Dhanush: శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు...
ABN, Publish Date - May 08 , 2025 | 04:34 PM
ధనుష్, రశ్మిక జంటగా నటిస్తున్న 'కుబేర' చిత్రంలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఐదు భాషల్లో జూన్ 20న రాబోతోంది.
తమిళంలో ఎంతోకొంత ఫర్వాలేదనిపిస్తున్నా... గత కొంతకాలంగా ధనుష్ (Dhanush) సినిమాలు ఇతర భాషల్లో ఆడటం లేదు. దాంతో త్వరలో విడుదల కాబోతున్న 'కుబేర' (Kubera) మీదనే అతను ఆశలన్నీ పెట్టుకున్నాడు. అలానే స్టార్ హీరోయిన్ రశ్మిక మందణ్ణ (Rashmika Mandanna) జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న నేపథ్యంలో ఇటీవల వచ్చిన సల్మాన్ ఖాన్ 'సికిందర్' (Sikandar) మూవీ బాక్సాఫీస్ బరిలో బోల్తాపడి, ఆమెను నిరాశకు గురిచేసింది. దాంతో ఇప్పుడు 'కుబేర'తో రశ్మిక సైతం సక్సెస్ ట్రాక్ లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వం వహిస్తున్న 'కుబేర' షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. శేఖర్ కమ్ములతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్న పుస్కర్ రామ్ మోహన్, సునీల్ నారంగ్ 'కుబేర' భారతీయ సినిమాలో గేమ్ ఛేంజర్ నిలువబోతోందని అంటున్నారు.
తాజాగా ధనుష్, రష్మిక మందణ్ణ చిరునవ్వులు చిందుస్తున్న 'కుబేర' పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఇందులోని నాలుగు ప్రధాన పాత్రలను పరిచయం చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ కు మంచి స్పందన వచ్చిందని, అలానే ఫస్ట్ సింగల్ 'పోయిరా మామ' చార్ట్ బస్టర్ హిట్ అందుకుందని వారు తెలిపారు. దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. పనిలో పనిగా త్వరలో ప్రమోషన్స్ ను కిక్ స్టార్ట్ చేయబోతున్నామన్నారు. నాగార్జున కీలకపాత్ర పోషించిన 'కుబేర' జూన్ 20, 2025న తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.