Kota Srinivasarao: బతికుండగానే చంపేశారు కదరా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కోట చివరి మాటలు
ABN , Publish Date - Jul 13 , 2025 | 03:45 PM
సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు (Kota Srinivasarao) నేడు మృతిచెందిన విషయం తెల్సిందే. కామెడీ విలన్ గా, సీరియస్ విలన్ గా, సపోర్టివ్ రోల్ లో నటించి మెప్పించారు.
Kota Srinivasarao: సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు (Kota Srinivasarao) నేడు మృతిచెందిన విషయం తెల్సిందే. కామెడీ విలన్ గా, సీరియస్ విలన్ గా, సపోర్టివ్ రోల్ లో నటించి మెప్పించారు. సుమారు 750 సినిమాల్లో నటించిన కోటా చివరివరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నేటి ఉదయం కన్నుమూశారు. దీంతో తెలుగు ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
ఇక కోటాకు సంబంధించిన ప్రతి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఆయన చివరి రోజుల్లో చెప్పిన మాటలు అభిమానులను కంటనీరు తెప్పిస్తున్నాయి. సోషల్ మీడియా వచ్చాక వ్యూస్ కోసం, లైక్స్ కోసం బతికున్నవారిని చంపేస్తున్నారు కొంతమంది. కొన్నిరోజులు సోషల్ మీడియాలో కనిపించకపోవడం ఆలస్యం..వారు అందరి దృష్టిలో చంపేస్తున్నారు. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు బయటకు వచ్చి తాము బతికే ఉన్నాము మహాప్రభో అని చెప్పుకొస్తారు.
స్టార్ కమెడియన్ వేణు మాధవ్ సైతం మమ్మల్ని బతికి ఉన్నప్పుడే చంపకండి.. అంటూ వేడుకున్నాడు. ఇక కోటా కూడా చివరి అంకంలో ఇలానే ప్రాధేయపడ్డారు. బతికి ఉన్నవారిని చంపి ఏం సాధిస్తారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. గత కొన్ని రోజుల క్రితం కోటా శ్రీనివాసరావు ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ రాసుకొచ్చాయి. ఆ వార్తలపై కోటా స్పందిస్తూ వీడియో పెట్టారు. అదే ఆయన చివరి వీడియో అని చెప్పొచ్చు. ఆ వీడియోలో కోటా మాట్లాడుతూ.. ' ప్రతి ఆర్టిస్ట్ కు ఒక టైమ్ అనేది వస్తుంది. ఆ టైమ్ వచ్చినప్పుడు నీకు టైమ్ ఉండనట్టే. అప్పుడే నువ్వు అన్ని సర్దుకోవాలి. ముందే జాగ్రత్త పడాలి.
జీవితంలో టైమ్ బావుండాలి అంటే ముందు నీ ప్రవర్తన బావుండాలి. అది బావుంటే అన్ని బావుంటాయ్. లేకపోతే చివరకు అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆస్తులు పోగొట్టుకొని అలా దీన పరిస్థితి;లో ఉన్నవారిని ఎంతమందిని చూడలేదు. దేవుడి దయవలన నేను అలా లేను. టైమ్ వస్తే వెళ్ళిపోతాను. వాడెవడో నేను బతికుండగానే చచ్చిపోయానని రాసాడు. ఆరోగ్యం బాగోలేక మరణించాడు అన్నాడు. ఆరోగ్యం బాగోలేకపోతే నేనే చెప్తా కదా. వయస్సు మీద పడుతుండడంతో అనారోగ్య సమస్యలు ఉంటాయి. అంతమాత్రాన బతికి ఉన్న మనిషిని చంపేస్తారా.. ?
నా గురించి రాసినవాడిని పిలిపించి అరిచాను. అలా ఎలా రాస్తావయ్యా. తప్పు కదా. మీ నాన్న వయస్సు కదా నాకు. మీ నాన్నకు కాళ్ల నొప్పులు రావా..? అలాగే నాకు వచ్చాయి. నేను మనిషిని కాదా.. ? నా చావు వార్త రాసి రూపాయి సంపాదిస్తున్నావా.. ? అది దారుణం. ఇంకెప్పుడు అలా చేయకు అని చెప్పా. నేను బతికేవున్నాను' అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వఓల్డ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.