Movie Tickets: కర్ణాటకలో టికెట్ గరిష్ఠ ధర రూ.200
ABN , Publish Date - Jul 16 , 2025 | 02:46 AM
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మల్టీప్లెక్స్, సింగిల్ స్ర్కీన్ ఏదైనా సరే టికెట్ గరిష్ఠ ధర(వినోదపు పన్ను కలిపి) రూ.200 దాటొద్దంటూ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిబంధన...
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మల్టీప్లెక్స్, సింగిల్ స్ర్కీన్ ఏదైనా సరే టికెట్ గరిష్ఠ ధర(వినోదపు పన్ను కలిపి) రూ.200 దాటొద్దంటూ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిబంధన కర్ణాటకలో విడుదలయ్యే అన్ని భాషల చిత్రాలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ముసాయిదాపై అభ్యంతరాలు, సలహాల స్వీకరణకు 15 రోజులు గడువు ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆ తర్వాత ఫైనల్ జీవోను గెజిట్‌లో ప్రచురించి అమల్లోకి తీసుకొస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వ వ్యవహారంతో రాష్ట్రంలోని ఎగ్జిబిటర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కర్ణాటకలో ఇప్పటి వరకూ అమల్లో ఉన్న ఫ్లెక్సీ ప్రైసింగ్ పద్ధతిని ఉపయోగించుకొని బెంగళూరులోని కొన్ని మల్టీప్లెక్స్‌లు టికెట్ రేట్లను ఇష్ఠారాజ్యంగా పెంచేవి. ఇప్పుడు వారికి ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ ఎగ్జిబిటర్లు కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు శాండిల్‌వుడ్‌లో టాక్ వినిపిస్తోంది. కొత్త జీవోతో బి, సి సెంటర్లలో సమస్య కాకపోవచ్చు. కానీ, బెంగళూరులో అధికంగా మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. వీటిలో గరిష్ఠ టికెట్ ధర 200 రూపాయలే అంటే ఎగ్జిబిటర్లు జీర్ణించుకోవడం లేదు. కాగా, ప్రభుత్వ నిర్ణయం ఉన్నపళంగా తీసుకున్నదేమీ కాదని, 2025-26 బడ్జెట్‌లోనే ఈ అంశాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తావించారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏది ఏమైనా సగటు ప్రేక్షకుడికి మాత్రం ఇది శుభవార్తే అని చెప్పవచ్చు.