Chaitanya Rao: క్రాంతి మాధవ్ కొత్త సినిమా షురూ
ABN , Publish Date - Oct 03 , 2025 | 05:15 PM
చైతన్య రావు, ఐరా, సాఖీ హీరో హీరోయిన్లుగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నూతన చిత్రం శుక్రవారం ప్రారంభమైంది.
చైతన్య రావు, ఐరా, సాఖీ హీరో హీరోయిన్లుగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నూతన చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. ‘ఓనమాలు’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి సెన్సిబుల్ స్టోరీలతో ఆకట్టుకున్న క్రాంతి మాధవ్ యూత్ ఫుల్ కథతో అందరినీ అలరించేందుకు సిద్ధమయ్యారు. శ్రేయాస్ చిత్ర, పూర్ణా నాయుడు ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద రూపొందనున్న ఈ సినిమా దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి దేవా కట్టా క్లాప్ కొట్టగా, కె ఎల్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాతలు పూర్ణ నాయుడు, శ్రీకాంత్ స్క్రిప్ట్ అందజేయగా.. తొలి సన్నివేశానికి వర ముళ్ళపూడి గౌరవ దర్శకత్వం వహించారు.
దర్శకుడు క్రాంతి మాధవ్ మాట్లాడుతూ ‘ఇది నాకు ఐదో చిత్రం. చైతన్యతో రెండో సినిమా. సాఖీ, ఐరా టాలీవుడ్ పరిచయం కాబోతో న్నారు. చైతన్య, పూర్ణ గార్లతో నాది ఎన్నో ఏళ్ల బంధం. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ తరువాత పూర్ణ గారితో ఓ మూవీని చేయాలి. హిట్స్‌లో ఉన్నప్పుడు చేయను.. బాధల్లో ఉన్నప్పుడు చేస్తాను అని అన్నారు. నా గత చిత్రం ఫ్లాప్ అయినప్పుడు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ టైంలోనే పూర్ణ వచ్చి సినిమా చేద్దామని అన్నారు. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రాబోతోంది. అందమైన లొకేషన్లలో భారీగా ఈ మూవీని చిత్రీకరిస్తున్నాం' అన్నారు.
హీరో చైతన్య రావు మాట్లాడుతూ 'క్రాంతితో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్నాను. 2026లోనే ఆయనతో చేస్తున్న రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చాలా ఇష్టమైన సినిమా. ‘మయసభ’, ‘ఘాటీ’ తరువాత ఇంత మంచి సినిమాను చేస్తుండటం అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఓ సినిమా చేస్తున్నాను అంటే.. ఏదో ఒకటి కొత్తగా ఉంటుందనే ఆడియెన్స్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను' అని అన్నారు.
నిర్మాత పూర్ణ నాయుడు మాట్లాడుతూ ‘క్రాంతిని నేను దర్శకుడిగా పరిచయం చేయాలని అనుకున్నాను. కానీ ఇన్నాళ్లకు మా ఇద్దరికీ సమయం కుదిరింది. క్రాంతి చెప్పే కథలంటే నాకు చాలా ఇష్టం. శ్రీకాంత్ నా ప్రతీ ప్రాజెక్ట్‌లో భాగస్వామి అవుతూనే ఉంటారు. త్వరలోనే మరిన్ని వివరాల్ని తెలియజేస్తామ’ని అన్నారు.
హీరోయిన్ ఐరా మాట్లాడుతూ 'నేను బెంగళూరు అమ్మాయిని. తెలుగులోనే కథానాయికగా ఇంట్రడ్యూస్ అవ్వాల్సింది. తమిళంలో నా పరిచయం జరిగింది. కథ నాకు చాలా నచ్చింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగం అవ్వడం నా అదృష్టం' అని అన్నారు.