Manchu Manoj:నాకు మంచి గుర్తింపు తెచ్చే సినిమా
ABN , Publish Date - Sep 05 , 2025 | 01:51 AM
మిరాయ్ నాకు కమ్‌బ్యాక్ ఫిల్మ్ అవుతుంది. ట్రైలర్ విడుదలయ్యాక నా నటనకు ప్రేక్షకుల నుంచి మంచి..
‘‘మిరాయ్’ నాకు కమ్‌బ్యాక్ ఫిల్మ్ అవుతుంది. ట్రైలర్ విడుదలయ్యాక నా నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇంత అద్భుతమైన పాత్రను ఇచ్చిన దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి రుణపడి ఉంటాను’ అని మంచు మనోజ్ అన్నారు. తేజ సజ్జా కథానాయకుడిగా టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ‘మిరాయ్’ ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రతినాయక పాత్ర పోషించిన మనోజ్ మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నారు.
ఈ చిత్రం కథానేపథ్యం కొత్తగా ఉంటుంది. శ్రీరాముని జీవితం, తొమ్మిది పుస్తకాలు, ఇతిహాసాలను మిళితం చేస్తూ సినిమాను అద్భుతంగా రూపొందించారు. ఇందులో నా పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుంది. బద్దకస్తుడు బతికి ఉండకూడదు అనే తాత్వికతతో ప్రవర్తించే పాత్ర నాది.
ఈ సినిమా కోసం ముందుస్తుగా సన్నద్ధమయ్యాను. దాదాపు మూడేళ్లు షూట్ చేశాం. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాను. తేజ పడిన కష్టం తెరపైన మీకు కనిపిస్తుంది. కార్తీక్ సాంకేతికతను ఉపయోగించుకోవడంలో దిట్ట. మరో దర్శకుడు ఈ చిత్రాన్ని తీయాలంటే ఈ బడ్జెట్‌లో అసాధ్యం. తన అనుభవంతో కార్తీక్ హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. దాదాపు సినిమా అంతా రియల్ లొకేషన్లలోనే షూట్ చేశాం. కార్తీక్ గారు ప్రత్యేక శ్రద్ధతో నా పాత్రను తీర్చిదిద్దారు. విశ్వప్రసాద్ గారి విజన్ చాలా గొప్పగా ఉంటుంది. ‘మిరాయ్’ను గ్రాండ్ స్కేల్లో నిర్మించారు. ప్రస్తుతం డేవిడ్ రెడ్డి, రక్షక్ చిత్రాల్లో నటిస్తున్నాను.