Tollywood: కోలీవుడ్ చేసినట్లు టాలీవుడ్ చేయగలదా.. ఆ సత్తా ఉందా
ABN , Publish Date - Nov 10 , 2025 | 08:32 PM
తెలుగు చిత్రసీమలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సినిమారంగం భారీ నష్టాలను చవిచూస్తోంది. అందుకు పలు కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో మొదటిది పైరసీభూతం... దానిని అరికట్టేందుకు శతవిధాలా ప్రయత్నాలు సాగుతున్నాయి.
Tollywood: తెలుగు చిత్రసీమలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సినిమారంగం భారీ నష్టాలను చవిచూస్తోంది. అందుకు పలు కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో మొదటిది పైరసీభూతం... దానిని అరికట్టేందుకు శతవిధాలా ప్రయత్నాలు సాగుతున్నాయి. కొన్నిసార్లు ఫలిస్తున్నాయి- మరికొన్ని పర్యాయాలు వికటిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారీ వ్యయంతో సినిమాలు నిర్మించినవారు చితికిపోతున్నారు. మరోవైపు స్టార్స్ కు భారీ పారితోషికాలు చెల్లిస్తూ, బడ్జెట్ పెంచుకుంటూ పోయి సినిమా రిలీజ్ కాగానే మరుసటి రోజుకే కలెక్షన్స్ పడిపోతోంటే నిర్మాత మరింతగా కుదేలైపోతున్నారు. ఎటు చూసినా నిర్మాతలకు దెబ్బలు తగులుతున్నాయి.ఈ నేపథ్యంలో తమిళ ఫిలిమ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అందులో మొట్టమొదటిది- అత్యంత కీలకమైనది - ఏదంటే హీరోల రెమ్యూనరేషన్స్ కు ఓ పద్ధతిని ఎంచుకోవడం.
హీరోల రెమ్యూనరేషన్స్ తగ్గించుకోమంటే వారు డేట్స్ ఇస్తారా?. నిర్మాతలు కొత్త హీరోలను తయారు చేసుకుంటారా?. ఇలా డౌట్స్ వస్తున్నాయి. అయితే హీరోలను తమిళ నిర్మాతల మండలి పారితోషికాలు తగ్గించమని కోరడం లేదు. ముందుగా తమకున్న స్టార్ డమ్ ను అనుసరించి కొంత మొత్తం తీసుకొని , మిగతాది సినిమాలకు వచ్చిన వసూళ్ళలో పర్సంటేజ్ లాగా పుచ్చుకుంటే బాగుంటుందని కోలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రతిపాదించింది. అలా చేస్తే హీరోలకు కొంత మొత్తం తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే సదరు హీరో సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటకపోతే, అప్పుడు ఆయన కూడా నష్టాన్ని భరించాల్సి వస్తుంది. ఒకవేళ బంపర్ హిట్టయిందనుకోండి - వచ్చే ఆదాయంలో వాటా తీసుకుంటే, హీరోల రెమ్యూనరేషన్ కన్నా అధికంగా రావచ్చు. కలెక్షన్స్ లో పర్సంటేజ్ సిస్టమ్ వస్తే నిర్మాతలకు భారం తగ్గుతుంది. తరువాత మరో సినిమా తీసే వీలూ కలుగుతుంది. లేకుంటే నష్టపోయిన నిర్మాతకు ఫైనాన్స్ దొరకదు- మళ్ళీ సినిమాలు తీయడానికి ఎన్నో పాట్లు పడాల్సి వస్తుంది.
టాలీవుడ్ టాప్ స్టార్స్ లో కొందరితో సినిమాలు తీస్తే బడ్జెట్ లో 40 శాతం వారికే ఇవ్వాల్సి వస్తోంది. కొందరు హీరోలు తమ పారితోషికం బదులుగా తమకు నచ్చిన ఏరియా రైట్స్ రాయించుకుంటున్నారు. మరికొందరు ఓటీటీ రైట్స్ కావాలంటున్నారు. ఇంకొందరు తన రెగ్యులర్ రెమ్యూనరేషన్స్ తోపాటు లాభాలాల్లో వాటా కూడా అడుగుతున్నారు. ఏ మాత్రం క్రేజ్ లేకపోయినా, థియేటర్స్ లో వారి సినిమాలు అంతగా ఆడక పోయినా, కోట్లకు కోట్లు పారితోషికాలు పుచ్చుకొనే తెలుగు హీరోలు ఎందరో ఉన్నారు. అలాంటి వారు కోలీవుడ్ ప్రతిపాదించిన పర్సంటేజ్ పద్ధతిలోకి వస్తే - మార్కెట్ లో వారి అసలు సత్తా తెలుస్తుంది. వినటానికి బాగానే ఉంది. కోలీవుడ్ లో నిర్మాతల మండలి హీరోల పారితోషికాల విషయంలో ఓ సూచన చేస్తోంది.మరి తెలుగునాట అంతటి దమ్ము, ధైర్యం మన నిర్మాతలకు ఉందా అన్నదే ప్రశ్న! కేవలం హీరోల పారితోషికాలే కాదు, చిత్రీకరణ సమయంలో ఖర్చులను కూడా తగ్గించుకుంటూ పోతే వ్యయం తగ్గించవచ్చు. సరైన ప్రణాళిక వేసుకుంటే ప్రస్తుతం వెచ్చిస్తున్న సొమ్ములో కనీసం 30 శాతం కట్టడి చేయవచ్చునని వినిపిస్తోంది. మరి టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారో చూడాలి.
Globe Trotter Song: సంచారి .. సంచారి.. సాహసమే తన దారి.. శృతిహాసన్ అదరగొట్టేసింది
Priyanka Chopra: ఇక్కడే ఎందుకు ఉంటున్నానో ఆ రోజు తెలుస్తుంది