Tollywood: ఛావా బాటలో కేసరి -2
ABN , Publish Date - May 14 , 2025 | 02:00 PM
అక్షయ్ కుమార్ న్యాయవాదిగా నటించిన హిస్టారికల్ మూవీ 'కేసరి చాప్టర్ 2' తెలుగులోనూ రాబోతోంది. ఇందులో ఆర్. మాధవన్, అనన్య పాండే కీలక పాత్రలు పోషించారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) 2019లో 'కేసరి' (Kesari) మూవీని చేశారు. ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీని అనురాగ్ సింగ్ డైరెక్ట్ చేశాడు. బ్రిటీష్ ఇండియన్ ఆర్మీకి చెందిన 36వ సిఖ్ రెజిమెంట్ యోధుల కథ ఇది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో... ఆ చిత్ర నిర్మాతలే 'కేసరి : చాప్టర్ 2' (Kesari Chapter -2) పేరుతో తాజాగా మరో సినిమాను నిర్మించారు. ఇది కూడా చారిత్రక కథాంశంతో తెరకెక్కిన సినిమానే! కానీ మొదటి దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. 'కేసరి' వార్ ఫీల్డ్ కు సంబంధించిన సినిమా కాగా, 'కేసరి చాప్టర్ 2' కోర్ట్ రూమ్ డ్రామా. 1919లో జలియన్ వాలా బాగ్ మారణకాండ అనంతరం జరిగిన కోర్టు కేసు నేపథ్యంలో 'కేసరి చాప్టర్ 2' మూవీ రూపుదిద్దుకుంది. ఇందులో అక్షయ్ కుమార్ న్యాయవాది సి. శంకరన్ నాయర్ పాత్రను పోషించగా, ఆయన ప్రత్యర్థి పాత్రను ఆర్. మాధవన్ (Madhavan) చేశారు. నటి అనన్య పాండే (Ananya Panday) జూనియర్ లాయర్ గా నటించింది. కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 18న హిందీలో విడుదల అయ్యింది.
'కేసరి చాప్టర్ 2' చిత్రం ఇంతవరకూ దాదాపు రూ. 100 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే... ఇప్పుడీ సినిమా తెలుగులో డబ్ కాబోతోంది.
జాతీయ వాదాన్ని ప్రతిబింబించే హిందీ చిత్రాలను కాస్తంత ఆలస్యంగా అయినా ఈ మధ్యలో తెలుగువారి ముందుకు తీసుకు రావడం జరుగుతోంది. ఈ యేడాది మార్చిలో అలా గీతా ఆర్ట్స్ సంస్థ హిందీ సినిమా 'ఛావా' (Chhaava) ను తెలుగులో డబ్ చేసి విడుదల చేసింది. అలానే ఇప్పుడు 'కేసరి : చాప్టర్ 2'ను సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. అయితే... ఇలాంటి సినిమాలను మాతృకతో పాటే ఇతర భాషల్లోనూ విడుదల చేస్తే... మరింతగా కలెక్షన్స్ ఉంటాయని, ఆదరణ బాగుంటుందని చెబుతున్నారు. 'ఛావా' సినిమాకు వచ్చిన క్రేజ్ దృష్ట్యా ప్రధాన నగరాల్లో ఉన్న తెలుగు వారంతా దాన్ని హిందీలోనే చూసేశారు. ఆలస్యంగా డబ్ కావడంతో తెలుగులో పెద్దంతగా ఆడలేదు. 'కేసరి -2' కూడా జలియన్ వాలా బాగ్ కథాంశంతో రూపుదిద్దుకున్న కారణంగా హిందీలో ఇప్పటికే కొందరు చూశారు. మరి కాస్తంత ఆలస్యం తెలుగులో డబ్ అవుతున్న ఈ చిత్రానికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.
Also Read: Bollywood: దేశం సేఫ్.. మళ్ళీ ఇన్‌స్టాలోకి వచ్చేయండి! ఒక్క పోస్టుతో బాలీవుడ్ పరువు గోవింద
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి