కన్నప్ప నిర్మాణం పరమేశ్వరుడి ఆజ్ఞ

ABN , Publish Date - Jun 29 , 2025 | 02:34 AM

ఆ పరమేశ్వరుడే కన్నప్ప సినిమా తీయాలని నన్ను ఆజ్ఞాపించాడు. ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా కుటుంబానికి పరమేశ్వరుడి ఆశీస్సులుండాలి అని అన్నారు...

‘ఆ పరమేశ్వరుడే ‘కన్నప్ప’ సినిమా తీయాలని నన్ను ఆజ్ఞాపించాడు. ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా కుటుంబానికి పరమేశ్వరుడి ఆశీస్సులుండాలి’ అని అన్నారు సీనియర్‌ నటుడు, నిర్మాత మోహన్‌బాబు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘కన్నప్ప’ ఇటీవలె విడుదలై థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సమావేశంలో మోహన్‌ బాబు మాట్లాడుతూ ‘మా టైమ్‌లో ఓ సినిమాకు ఇన్ని సభలు పెట్టేవాళ్లం కాదు. నటుడిగా 50 ఏళ్లు అవుతోంది. భగవంతుని ఆశీస్సులు ఉండబట్టే ఈ విజయం దక్కింది. అందుకు నా అభిమానులకు ధన్యవాదాలు. నేను చేసిన ప్రతి పాత్రను వారు ఆదరించారు. వారికి నేను రుణపడి ఉంటాను. మా భావ ప్రభాస్‌ సహా ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు’ అని అన్నారు. హీరో మంచు విష్ణు మాట్లాడుతూ ‘మా నటీనటులకు కనిపించే దేవుళ్లు ప్రేక్షకులే. ‘కన్నప్ప’ పెద్ద విజయాన్ని సాధిస్తుంది. ఇదంతా శివలీల. నాకిది భావోద్వేగ ప్రయాణం. ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాలనే ఈ రోజు మీ ముందుకు వచ్చాను’ అని పేర్కొన్నారు.

Updated Date - Jun 29 , 2025 | 02:36 AM