Kota Srinivasarao: చేసిన పాత్ర చేయలేదు.. చేయనిది లేదు..

ABN , Publish Date - Jul 14 , 2025 | 12:41 AM

నగర పౌరుల శాంతి భద్రతలే నాకు ముఖ్యం.. అసలు వీడు నా గురించి ఏమనుకుంటున్నాడ్రా ... (యమలీల RIP Kota Srinivasarao) వాట్‌ హ్యాపెన్‌.. యువర్‌ లుకింగ్‌ సో సాడ్‌ అండ్‌ బ్యాడ్‌.. (మనీ సినిమాలో కామెడీ విలన్‌ అల్లాద్దీన్‌గా)

నగర పౌరుల శాంతి భద్రతలే నాకు ముఖ్యం.. అసలు వీడు నా గురించి ఏమనుకుంటున్నాడ్రా ... (యమలీల RIP Kota Srinivasarao)

వాట్‌ హ్యాపెన్‌.. యువర్‌ లుకింగ్‌ సో సాడ్‌ అండ్‌ బ్యాడ్‌.. (మనీ సినిమాలో కామెడీ విలన్‌ అల్లాద్దీన్‌గా)

ఏరా ముళ్లపంది.. ఇట్రా... ఏంట్రా నల్ల పెంకు.. నీకు నాకు ఎంత తేడా ఉందో తెలుసా.. (మామగారులో కమెడీయన్‌గా) అంటూ కామెడీ పంచారు..

ఈ లోకంలో చెడిపోయిన అమ్మాయిలు ఉన్నారేమో గానీ, చెడ్డ తల్లి మాత్రం లేదయ్యా.. దేవుడి కన్నా తల్లే ఓ మెట్టు ఎత్తులో ఉంది..

‘ఆఖరి రోజుల్లో తండ్రికి ఒక ముద్ద పెట్టేవాడు కొడుకు, చచ్చేదాక ఇలా గుండెల మీద తన్నేవాడు కొడుకు కాదు’ అంటూ భావోద్వేగాన్ని పంచారు.

మర్డర్‌ జరగాలి.. కానీ మనిషి మాత్రం మిగలాలి.. అంత గిఫ్ట్ మనకు వద్దులేగానమ్మా... పైన చదువుతున్నావ్‌?. కింద కోసుకెళ్లిపోయాడు (అతడు) అంటూ పంచులు పేల్చారు.

ఇలా పాత్ర ఏదైనా ఇమిడిపోయి, వందశాతం న్యాయం చేయగలిగే ప్రతిభ అతి తక్కువమందిలో ఉంటుంది. అలాంటి అరుదైన నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఎన్నో విభిన్నమైన పాత్రలకు ఆయన ప్రాణం పోశారు. జానర్‌ ఏదైనా తనదైనశైలి నటనతో విలక్షణ నటుడు అనిపించుకున్నారు. తెలుగులో దాదాపు 750 చిత్రాలకు పైగా వరకు నటించి చెరగని ముద్ర వేశారు కోట. ఇతర భాషల్లోనూ తన సత్తా చాటారు. తమిళం, కన్నడం, హిందీ, మలయాళం సినిమాల్లో నటించారాయన. ‘సర్కార్‌’ సినిమాలో సెల్వర్‌ మణిగా నటించి అమితాబ్‌ ప్రశంసలు అందుకున్నారు. ‘డార్లింగ్‌’, ‘రక్త చరిత్ర’, ‘భాఘీ’ లాంటి బాలీవుడ్‌ సినిమాలతో అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. ‘సామి’ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన సుమారు 30 చిత్రాల్లో చేశారు. కన్నడలోనూ ఆయన సినిమాలు చేశారు. ఏ రంగంలోనైనా రాణించాలంటే పెద్ద గుమ్మడికాయంత టాలెంట్‌ కాదు.. ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలని చెబుతుండేవారు కోట శ్రీనివాసరావు. ఆ సూత్రాన్నే నమ్మి ఆ దిశగా ఆయన రూట్‌ వేసుకున్నారు.

కొన్ని పాత్రలు చూస్తే ఆయన తప్ప మరొకరు చేయలేరేమో అనేంతగా ఆయన అభినయం ఉంటుంది. అలలా ఆయనకు బాగా గుర్తింపు తెచ్చిన పాత్ర ‘అహ నా పెళ్ళంట’లోని పిసినారి లక్ష్మీపతి పాత్ర ఒకటి. అందులో బ్రహ్మనందంతో కలిసి భలే హాస్యాన్ని పండించారు. అయితే మొదటి ఆ పాత్రను రావుగోపాలరావుతో చేయించాలనుకున్నారట. అయితే అప్పటికే కోట శ్రీనివాసరావు ‘మండలాధీశుడు’ చిత్రం విడుదల కావడంతో జంధ్యాల.. కోట శ్రీనివాసరావుతో ఆ పాత్రను చేయించాలని అనుకున్నారు. నిర్మాత డి.రామానాయుడు అందుకు ఒప్పుకోలేదు. ఫైనల్‌గా ఒప్పించారు. ‘‘ఒకరోజు నేను చెన్నై వెళ్లడానికి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చా. అయితే అంతకుముందే రామానాయుడుగారు అక్కడి వచ్చి కూర్చున్నారు. అప్పట్లో నాలాంటి నటుడు ఆయనకు ఎదురుగా కూర్చొని మాట్లాడటం చాలా గొప్ప విషయం. నేను వెళితే.. ‘ఇక్కడకు రావయ్యా! నీతో ఒక విషయం చెప్పాలన్నారు. ఏంటి సర్‌? అని అడిగా, ‘జంధ్యాలతో ఒక సినిమా అనుకుంటున్నా. ఈరోజే ఫైనలైజ్‌ అయింది. ఈ సినిమాలో ఒక క్యారెక్టర్‌ ఉంది. అది పండితే సినిమా చాలా బాగా ఆడుతుంది. లేకపోతే యావరేజ్‌గా ఆడుతుంది. ఆ పాత్ర గురించి నాకూ జంథ్యాలకు 20 రోజులుగా చర్చ జరుగుతోంది. నేను రావుగోపాలరావుతో అనుకున్నా. కానీ, కోట శ్రీనివాసరావుతోనే ఆ పాత్ర వేయిస్తానని జంథ్యాల పట్టుబట్టారు. నేనూ అంగీకరించా. 20రోజుల పాటు నీ డేట్స్‌ కావాలి’ అని అడిగారు. తప్పకుండా సర్‌ అన్నా. ఆ తర్వాత ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే’ అంటూ పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు.

పిసినారి లక్ష్మీపతి

జంథ్యాల దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్‌, రజనీ నటించిన ‘అహ నా పెళ్లంట’లో పిసినారి లక్ష్మీపతిగా కోట ప్రతిభను మాటల్లో వర్ణించలేం. నీళ్ల ఖర్చు, సబ్బు ఖర్చు, డబ్బు ఖర్చు తగ్గుతుందని బట్టలకు బదులు న్యూస్‌ పేపర్లు చుట్టుకోవడం, కోడిని ఇంటి ముందు వేలాడదీసి కోడి కూర తింటున్నట్టు అనుభూతి చెందడం లాంటి సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించాయి. ఈ సినిమా హిట్‌ తర్వాత కోట బాగా బిజీ అయిపోయారు. ఈ తరహా పాత్రనే ఆమె, ఆ నలుగురు చిత్రాల్లో చేసి మెప్పించారు.

మినిస్టర్‌ కాశయ్య

‘ప్రతిఘటన’ సినిమాలో విజయశాంతి, చరణ్‌రాజ్‌లతో పాటు కోట శ్రీనివాసరావు జీవితంలోనూ ప్రత్యేక సినిమాగా నిలిచిపోయింది. ‘నమేస్త తమ్మీ...’ అంటూ తెలంగాణ యాసతో మినిస్టర్‌ కాశయ్యగా అదిరిపోయేలా నటన కనబర్చారు. ఆ డైలాగ్స్‌ను పండించేందుకు పట్టుబట్టి మరీ ఆ యాసను నేర్చుకున్నారు. విలన్‌ కాళీ(చరణ్‌ రాజ్‌)కి అండగా నిలబడే అవినీతి మంత్రిగా, కిరాతకుడిగా ఆయన నటనకు విశేష స్పందన వచ్చింది. ‘ప్రతిఘటన’ సాధించిన విజయానికి మినిస్టర్‌ కాశయ్య పాత్ర ముఖ్య ్ఘభూమిక పోషించింది. ఆ తర్వాత ఆయన కెరీర్‌లో ఇలాంటి పాత్రలెన్నో చేశారు.

సాంబ శివుడు

అప్పటి దాకా కామెడీ విలన్‌ మెప్పించిన కోట వెంకటేశ్‌ నటించిన గణేశ్‌ సినిమాలో క్రూరమైన విలన్‌ పాత్రలో వణుకు పుట్టించారు. ప్రజల రక్తం తాగే ఆరోగ్య మంత్రిగా ఆయన పలికించిన హావభావాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. హీరో ఇంటికొచ్చి ఇచ్చే వార్నింగ్‌, కిడ్నీ మాఫియాను నడిపించే సన్నివేశాల్లో ఆయన ఎంత గొప్ప నటుడు అనేది తెలుస్తుంది. అందులో గుండుతో భయంకరమైన కళ్లతో చూస్తే వణుకు పుట్టేలా ఉంటుంది.

గురు నారాయణ

‘గదైతే నేను ఖండిస్తున్న’ అంటూ గాయం సినిమాలో గురు నారాయణ్‌ పాత్రతో మెప్పించారు . జగపతిబాబు హీరోగా ఆర్జీవీ తెరకెక్కించిన క్రైమ్‌ డ్రామా ‘గాయం’. నటుడిగా జగపతిబాబుకి మంచి గుర్తింపు తీసుకొచ్చిన ఈ సినిమాలో కోటశ్రీనివాసరావు గురు నారాయణ్‌గా అదరగొట్టారు. తెలంగాణ యాసను ఒంట బట్టించుకుని ఆయన పలికిన డైలాగ్‌లకు మంచి పేరొచ్చింది. సినిమా ఆద్యంతం కోట విలక్షణమైన నటనతో మెస్మరైజ్‌ చేశారు.


అల్లాదీన్‌

‘భద్రం బీకేర్‌ ఫుల్‌ బ్రదరు. భర్తగా మారకు బ్యాచిలరు’ అనే పాటతో పెళ్లి వద్దని చెప్పే అల్లాదీన్‌గా ‘మనీ’ సినిమాలో ఆకట్టుకుంటారు కోట. ఆర్జీవీ నిర్మించిన ఈ చిత్రంలో బట్లర్‌ ఇంగ్లిష్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘మనీ మనీ’లోనూ ఇదే పాత్రతో అలరించారు. వచ్చీరాని ఇంగ్లిష్‌తో కామెడీ పండించారు. అందులో పురాణాల మీద, నీతి నిజాయతీల మీద చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి.

పోతురాజు...

వెండితెరపై సూపర్‌హిట్‌ కామెడీ కాంబో ఎవరిదంటే కోటశ్రీనివాసరావు, బాబు మోహన్‌ పేర్లే గుర్తొస్తాయి. తెరపై వీర్దిరూ కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు.. అంతే కాదు సినిమా హిట్టు కూడా. ముత్యాల సుబ్బయ్య తీసిన ‘మామగారు’లో ఈ జంట చేసిన కామెడీ ఎప్పటికీ మరచిపోలేరు. పోతురాజుగా కోట శ్రీనివాసరావు నటన సినిమాకే హైలైట్‌. ఆ తర్వాత ‘ఏవండీ ఆవిడొచ్చింది’, ‘చిన రాయుడు’, ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ ఇలా దాదాపు 50 సినిమాలకు పైగా వీరిద్దరూ కనిపించి థియేటర్లలో ప్రేక్షకుల్ని నవ్వించారు.

తాటి మట్టయ్య.. స్పీకింగ్‌...

నాగార్జున బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘హలోబ్రదర్‌’లో తాటి మట్టయ్యగా నటించి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు. అందులో ఆయన ప్రమోషన్‌ కోసం పడే పాట్లు, అందుకు తన కానిస్టేబుల్‌తో జరిగే కామెడీ మంచి వినోదాన్ని పండించింది. సినిమా అంతా నవ్వించిన కోట..చివరిలో మల్లికార్జున రావు పాత్ర మరణించాక రేయ్‌ చిట్టి.. లేరా... రివేంజ్‌ తీర్చుకోరా నా మీద’ అంటూ భావోద్వేగానికి గురయ్యే సీన్‌ ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టిస్తుంది కామెడీ పంచడంలోనైనా. భావ్వోద్వేగం కలిగించడంలోపైనా ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు.

తాగుబోతుగా..

‘గబ్బర్‌ సింగ్‌’లో శ్రుతిహాసన్‌ తండ్రిగా నటించారు కోట. ఇందులో ఆయన పచ్చి తాగుబోతు. ఆ పాత్ర కోసం గాయకుడిగానూ మారారు. ‘మందు బాబులం’ పాట మాస్‌ను ఓ ఊపు ఊపింది.

వారుసుడి కోసం అల్లరే చేసే తాతగా..

‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ చిత్రంలోనూ కోట కామెడీ అదరహో అనేలా ఉంటుంది. వెంకటేశ్‌కు తండ్రిగా వారసుడు కావాలని కోరుకునే తండ్రిగా, మనవడు వచ్చాక చేసే అల్లరి తెలుగు ఆడియన్స్‌కు విపరీతంగా అలరించింది. ఇందులో తండ్రిగానే కాకుండా తాతగానూ నటించి మెప్పించారాయన. ‘పెళ్లైన కొత్తలో’ తన మనవడి దాంపత్యం బంధం బలపడేందుకు కృషి చేేస తాతగా మెప్పించారు. ఈ తరహా పాత్రలే ‘రాఖీ’, ‘బృందావనం’ సింహాద్రి వంటి చిత్రాల్లో చేశారు.

మధ్య తరగతి తండ్రిగా...

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే చిత్రంలో కోట నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. జీవితంలో ఇంకా స్థిరపడని కొడుక్కి మధ్య తరగతి తండ్రి పాత్రలో కోట కంటతడి పెట్టించారు. ‘ఆఖరి రోజుల్లో తండ్రికి ఒక ముద్ద పెట్టేవాడు కొడుకు, చచ్చేదాక ఇలా గుండెల మీద తన్నేవాడు కొడుకు కాదు’ లాంటి డైలాగ్స్‌తో మనుసుల్ని హత్తుకున్నారు. పైకి కొడుకు పట్ల కోసంగా ఉన్నా లోపల ప్రేమను నింపుకొన్న నాన్నగా ఆ పాత్రకు ప్రాణం పోశారాయన. ‘బొమ్మరిల్లు’ జెనీలియాకు తండ్రిగా ఇలాంటి పాత్రే పోషించారు.

Updated Date - Jul 14 , 2025 | 12:43 AM