Manchu Manoj Post Viral: కన్నప్ప రిలీజ్‌.. మనోజ్‌ పోస్ట్‌ వైరల్‌..    

ABN , Publish Date - Jun 26 , 2025 | 03:53 PM

మంచు మనోజ్‌ చేసిన ఈ పోస్ట్‌లో ఎక్కడా తన సోదరుడు, ‘కన్నప్ప’ కథానాయకుడు మంచు విష్ణు పేరును ప్రస్తావించకపోవడం చర్చనీయాంశమైంది.

                                 ౉
మంచు విష్ణు(manchu Vishnu) డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఎట్టకేలకు పూర్తై విడుదలకు సిద్ధమైంది. మంచు విష్ణు టైటిల్‌ పాత్ర పోషించిన ఈ చిత్రంలో భారీ తారాగణం నటించింది. మహాభారతం సీరియల్‌ ఫేం ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ (mukesh kumar singh) దర్శకుడు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ నెల 27న విడుదల కానుంది. కన్నప్ప టీమ్‌కు మంచు మనోజ్‌ (manchu Manoj Tweet) శుభాకాంక్షలు చెప్పారు. సినిమా పెద్ద హిట్‌ కావాలని ఆకాంక్షించారు.


‘‘కన్నప్ప’ చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమా కోసం నాన్న, ఆయన టీమ్‌ ఎన్నో ఏళ్లు ఎంతో శ్రమను, ప్రేమను  పెట్టి ఎంతో కష్టపడి పని చేశారు. ఇది బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.. మా లిటిల్‌ ఛాంప్స్‌ అరి, వివి, అవ్రామ్‌ల అందమైన జ్ఞాపకాలను  వెండితెరపై చూడటానికి ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూసున్నా. తనికెళ్ల భరణి గారి జీవితకాల కల జీవం పోసుకుని, శుక్రవారం విడుదల కానుండటం సంతోషంగా ఉంది. మంచి మనసున్న ప్రభాస్‌, లెజెండరీ నటులు మోహన్‌లాల్‌, అక్షయ్‌కుమార్‌, ప్రభుదేవా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయ పూర్వక  ధన్యవాదాలు చెబుతున్నా. ఈ సినిమా కోసం ఈ టీమ్‌ అంతా చేసిన సహకారం, ప్రాజెక్ట్‌పై  చూపించిన ప్రేమ, నమ్మకం ఎంతో గొప్పవి. సినిమా చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ ప్రయాణానికి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా’’ అని మంచు మనోజ్‌ ఎక్స్‌వేదికగా షేర్‌ చేశారు.

manoj.jpg


మంచు మనోజ్‌ చేసిన ఈ పోస్ట్‌లో ఎక్కడా తన సోదరుడు, ‘కన్నప్ప’ కథానాయకుడు మంచు విష్ణు పేరును ప్రస్తావించకపోవడం చర్చనీయాంశమైంది. గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో నెలకొన్న పరిస్థితులు అందరికీ తెలిసినవే. విష్ణుకి, మనోజ్‌కి మధ్య తరచూ మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  మంచు మనోజ్‌ ‘కన్నప్ప’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేయడం వైరల్‌ అవుతోంది. జూన్‌ 27న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. రన్‌టైమ్‌ 182 నిమిషాలున్న ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్‌ దక్కింది. 

Updated Date - Jun 26 , 2025 | 05:37 PM