FNCC: ఉత్త‌మ చిత్రం కోర్ట్‌.. ఉత్త‌మ హీరో హీరోయిన్లు అఖిల్‌, తేజ‌స్వీ

ABN , Publish Date - Dec 27 , 2025 | 06:55 AM

ఈ ఏడాది విజయం సాధించిన చిన్న చిత్రాలకు అవార్డులు బహూకరిస్తున్నట్లు ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు తెలిపారు.

FNCC

ఈ ఏడాది విజయం సాధించిన చిన్న చిత్రాలకు ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్ (ఎఫ్‌ఎన్‌సీసీ) తరఫున అవార్డులు (FNCC Awards) బహూకరిస్తున్నట్లు ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు (KS Rama Rao) తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ.10కోట్లలోపు బడ్జెట్‌తో తీసిన చిన్న సినిమాలను ప్రోత్సాహించాలన్నదే తమ విధానమని చెప్పారు.

ఇందులో భాగంగా 2025లో విడుదలైన ‘కోర్ట్‌’ను ఉత్తమ చిత్రంగా ఎంపిక చేశామన్నారు. అదేవిధంగా ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రం నుంచి ఉత్తమ హీరోగా అఖిల్‌ రాజ్‌కు, ఉత్తమ హీరోయిన్‌గా తేజస్వీరావు, ఉత్తమ దర్శకుడిగా సాయిలు కంపాటికి అవార్డులు అందజేస్తామన్నారు. బొప్పన విష్ణు ఆధ్వర్యంలో టీవీ అవార్డుల ప్రదానోత్సవం కూడా ఉంటుందన్నారు.

వీటితోపాటు ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తిచేసుకున్న నిర్మాతలు అశ్వనీదత్‌ (Ashwinidutt), అల్లు అరవింద్‌ (Allu Arvind) లను సన్మానించనున్నట్లు కె.ఎస్‌.రామారావు వెల్లడించారు. అలాగే చిరకాలంగా చిత్ర పరిశ్రమలో ఉంటూ, ఫిల్మ్‌నగర్‌ క్లబ్‌ అభివృద్ధి కోసం కృషి చేసిన కాజా సూర్యనారాయణను ఈ సందర్భంగా సన్మానిస్తామన్నారు.

ఎఫ్‌ఎన్‌సీసీలో డిసెంబరు 31న నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను బహూకరిస్తామని రామారావు తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎన్‌సీసీ కోశాధికారి శైలజ, కాజా సూర్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 06:55 AM