GlobeTrotter: ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈవెంట్ నిర్వహణ...

ABN , Publish Date - Nov 12 , 2025 | 06:45 PM

మహేశ్ బాబు - రాజమౌళి ఫస్ట్ కాంబినేషన్ మూవీ ఫస్ట్ ఈవెంట్ ప్రతిష్ఠాత్మకంగా మారిపోయింది. అయితే ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ తర్వాత ఈ ఈవెంట్ ఉంటుందా? ఉండదా అని సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.

Gloge Trotter event

నవంబర్ 15... మహేశ్ బాబు (Mahesh Babu) అభిమానులంతా ఎంతో ఎగ్జయిట్ మెంట్ తో ఎదురుచూస్తున్న రోజు. మహేశ్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించిన విశేషాలను ప్రపంచానికి తెలియచేసే రోజు అది. అంతేకాదు... మూడేళ్ళ క్రితం సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) కన్నుమూసిన రోజు కూడా అదే. మహేశ్ బాబు తన తల్లిదండ్రుల్ని, అన్నయ్య రమేశ్ బాబును పోగొట్టుకున్న తర్వాత ఇక అభిమానులే తనకు సర్వస్వం అని ఓ వేదిక మీద చెబుతూ ఉద్వేగానికి లోనయ్యాడు. సో... నవంబర్ 15 అనేది మహేశ్ బాబు జీవితంలో స్పెషల్ డే. తండ్రిని పోగొట్టుకున్న అదే రోజున... తన కెరీర్ లో ది బెస్ట్ అనిపించుకునే మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన చేయబోతున్నాడు.


ఎప్పుడైతే ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా నవంబర్ 15న జరుగబోతోందని తెలిసిందో... మహేశ్ అభిమానులే కాదు... ఫిల్మ్ గోయర్స్ సైతం ఈవెంట్ కు ఎప్పుడు ఎప్పుడు వెళ్దామా అని ఎదురు చూస్తున్నారు. తెలిసిన వారిని సంప్రదిస్తూ పాస్ ల కోసం తెగ ట్రై చేస్తున్నారు. ఓ వైపు అక్కడ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కు ఏర్పాట్లు ఘనంగా జరుగుతుంటే... మరోవైపు ఆ కార్యక్రమం ఉంటుందా? ఉండదా? అనే అనుమానులు మొదలయ్యాయి. నిజానికి ఈ ఈవెంట్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మేకర్స్ దేశ విదేశాల్లో దీనికి సంబంధించిన లైవ్ ప్రోగ్రామ్ కోసం విశేషమైన కృషి చేస్తున్నారు. జియో హాట్ స్టార్ లో ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుందని తెలిసినా... కొందరు దుబాయ్ లో ఈవెంట్ ను ప్రసారం చేస్తున్నట్టు ప్రకటించారు. అందుకు నిర్మాతలు సైతం ఆమోదముద్ర వేశారు.


ఇంత ప్రతిష్ఠాత్మకంగా మేకర్స్ ప్లాన్ చేస్తుంటే... ఇటీవల ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లస్ట్ కారణంగా... వివిధ నగరాలలో హై అలెర్ట్ ను ప్రకటించారు. అందులో హైదరాబాద్ నగరం కూడా ఉంది. దాంతో... ఫిల్మ్ సిటీలో ఈ ఈవెంట్ జరుగుతున్నా... పోలీస్ అధికారులు అంత క్రౌడ్ ను అనుమతిస్తారా? అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. సిటీకి దూరంగా ఈ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి భద్రతకు ఢోకా ఉండదని కొందరు అంటుంటే... ఇప్పుడున్న సమయంలో ప్రభుత్వం రిస్క్ తీసుకోవడానికి సాహసిస్తుందా? అనే అనుమానాన్ని ఇంకొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే... రాజమౌళికి ఉన్న పరిచయాల దృష్ట్యా ఈ ఈవెంట్ ను ఆయన ఎలాగైనా నిర్వహించగలరని, కావాలంటే మరింత జాగ్రత్త తీసుకుని దీన్ని తప్పనిసరిగా నిర్వహిస్తారని చాలామంది ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వ అధికారులకు రాజమౌళి బృందం ఎలాంటి భరోసా ఇస్తుంది? ఇవాళ ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఈ ఈవెంట్ ను ఎంత జాగ్రత్తగా నిర్వహిస్తుందనే దానిపై అందరూ దృష్టి సారించారు. చూద్దాం... ఏం జరుగుతుందో!

Updated Date - Nov 12 , 2025 | 06:45 PM