Manchu Lakshmi: నాకు సపోర్ట్‌ చేసినవాళ్లు మచ్చుకు కూడా లేరు..

ABN , Publish Date - Sep 18 , 2025 | 06:54 PM

'ఏ రంగంలోనైనా అందరినీ మెప్పించడం అనేది ఏ ఒక్కరికీ సాధ్యం కాదు. మనం చేసేది కొందరికీ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. మనకోసం ఆలోచించే వాళ్లు కొంతమంది ఉంటారు.

'ఏ రంగంలోనైనా అందరినీ మెప్పించడం అనేది ఏ ఒక్కరికీ సాధ్యం కాదు. మనం చేసేది కొందరికీ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. మనకోసం ఆలోచించే వాళ్లు కొంతమంది ఉంటారు. వారిని సంతృప్తి పరిస్తే చాలు. అలాంటి వారిని ఎప్పటికీ వదులుకోకూడదు’ అని మంచు లక్ష్మీ ప్రసన్న అన్నారు. నటిగా, నిర్మాతగా, హోస్ట్‌ తన ప్రతిభను చాటారు మంచు లక్ష్మీ. అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తున్నారు. ప్రస్తుతం ముంబూ మకాం మార్చేసిన ఆమె దక్ష’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులు ముందుకు రానున్నారు. వంశీ కృష్ణ మళ్లా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచు లక్ష్మీ తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి ఈ చిత్రంలో నటించారు.

తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి, మంచు కుటుంబంలో వివాదాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ునేను నటిగా సినిమాల్లోకి వచ్చినప్పుడు ఎవరూ నాకు సపోర్ట్‌ చేయలేదు. కొందరన్నా సపోర్ట్‌ చేశారని చెప్పుకోవడానికి కూడా లేదు. వెనక్కి లాగినవాళ్లే కానీ ధైర్యంగా ముందుకెళ్లు అని ఏ ఒక్కరూ చెప్పలేదు. అయినా నేను తగ్గలేదు.. సినిమాల్లోకి వచ్చి ఇలా నిలబడగలిగా. ఇప్పుడు నాన్నతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇది బీయాండ్‌ డ్రీమ్‌లాంటిది. సినిమా రెస్పాన్స్‌ కోసం ఎదురుచూస్తున్నా’ అని అన్నారు.

ప్రతీది జీవిత పాఠమే..
మా ఇంట్లో ఎవరి విజయాన్ని అయినా నా విజయంగా భావిస్తాను. మా వాళ్ల సక్సెస్‌ను నా సక్సెస్‌గానే అనుకుంటా.  ఒకరి కష్టం వృథా కావాలని ఎప్పుడూ కోరుకోను. ప్రతి విషయం నుంచి జీవిత పాఠాలు నేర్చుకోవాలనుకుంటా. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని కోరుకుంటా. సినిమా రంగంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో తెలిసిన దానిని. ఒక ఆర్టిస్ట్‌గా నాకు తోచిన సలహా ఇస్తుంటా. తమ్ముడు మనోజ్‌కు ‘మిరాయ్‌’ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేయమని చెప్పాను. ుదక్ష’ సినిమాకు స్టంట్స్‌ తమ్ముడే చేశాడు’ అని చెప్పారు.
 
కుటుంబమంతా నలిగిపోతారు..  
‘ఒక ఇంట్లో ఏదైనా సమస్య వస్తే కుటుంబం మొత్తం నలిగిపోతారు. చాలామంది అలా ఏమీ ఉండదు.. ఎవరి దారి వారిదే అని అనుకుంటారు. అది అబద్థం. కానీ, మేము ఉండేది అద్దాల మేడలో..  ఏం చెప్పినా తల, తోక కట్‌ చేసి వాళ్లకు నచ్చినట్లు రాసుకునే రోజులివి. అలాంటప్పుడు సైలెంట్‌గా ఉండడమే ఉత్తమం అని నాకు అనిపించింది. అందుకే సైలెంట్‌గా ఉన్నా. గతంలో ఏది ఒప్పు, ఏది తప్పు అని ఆలోచించేదాన్ని. ఇప్పుడు అలా ఆలోచించడం లేదు. దీని వల్ల నేను ఆనందంగా ఉంటానా, బాధపడతానా అని ఆలోచిస్తున్నాను. జీవితంలో ఏదైనా మనం ఎదుర్కొన్నాం అంటే అది ఒక పాఠం చెప్పడానికే అని నమ్ముతా. ఏది జరిగినా మౌనంగా ఆలోచిస్తే ప్రశాంతత లభిస్తుంది’ అన్నారు. 

Updated Date - Sep 18 , 2025 | 07:01 PM