Manchu Manoj: మా అన్న ఇంత బాగా చేస్తాడనుకోలేదు
ABN , Publish Date - Jun 28 , 2025 | 02:19 AM
మనోజ్ తన సోదరుడు విష్ణును పొగడడం మంచు అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప చిత్రం శుక్రవారం విడుదలైంది.
- మంచు మనోజ్
మనోజ్ తన సోదరుడు విష్ణును పొగడడం మంచు అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ చిత్రం శుక్రవారం విడుదలైంది. మనోజ్ ఈ సినిమాను థియేటర్లో చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘సినిమా చాలా బాగుంది. నేను అనుకున్న దానికంటే వెయ్యి రెట్లు బాగా వచ్చింది. చివరి 20 నిమిషాలు అదిరిపోయింది. ప్రభాస్ యాక్టింగ్ అదిరింది. మా అన్న కూడా ఇంత బాగాచేస్తాడనుకోలేదు. ఈ సినిమా ఘన విజయాన్ని అందుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని అన్నారు. కాగా, గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో నెలకొన్న కలహాలు తెలిసిందే. ఈ క్రమంలో సినిమా విడుదలకు ఒక రోజు ముందు ‘కన్నప్ప’ చిత్రబృందానికి ఆల్ ద బెస్ట్ చెబుతూ మనోజ్ ట్వీట్ చేశారు. ఇందులో విష్ణు పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. అయితే సినిమా చూసిన తర్వాత తన అన్న విష్ణును మనోజ్ మెచ్చుకోవడంతో ఫ్యామిలీ అంతా మళ్లీ ఒక్కటయ్యే సమయం ఆసన్నమవుతోంది అంటూ మంచు అభిమానులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.