Kota Srinivasarao: పదాల విరుపు.. జంధ్యాలే గురువు..

ABN , Publish Date - Jul 13 , 2025 | 12:44 PM

కోట శ్రీనివాసరావును చిత్రసీమకు పరిచయం చేసింది దర్శకుడు కె.వాసు. ఆయన తెరకెక్కించిన 'ప్రాణం ఖరీదు' (1978)తోనే కోట తొలిసారి తెరపై తళుక్కుమన్నారు. ఆ తరువాత అవకాశాలు అంతగా కనిపించకపోవడంతో తన ఉద్యోగం తాను చేసుకుంటూ నాటకాల్లో రక్తి కట్టిస్తూ ఉండేవారు

కోట శ్రీనివాసరావును (Kota Srinivasarao) చిత్రసీమకు పరిచయం చేసింది దర్శకుడు కె.వాసు. ఆయన తెరకెక్కించిన 'ప్రాణం ఖరీదు' (1978)తోనే కోట తొలిసారి తెరపై తళుక్కుమన్నారు. ఆ తరువాత అవకాశాలు అంతగా కనిపించకపోవడంతో తన ఉద్యోగం తాను చేసుకుంటూ నాటకాల్లో రక్తి కట్టిస్తూ ఉండేవారు. నాటకరంగంలో రాణించే నటీనటులకు తన చిత్రాల ద్వారా అవకాశాలు కల్పిస్తూ ఉండేవారు జంధ్యాల. అలా కోట శ్రీనివాసరావు ప్రతిభను గమనించిన జంధ్యాల (Jandhyala) తన చిత్రాల ద్వారా కోటకు అవకాశాలు కల్పిస్తూ వచ్చారు. "అమరజీవి, బాబాయ్ - అబ్బాయ్" చిత్రాల్లో కోటకు చిన్న పాత్రలే ఇచ్చారు జంధ్యాల. ఎలాగైనా జంధ్యాల సినిమాలో నటించేసి పేరు సంపాదించాలని కోట శ్రీనివాసరావు తెగ ప్రయత్నిస్తూండేవారు. కానీ, జంధ్యాల బిగ్ రోల్ ఏదీ ఆఫర్ చేయలేకపోయేవారు. టి.కృష్ణ 'ప్రతిఘటన'లో కాశయ్య పాత్రలో కోట అభినయం అందరినీ ఆకట్టుకుంది. అలాగే జంధ్యాలను సైతం ఆ సినిమా మురిపించింది. కోటలో గొప్ప నటుడున్నాడని జంధ్యాల తరచూ చెప్పేవారే కానీ, తగిన పాత్ర ఇవ్వలేకపోయేవారు. కోట మాత్రం జంధ్యాల తనను దూరం పెడుతున్నారేమో అని భావించేవారు. అయితే కోటలోని నటునికి ఛాలెంజ్ విసిరేలా జంధ్యాల 'అహ...నా పెళ్ళంట' సినిమా కోసం 'లక్ష్మీపతి' పాత్రను క్రియేట్ చేశారు. జంధ్యాల అంచనాలను మించి ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు కోట. అందులో పలు సన్నివేశాల్లో కోట పూయించిన నవ్వులు ఈ నాటికీ గుబాళిస్తూనే ఉండడం విశేషం! సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత డి.రామానాయుడు నిర్మించిన 'అహ...నా పెళ్ళంట' ఘనవిజయం సాధించింది. ఆ సినిమా విజయోత్సవంలో కోటను ఆకాశానికి ఎత్తేశారు జంధ్యాల. అప్పటి దాకా జంధ్యాల తనను చిన్న చూపు చూస్తున్నారని భావించిన కోట నోట మాట రాలేదు. ఆనందభాష్పాలతో ఉబ్బితబ్బిబై పోయారు. వయసులో తనకన్నా చిన్నవాడయినా జంధ్యాలకు పాదాభివందనం చేసేశారు కోట. ఆ తరువాత జంధ్యాల పలు చిత్రాలలో కోటకు తగిన పాత్రలు ఇచ్చారు. సదరు పాత్రల్లో కోట తనదైన బాణీ పలికించి ప్రేక్షకులకు కితకితలు పెట్టారు.

Ahana-pellanta.jpg

ఓ చిన్నమాట అన్నా దాని నుండి పలు పదాలను తయారు చేసేవారు జంధ్యాల అని కోట తరచూ గుర్తు చేసుకొనేవారు. ఆయన సావాసం వల్లే తనకూ ఆ విద్య అబ్బిందనీ చెప్పేవారు. 'పదాలను విరిచి కొత్త పదాలను కాయిన్ చేయడం' అనే విద్యను పింగళి నాగేంద్రరావు రచనలు చూసి జంధ్యాల నేర్చుకున్నారని చెప్పేవారు కోట. అలాగే ముళ్ళపూడి వారి బాణీని జంధ్యాల పట్టేశారని, అందువల్లే వారిద్దరి సినిమా రచనలను పరిశీలిస్తే కొన్ని పోలికలు దగ్గరగా ఉంటాయనీ కోట చెప్పేవారు. 'అందాల రాముడు'లో 'తీ.తా' అంటే 'తీసేసిన తాసిల్దార్' అని ముళ్ళపూడి వారు రాస్తే, 'అడవిరాముడు'లో "పా.కో.కూ.' అంటే "పాకెక్కి కోడిలా కూస్తా..." అని జంధ్యాల పలికించారనీ కోట గుర్తు చేసుకొనేవారు. జంధ్యాల మాటల చమత్కారం గమనించడం వల్లే తనకు కూడా సినిమా టైటిల్స్ ను చూడగానే ఏదో ఒకటి కాయిన్ చేయాలి అనిపించేదని కోట ఓ సందర్భంలో వివరించారు.

Updated Date - Jul 13 , 2025 | 12:55 PM