scorecardresearch

Shashtipoorthi: ఇళయరాజా బాణీకి.. కీరవాణి సాహిత్యం..

ABN , Publish Date - Jan 02 , 2025 | 09:00 AM

కీరవాణి తెలుగు సినిమాకు ఆస్కార్‌ తెచ్చిన ఘనత ఎం.ఎం.కీరవాణిది. ఆయన గొప్ప సంగీత దర్శకుడే కాదు.. గాయకుడు కూడా.  అంతే కాదు... ఆయనలో మంచి రచయిత కూడా ఉన్నారు.

Shashtipoorthi: ఇళయరాజా బాణీకి.. కీరవాణి సాహిత్యం..

తెలుగు సినిమాకు ఆస్కార్‌ తెచ్చిన ఘనత ఎం.ఎం.కీరవాణిది(MM Keeravani). ఆయన గొప్ప సంగీత దర్శకుడే కాదు.. గాయకుడు కూడా.  అంతే కాదు... ఆయనలో మంచి రచయిత కూడా ఉన్నారు. ఇప్పటి దాకా అరవైకి పైగా పాటలు రాశారు కీరవాణి. తొలిసారి ఆయన అగ్ర సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraja) బాణీకి పాట రాశారు. ‘షష్టి పూర్తి’  (SHASHTIPOORTHI) సినిమా కోసమే ఈ  అరుదైన కలయిక చోటు చేసుకుంది. రూపేశ్‌ కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రమిది. రాజేంద్రప్రసాద్Rajendra Prasad), అర్చన (Archana) ప్రధాన పాత్రధారులు. ‘లేడీస్‌ టైలర్‌’తో సందడి చేసిన ఆ ఇద్దరూ, 38 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటించిన చిత్రమిది. రూపేశ్‌ సరసన ఆకాంక్ష సింగ్‌ కథానాయికగా నటించారు. పవన్‌ ప్రభ దర్శకత్వం వహిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘ఏదో ఏ జన్మలోదో...’ అంటూ సాగే పాటను  త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ పాటను కీరవాణి రచించారు. 

దర్శకుడు మాట్లాడుతూ ‘‘సంగీత దర్శకుడు కీరవాణి ఆస్కార్‌ గెలిచిన తర్వాత రాసిన పాట ఇది. మా సినిమాలోని కొన్ని పాటలకి చైతన్యప్రసాద్‌ సాహిత్యం అందించారు. ప్రత్యేకమైన సందర్బ?ంలో వచ్చే ఓ పాటకి కీరవాణి సాహిత్యం అందిస్తే బాగుంటుందని అనిపించి, ఆయన్ని సంప్రదించాం. ఆయన అంగీకరించి ఈ పాట రాశారు. ఇళయరాజా బాణీకి,  కీరవాణి సాహిత్యం అందించడం, అది మా సినిమాలో పాట కావడం ఎంతో సంతోషంగా ఉంది’’ అన్నారు. ఇందులో అచ్యుత్‌కుమార్‌, సంజయ్‌ స్వరూప్‌, రాజ్‌ తిరందాసు, మురళీధర్‌ ఇతర పాత్రధారులు.

Updated Date - Jan 02 , 2025 | 09:00 AM