Kota Srinivasarao: సినిమా టైటిల్స్ కు 'కోట' కోటింగ్...

ABN , Publish Date - Jul 13 , 2025 | 11:51 AM

తెరపై తెలుగులోని అన్ని యాసలను మాట్లాడి అలరించిన కోట శ్రీనివాసరావు, సినిమా టైటిల్స్ పైనా తనదైన పంథాలో 'కాయిన్' చేసేవారు. అలా ఎన్నో సినిమా టైటిల్స్ విషయంలో తనదైన బాణీ పలికించారు.

తెరపై తెలుగులోని అన్ని యాసలను మాట్లాడి అలరించిన కోట శ్రీనివాసరావు, సినిమా టైటిల్స్ పైనా తనదైన పంథాలో 'కాయిన్' చేసేవారు. అలా ఎన్నో సినిమా టైటిల్స్ విషయంలో తనదైన బాణీ పలికించారు. కొందరు నొచ్చుకున్నారు. మరికొందరు మెచ్చుకున్నారు. కోట శ్రీనివాసరావు తమ సినిమాలపైనే సెటైర్స్ వేసినా ఎంజాయ్ చేసిన వారున్నారు. అలాంటివారిలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, విజయబాపినీడు, ఇ.వి.వి. సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి వారున్నారు. వీరి సినిమాల్లో విలక్షణమైన పాత్రల్లో అలరించిన కోట శ్రీనివాసరావు, వారి సినిమా టైటిల్స్ పై చేసిన కామెంట్స్ ఎంతగానో అలరించాయి. మచ్చుకు కొన్ని...

'మాయలోడు' సినిమాకు 'మాయ' లోడ్ చేసిన కృష్ణారెడ్డి - అందుకే అంత పెద్ద హిట్టయింది'

'యమలీల'- 'యమ్.'అలీ'ల' - ఈ సినిమాతోనే అలీ హీరో అయ్యాడు - దాంతో అలా పేర్చారన్న మాట. ఆ సినిమా బిగ్ హిట్ అయ్యాక 'అలీ లీల'అనీ కామెంట్ చేశారు కోట.

'వినోదం' నిర్మాతకు ప్రమోదం'

'రాజేంద్రుడు- గజేంద్రుడు'- 'రాజు' ఇంద్రుడు- 'గజం' ఇంద్రుడు- శ్లేష మీరే అర్థం చేసుకోండి....'

'గన్ షాట్' - 'టైటిల్ జస్టిఫికేషన్ చేసిన మూవీ'

'మనసులో మాట'- "సరిగా చెప్పుకోలేక పోయారు"

'ఆ ఒక్కటీ అడక్కు' - "ఆ ఒక్కటీ కడక్కు"

'ఏవండీ ఆవిడ వచ్చింది' - 'ట్యాబ్లెట్ వేసుకోండి'

'ఆయనకి ఇద్దరు' - "అందుకే ... ఆయనకు నిద్దర్లేదు"

'అల్లుడా మజాకా'- "అల్లం.. మడతకాజా..."

'అక్కడ అమ్మాయి... ఇక్కడ అబ్బాయి' - 'మద్రాసులో కూర్చొని పెట్టిన టైటిల్' (అప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ మద్రాసులో ఉండేవారు... అందులో హీరోయిన్ గా నటించిన సుప్రియ హైదరాబాద్ లో ఉన్నారు...)

'చిలక్కొట్టుడు' - "లక్ కొట్టేసింది"

'వీడెక్కడి మొగుడండి!?' - "వీడెక్కని మొగుడండి" (సినిమా జనానికి ఎక్కలేదని అర్థం)

'గ్యాంగ్ లీడర్' - 'బ్యాంగ్' లీడర్'

'బిగ్ బాస్' - 'బిగ్ లాస్'

'కొడుకులు' - తీసింది బాపినీడు 'కూతుళ్ళు'

'వాలు జడ - తోలు బెల్టు' - రెండూ పైకి లేవలేవు... శ్లేష అర్థం చేసుకోండి.

'ఘరానా బుల్లోడు' - "ఘర్ ఆనా బుల్లోడా"

'పెళ్ళిసందడి' - 'పెళ్ళి' సందులో 'ఢీ'

'బొంబాయి ప్రియుడు' - 'రంభ'కు మరో పేరు'బొంబాయి'. ఈ సినిమాలో రంభ హీరోయిన్. అలాగే అప్పట్లో రంభ హిందీ సినిమాల్లో బిజీగా ఉండేది.

'పరదేశి' - రాఘవేంద్రరావు 'ప్యారడైజ్' ('Paradesi'ని చివరలో కాస్త అటు ఇటు చేస్తే 'Paradise' అవుతుంది కదా)

'శ్రీమతి వెళ్ళొస్తా'- "మళ్ళీ వస్తే మక్కెలిరగదంతా"

'మూడు ముక్కలాట' - 'మూడ్ ఉంటేనేగా 'ఆట' (ఈ సినిమా పరాజయంపాలయింది)

'పెళ్ళివారమండి' - 'పెళ్ళి' వారమే నండి!

'ఒక్కడే' - థియేటర్‌ లో 'ఒక్క' డే (ఒకరోజు) అని.

'ఒక్కడు చాలు' - 'ఆ ఇద్దరికీ 'ఒక్కడు చాలు' - రాజశేఖర్ హీరోగా రూపొందిన 'ఒక్కడు చాలు' సినిమాలో రంభ, సంఘవి ఇద్దరు హీరోయిన్లు.

Updated Date - Jul 13 , 2025 | 11:51 AM