Kannada Beauties: కన్నడ కస్తూరీలు.. హీరో ఎవరైనా సరే తగ్గేదేలే
ABN , Publish Date - Jul 06 , 2025 | 10:01 AM
తెలుగు తెరపై పొరుగింటి సౌందర్యం కొత్తేం కాదు. చాలాసార్లు ఉత్తరాది, కొన్నిసార్లు మలయాళం, ఇంకొన్నిసార్లు తమిళ బ్యూటీలు పాగా వేయడం తెలిసిందే. ఇటీవల కన్నడ కస్తూరీలు మన హీరోల సరసన కనిపించడం ఎక్కువయ్యింది.
తెలుగు తెరపై పొరుగింటి సౌందర్యం కొత్తేం కాదు. చాలాసార్లు ఉత్తరాది, కొన్నిసార్లు మలయాళం, ఇంకొన్నిసార్లు తమిళ బ్యూటీలు పాగా వేయడం తెలిసిందే. ఇటీవల కన్నడ కస్తూరీలు (Kannada Heroines)మన హీరోల సరసన కనిపించడం ఎక్కువయ్యింది. అగ్రహీరోలు, కుర్ర హీరోలు అనే తేడా లేకుండా... తెలుగు తెరపై కన్నడ పరిమళాలు వెదజల్లుతున్న కొందరు ముద్దుగుమ్మల నేపథ్యం ఇది...
సీనియర్ల సరసన...
అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న భామ ఆషికా రంగనాథ్(Ashika Ranganath). కర్ణాటకలోని తుమకూరుకు చెందిన ఈ అమ్మడు కాలేజీలో ‘క్లీన్ అండ్ క్లియర్ మిస్ ఫ్రెష్ ఫేస్’ పోటీల్లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. ఆ ఫొటోలు పత్రికల్లో రావడంతో ‘క్రేజీ బాయ్’లో అవకాశం వచ్చింది. తర్వాత వరుసగా కన్నడ చిత్రాల్లో నటించి, 2023లో ‘అమిగోస్’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘నన్ను అందరూ అనుష్కలా ఉన్నావని అంటారు. నాకైతే అలా అనిపించదు గానీ, ఓ మంచి నటితో పోల్చడం మాత్రం సంతోషంగా ఉంటుంది’ అని చెబుతుంది. ప్రస్తుతం ఈ అందాలభామ సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ సరసన నటిస్తోంది.
వయా సోషల్‌మీడియా...
నిహారిక ఎన్‌ఎమ్... (Niharika NM) సోషల్‌మీడియాలో చురుగ్గా ఉండేవారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తన హాస్య చతురతతో అందరినీ కడుపుబ్బా నవ్వించడం ఈ కన్నడ కస్తూరి ప్రత్యేకత. ఈమె వీడియోలకు కోట్లలో వ్యూస్, లక్షల్లో లైక్స్. కావునే స్టార్స్ సైతం ఈమెతో ప్రమోషనల్ వీడియోల కోసం ఎగబడుతుంటారు. యశ్ మొదలుకొని ప్రియాంక చోప్రా, రణబీర్ కపూర్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, విక్రమ్, అజయ్‌దేవగణ్, శుభమన్ గిల్ వంటి స్టార్లతో కలిసి హంగామా చేసింది. ఆ స్టార్‌డమ్ ఈ సుందరికి సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. తమిళ చిత్రం ‘పెరుసు’తో వెండితెరకు పరిచయమైన ఈ బెంగళూరు బ్యూటీ ‘మిత్రమండలి’తో తెలుగుతెరపై సందడి చేయడానికి సిద్ధమైంది.
కిర్రాక్ క్రేజ్
‘కాంతార’... దేశం మొత్తాన్ని ఊపేసిన కన్నడ చిత్రంలో రిషబ్‌శెట్టితో పాటు నాయిక సప్తమి గౌడకు (Sapthami goiwda) కూడా మంచి పేరొచ్చింది. ‘ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నానంటే దానికి ‘కాంతార’నే కారణం’ అని ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్‌లో తన ఆనందాన్ని పంచుకుందామె. సప్తమి పుట్టి, పెరిగిందంతా బెంగళూరులోనే. ఇంజనీరింగ్ పూర్తి చేశాక నటనపై ఆసక్తితో మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. కన్నడలో ‘పాప్‌కార్న్ మంకీ టైగర్’తో తెరంగేట్రం చేసింది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు అందుకుంది. ఆపై 2022లో వచ్చిన ‘కాంతార’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని, తాజాగా నితిన్ ‘తమ్ముడు’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
‘హిట్’ కొట్టింది
‘కెజీఎఫ్’, ‘హిట్-3’ చిత్రాలతో కట్టిపడేసిన శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ప్రస్తుతం యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ సినిమాలో నటిస్తోంది. ఈమె కర్ణాటకలోని కిన్నిగోలికి చెందిన తుళు కుటుంబంలో జన్మించింది. చదువు పూర్తయిన తర్వాత ఓ పక్క ఉద్యోగం చేస్తూనే, వీకెండ్స్‌లో మోడలింగ్, ఫ్యాషన్ షోలలో పాల్గొనేది. ‘మిస్ కర్ణాటక 2015’, ‘మిస్ సుప్రనేషనల్ ఇండియా 2016’తో పాటు పలు టైటిల్స్ గెలుచుకుంది. ఈ క్రమంలో ‘కేజీఎఫ్’లో హీరోయిన్‌గా పాపులర్ అయ్యింది. విక్రమ్ ‘కోబ్రా’లో నటించిన ఈ మెరుపుతీగ ‘హిట్-3’ విజయంతో యూత్ నయా క్రష్‌గా మారింది.
జాక్‌పాట్ బ్యూటీ
‘సప్త సాగరాలు దాటి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరవైన కథానాయిక రుక్మిణీ వసంత్(Rukmini Vasanth). బెంగళూరుకు చెందిన ఆర్మీ కుటుంబంలో జన్మించిన ఈ బ్యూటీ లండన్‌లోని ‘రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్’లో శిక్షణ పొందింది. కన్నడ చిత్రం ‘బీర్బల్ ట్రయాలజీ’తో నటిగా ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది హిందీలోకి అడుగుపెట్టింది. తర్వాత ‘సప్త సాగరాలు దాటి’ ఈ బ్యూటీకి తెలుగులో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో హీరోయిన్‌గా జాక్‌పాక్ కొట్టేసింది. ‘నాకు ప్రణాళికలేం లేవు. మంచి సినిమాల్లో నటించాలని ఉంది’ అంటోంది.