ప్రతి పాత్రా హీరోలా ఉంటుంది

ABN , Publish Date - Jun 22 , 2025 | 04:20 AM

‘ఆ భగవంతుడి ఆశీస్సులతోనే ‘కన్నప్ప’ చిత్రం ప్రారంభమైంది. పరమేశ్వరుడు ఇచ్చిన శక్తితోనే ఈ సినిమాను పూర్తిచేశాం. రథ సారథిలా ముఖేశ్‌కుమార్‌ సింగ్‌ ఈ సినిమాను...

‘ఆ భగవంతుడి ఆశీస్సులతోనే ‘కన్నప్ప’ చిత్రం ప్రారంభమైంది. పరమేశ్వరుడు ఇచ్చిన శక్తితోనే ఈ సినిమాను పూర్తిచేశాం. రథ సారథిలా ముఖేశ్‌కుమార్‌ సింగ్‌ ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లారు. తిన్నడు కన్నప్పగా ఎలా మారాడన్నది అద్భుతంగా ఆవిష్కరించారు. ఇందులో ప్రతి పాత్రా హీరోలా ఉంటుంది. ఆ శివుని ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని డా. ఎం. మోహన్‌బాబు అన్నారు. విష్ణు మంచు కథానాయకుడిగా నటించిన ‘కన్నప్ప’ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శనివారం చిత్రబృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. మంచు విష్ణు మాట్లాడుతూ ‘‘కన్నప్ప’ ప్రయాణంలో ఎన్నో బాధలు పడ్డాం. 50 ఏళ్ల తర్వాత మళ్లీ కన్నప్ప గురించి ఈ తరానికి చెప్పాలని శివుడే నాతో ఈ సినిమా తీయించారేమో అని ఓ సందర్భంలో శివరాజ్‌కుమార్‌తో అన్నాను. ఎడిటింగ్‌ టేబుల్‌ మీద ‘కన్నప్ప’ చిత్రాన్ని చూసినప్పుడు అద్భుతం అనిపించింది. నాకు ప్రభాస్‌ కృష్ణుడయితే, నేను ఆయనకు కర్ణుడిని. నాన్నగారి మీదున్న గౌరవంతో ప్రభాస్‌ నటించాడు.


అలాగే ఈ చిత్రంలో భాగమైనందుకు మోహన్‌లాల్‌, అక్షయ్‌కుమార్‌, శరత్‌కుమార్‌ గారికి ధన్యవాదాలు. ప్రేక్షకుల ప్రేమతో సినిమా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’ అన్నారు. ముఖేశ్‌కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘నన్ను నమ్మి ‘కన్నప్ప’ చిత్రాన్ని నా చేతుల్లో పెట్టినందుకు మోహన్‌బాబు గారికి ధన్యవాదాలు. కష్టమైన సన్నివేశాలనూ విష్ణు ఒకట్రెండు టేకుల్లోనే పూర్తి చేశారు. ప్రభాస్‌ పాత్ర ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది’ అని తెలిపారు. శివతత్వాన్ని ప్రపంచానికి చాటేందుకు మోహన్‌బాబు, విష్ణు కలసి ‘కన్నప్ప’ సినిమాను తీశారని బ్రహ్మానందం అన్నారు. ‘కన్నప్ప’ గురించి నేను చెప్పడం కాదు, సినిమా విడుదలయ్యాక మీరే చూస్తారు అని శరత్‌కుమార్‌ అన్నారు. కన్నప్ప ప్రపంచంలో నేను అణువులాంటిదాన్ని, ఈ చిత్రంలో దిగ్గజాలతో కలసి నటించ గలిగినందుకు సంతోషంగా ఉంది అని మధుబాల చెప్పారు.

Updated Date - Jun 22 , 2025 | 04:20 AM