్యాలతో ఉంటారని ధూర్జటి మహాకవి తన పద్యంలో చెప్పారు. భయం అనేది జీవితంలో ఉండకూడదు. నేను తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? అదే విద్యాలయాల్లో పిల్లలకు నేర్పిస్తున్నా. ‘కన్నప్ప’ తీయమని ఆ పరమేశ్వరుడే ఆశీర్వదించాడు. ప్రభాస్ నేనూ ‘బావ.. బావ..’ అనుకుంటాం. మానవత్వం, మంచి హృదయం ఉన్నవాడు. ఈ సినిమాలో క్యారెక్టర్ గురించి అడగ్గానే ‘బావ.. దీని గురించి మీరు నా దగ్గరకు రావాలా? నేనూ విష్ణు మాట్లాడుకుంటాం’ అని అన్నాడు. అలాగే, మోహన్‌లాల్, శరత్‌కుమార్ అడగ్గానే సినిమా చేయడానికి ఒప్పుకొన్నారు. ప్రభుదేవా ఎంత బిజీగా ఉన్నా మా సినిమా కోసం ఎక్కడికంటే అక్కడికి వచ్చాడు. మహాభారతం నేను 16సార్లు చూశా. అంత అద్భుతం తెరకెక్కించిన వ్యక్తి ముకేశ్ కుమార్ సింగ్. ‘కన్నప్ప’కు ఈయన రథసారథి. మంచి అవుట్‌పుట్ తీసుకొచ్చారు. థియేటర్స్‌లో సినిమా చూసి నా బిడ్డ విష్ణును ఆశీర్వదించండి’’ అని అన్నారు.
కన్నప్ప నన్ను వ్యక్తిగా మార్చింది: విష్ణు మంచు
విష్ణు మాట్లాడుతూ ‘‘దాదాపు 50 ఏళ్ల తర్వాత ‘తెలుగు పేక్షకులకు కన్నప్ప కథ చెప్పరా..’అని ఆ శివుడే నన్ను ఎన్నుకున్నాడునుకుంటున్నా. కన్నప్ప’ సినిమా తీసి, ప్రేక్షకుల ముందు ఇలా నిలబడటానికి చాలా మంది సహకరించారు. మా నాన్న నాకు దేవుడు. ఆయన లేకపోతే నేను లేను. ‘కన్నప్ప’ కథ చెప్పగానే దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ వెంటనే ఒప్పుకొన్నారు. ఈ సినిమాలో ఎవరెవరు నటించాలన్నది అంతా శివాజ్ఞ ప్రకారమే జరిగింది. నా మిత్రుడు ప్రభాస్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాన్నగారిపైన ఉన్న ప్రేమ, గౌరవం కారణంగా ప్రభాస్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నాడు. స్నేహాకి విలువ ఉందనడానికి ప్రభాస్ ఓ ఉదాహరణ. వ్యక్తిగా ఆయన్ను ప్రేమించండి. దేవుడు ఉన్నాడా? అని మనకు ఒక్కోసారి అనుమానం ఉంటుంది. అక్కడి నుంచే భక్తి పుడుతుంది. ఆ తర్వాత దేవుడికి దాసోహం అవుతాం. ‘కన్నప్ప’కూడా అంతే. ఈ సినిమా వ్యక్తిగా నన్ను మార్చింది’’ అని అన్నారు.