Krithi Shetty: బేబమ్మకు.. కలిసిరాని తమిళం! నటించిన.. మూడు సినిమాలు వాయిదా
ABN , Publish Date - Dec 11 , 2025 | 06:18 PM
హీరోయిన్ కృతిశెట్టికి ఇప్పుడు అంతా ఎదురుగాలి వీస్తోంది. మరీ ముఖ్యంగా ఆమె నటించిన మూడు తమిళ సినిమాలు వరుసగా వాయిదా పడుతూ, అమ్మడి సహనానికి పరీక్ష పెడుతున్నాయి.
'ఉప్పెన' (Uppena) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి... తొలి చిత్రంతోనే వంద కోట్ల క్లబ్ లో చోటు సంపాదించుకుంది సొట్టబుగ్గల సుందరి కృతీశెట్టి (Krithi Shetty) . ఆ తర్వాత వచ్చిన 'శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy), బంగార్రాజు' (Bangarraju) కూడా హిట్ కావడంతో అమ్మడిని అందరూ గోల్డెన్ లెగ్ అంటూ తెగ పొగిడేశారు. అయితే ఆ తర్వాతే ఈ సొట్టబుగ్గల సుందరికి దెబ్బపడిపోయింది. 'బంగర్రాజు' తర్వాత వచ్చిన 'మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్' సినిమాలతో 2022లో వరుసగా మూడు పరాజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాద యేడాది చేసిన 'కస్టడీ' కూడా బాక్సాఫీస్ బరిలో చడీచప్పుడూ చేయలేదు. ఇక గత యేడాది వచ్చిన 'మనమే' (Manamey) డిజాస్టర్ కాగా, మలయాళంలో నటించిన తొలి చిత్రం 'ఎ.ఆర్.ఎం.' (ARM) మమా అనిపించుకుంది.
ఈ యేడాది కృతిశెట్టి నటించిన మూడు తమిళ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వస్తాయని అమ్మడు మురిసిపోయింది. ఒకటి కాకపోతే మరొకటైనా హిట్ అయ్యి తనను సక్సెస్ ట్రాక్ ఎక్కించకపోతుందా అని ఆశపడింది. కానీ ఆ ఆశలన్నీ అడియాశలే అయ్యాయి. ఎప్పుడో రావాల్సిన కార్తీ, కృతిశెట్టి 'వా వాతియార్' (Vaa VBaathiyaar) ఈ నెల 12న వస్తుందని మేకర్స్ ఊరించారు. భారీ పబ్లిసిటీ కూడా చేశారు. కానీ హఠాత్తుగా ఇప్పుడా సినిమాను వాయిదా వేసినట్టు ప్రకటించారు.
ఇప్పటికే రావాల్సిన మరో తమిళ సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (Love Insurance Kompany) కూడా కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. డిసెంబర్ 18న దానిని రిలీజ్ చేస్తామని ఆ మధ్య చెప్పారు. కానీ బుధవారం చావు కబురు చల్లగా బయట పెడుతూ, దీనిని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు. అలానే ఆ మధ్య 'జయం' రవి నటించిన 'జీనీ' (Genie) సినిమా ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు. అదీ త్వరలోనే విడుదల అవుతుందని అన్నారు.
ఇందులో కళ్యాణ్ ప్రియదర్శన్, కృతిశెట్టికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. వాటిని చూసి కుర్రకారు ఈ సినిమాతో కృతి ఖాతాలో హిట్ పడటం ఖాయం అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సినిమా ఊసే లేకుండా పోయింది. ఈ మూడు తమిళ సినిమాలే కావడం విశేషం. దీనికి ముందు 'ది వారియర్, కస్టడీ' సినిమాలు తెలుగుతో పాటు తమిళంలోనూ సైమల్టేనియస్ గా విడుదల అయ్యాయి. కానీ అవి బై లింగ్వల్ మూవీస్ తప్పితే... తమిళ చిత్రాలు కావు. కానీ ఈ మూడు స్ట్రయిట్ తమిళ చిత్రాలు. సో... కోలీవుడ్ ఎంట్రీకి కృతికి మధ్య ఏదో ఉందనే ప్రచారం ట్రేడ్ వర్గాల్లో బాగా జరుగుతోంది.