Super Star Krishna: మహేశ్ 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ తో ఫుల్ జోష్

ABN , Publish Date - Nov 15 , 2025 | 04:47 PM

'పోయినోళ్ళందరూ మంచోళ్ళు... ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపిగుర్తులు' అన్నారు మహాకవి. పోయినోళ్ళను తలచుకుంటూ సాగడం ఉన్నోళ్ళకు పరిపాటే. నవంబర్ 15న నటశేఖర కృష్ణ వర్ధంతి. ఈ సందర్భంగా కృష్ణను స్మరించుకుంటున్నారు ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్. నవంబర్ 15ను ఓ మెమరబుల్ డేగా జరుపుకుంటున్నారు.

Krishna - Mahesh Babu

నటశేఖర కృష్ణ (Superstar Krishna) తుదిశ్వాస విడిచి అప్పుడే మూడేళ్ళయింది. ఈ నాటికీ అభిమానుల మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు కృష్ణ. ఆయన వర్ధంతి నవంబర్ 15వ తేదీని సైతం అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంలోనే ఘట్టమనేని ఫ్యామిలీ (Ghattamaneni Family) నుండి రెండు స్పెషల్స్ చోటు చేసుకున్నాయి. అభిమానులకు ఆ ప్రత్యేకతలు పరమానందం పంచుతూ ఉండడం విశేషం. వాటిలో మొదటిది కృష్ణ నటవారసుడు మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న మూవీకి సంబంధించిన 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్. ఆర్.ఎఫ్.సి.లో అభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఈవెంట్ జరుగబోతోంది. కృష్ణ వర్ధంతిన ఈ అపురూప ఘట్టం సాగటం అభిమానులకు అమితానందం పంచుతోంది.


నిజానికి కృష్ణ నటవారసునిగా మొట్టమొదట అడుగు పెట్టింది ఆయన పెద్ద కొడుకు రమేశ్ బాబు. ఆరంభంలో కొన్ని చిత్రాలలో అలరించిన రమేశ్ బాబు తరువాత నిర్మాతగా మారారు. రమేశ్ లేకపోయినా ఆయన తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం కానున్నాడు. ఈ విషయాన్ని కృష్ణ చిన్న తమ్ముడు జి. ఆదిశేషగిరిరావు ప్రకటన ద్వారా తెలియజేశారు. దాంతో కృష్ణ ఫ్యాన్స్ లో మరింత ఆనందం వెల్లివిరుస్తోంది. 'ఆర్. ఎక్స్. 100' మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ హీరోగా వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వనీదత్ ఓ సినిమా ప్లాన్ చేశారు. ఈ సినిమాకు అశ్వనీదత్ సమర్పకుడు కాగా జెమినీ కిరణ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ అంశం కూడా కృష్ణ ఫ్యాన్స్ కు మహదానందం కలిగిస్తోంది. ఎందుకంటే అశ్వనీదత్ నిర్మించిన 'రాజకుమారుడు' తోనే మహేశ్ కూడా సోలో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు. అదే తీరున జయకృష్ణ సైతం అలరిస్తారని అభిమానుల అభిలాష.


నటశేఖర కృష్ణ విగ్రహం

తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు నటశేఖర కృష్ణ. 300 పైచిలుకు చిత్రాల్లో నటించిన కృష్ణ అభిమానులకు ఆరాధనీయునిగా నిలిచారు. కృష్ణ నూరవ చిత్రంగా జనం ముందు నిలచిన 'అల్లూరి సీతారామరాజు' ఆయన కెరీర్ లోనే ఓ మరపురాని సినిమా. ఈ నాటికీ ఫ్యాన్స్ కృష్ణ పేరు వినగానే 'అల్లూరి సీతారామరాజు'గా ఆయనను ఊహించుకుంటూ ఉంటారు. కృష్ణ జయంతి మే 31వ తేదీ, ఆయన వర్ధంతి నవంబర్ 15 - అభిమానులకు మరపురాని రోజులు. ఈ యేడాది నవంబర్ 15న కృష్ణ ఫ్యాన్స్ మరింత ఆనందం పొందారని చెప్పవచ్చు. అలాగే శంషాబాద్ లోని పద్మాలయా స్టూడియోస్ లో కృష్ణ విగ్రహం నెలకొల్పుతున్నామని ఆదిశేషగిరిరావు తెలిపారు. అక్కడే ఓ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ ను కూడా ఏర్పాటు చేయనున్నామని ఆయన చెప్పారు. ఈ అంశాలు సైతం కృష్ణ ఫ్యాన్స్ కు అమితానందం పంచుతున్నాయి.

ఇదిలా ఉంటే తన తండ్రితో ఉన్న ఓ సినిమా ఫోటోను షేర్ చేస్తూ మహేశ్ బాబు... కృష్ణకు నివాళులు అర్పించాడు.

Updated Date - Nov 15 , 2025 | 04:47 PM