Jyothy Krishna: పురాణాలు, చరిత్ర ఆధారంగా వీరమల్లు పాత్ర
ABN , Publish Date - Jul 27 , 2025 | 01:40 PM
పవన్ కల్యాణ్ యోధుడిగా కనిపించిన చిత్రం హరిహర వీరమల్లు’. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో హీరో పాత్రలు ఎలా క్రియేట్ చేశారు. దాని వెనకున్న కథను దర్శకుడు వివరించారు.
ఉత్కంఠభరితమైన తుది పోరుకు వేదిక అది..
కలెక్షన్లు ఎందుకు చెప్పడం లేదు?
ఏపీ భవన్‌లో ప్రత్యేక షో!
-స్పందించిన దర్శకుడు.. జ్యోతికృష్ణ
పవన్ కల్యాణ్ యోధుడిగా కనిపించిన చిత్రం హరిహర వీరమల్లు’. తొలుత క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తదుపరి నిర్మాత ఎ.ఎం.రత్నం కుమారుడు జ్యోతికృష్ణ పూర్తి చేశారు. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో హీరో పాత్రలు ఎలా క్రియేట్ చేశారు. దాని వెనకున్న కథను దర్శకుడు వివరించారు.
ఈ సందర్భంగా జ్యోతికృష్ణ మాట్లాడుతూ ‘మొఘల్ చక్రవర్తులు హిందువులను ఇబ్బందికి గురిచేస్తూ, దేవాలయాలు నాశనం చేసిన చారిత్రక కథాంశంతో రూపొందిన సినిమా ఇది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన వస్తోంది. వీరమల్లు చిన్నప్పటి నుంచి ఓ గుడిలో పెరిగాడు. అందువల్ల వేద జ్ఞానాన్ని సంపాదించుకుని శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగాడు. వేద గ్రంథాలను నాశనం చేసినప్పుడు ‘హరి హర వీరమల్లు’ బలంగా నిలబడ్డాడు. మొఘల్ చక్రవర్తుల ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. వేదాలలోని జ్ఞానాన్ని అంతా సంపాదించుకుని తనే ఒక వేద పండితుడిగా మారటంతో వాటిని నాశనం చేయడానికి వీలు లేకుండా పోయింది. అదే సెకెండాఫ్‌లో చూపించాం. వేద జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని వాస్తు శాస్త్రంలో భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం వంటి పంచభూతాలను అవగతం చేసుకుని ధర్మ సంబంధమైన జీవన విధానాన్ని నిర్మించటంలో తన వంతు పాత్రను పోషించాడు. అతని దూరదృష్టి, నైపుణ్యం మరెవరితోనూ పోల్చలేవివి. అందుకు చాలా ఉదాహరణలు సినిమాలో అంతర్భాగంగా కనిపిస్తాయి. సినిమాలో గుల్ఫమ్ ఖాన్ (కబీర్ దుహాన్ సింగ్)ను కొండపై జరిగే ప్రమాదం నుంచి కాపాడతాడు. అలాగే వరుణ యాగాన్ని అడ్డుకోవాలని చూసే వారి నుంచి రక్షించి వరుణ దేవుడు కరుణించేలా చేస్తాడు. తోడేళ్లు దాడి చేయడానికి వచ్చినప్పుడు వాటితో మానసికమైన సంభాషణ చేసి తన తోటి వారికి ప్రమాదం జరగకుండా చూస్తాడు. అలాగే అయోధ్య నుంచి రాముడు లంకకు పయనిస్తున్న సమయంలో ఆయన ప్రయాణం అనేక ప్రాంతాల్లో సాగింది. అందుచేత రామాయణ కథకు ఆ ప్రాంతాలకు విడదీయరాని సంబంఽధం కలిగి ఉంది. శ్రీరాముడి ప్రయాణంలో చిత్రకూట, పంచవటి, క్రౌంచ అరణ్యం, మతంగ ఆశ్రమం, బునిశ్యమూక పర్వతం వంటి ప్రసిద్థ ప్రాంతాల్లో ఆయన అడుగులు పడ్డాయి. అవన్నీ ఆధ్యాత్మిక ప్రాంతాలుగా, మరచిపోలేని మైలురాళ్లుగా వందల ఏళ్లు గడిచిన ఇప్పటికీ ప్రజల నుంచి పూజలు అందుకుంటున్నాయి. అలాగే హరి హర వీరమల్లు సినిమాలో తన ప్రయాణాన్ని గోల్కొండ నుంచి ఢిల్లీ వరకు సాగించారు. దక్షిణ భారతం నుంచి ఉత్తర భారతం వరకు సాగిన ఈ ప్రయాణంలో కథానాయకుడు వేద తత్వాలతో ప్రజలకు మంచి పనులు చేయటాన్ని గమనించవచ్చు. ఇతిహాసాన్ని, చరిత్రను మిళితం చేసి వీరమల్లు పాత్ర సనాతన ధర్మాన్ని ఎలా రక్షించాడనేది ఈ సినిమాలో చూపించాం. సినిమా చివర్లో.. వీరమల్లు, ఔరంగజేబు పాత్రలు కలుసుకోవడం అనేది అసాధారణంగా జరుగుతుంది. ప్రకృతి సృష్టించిన విపత్తులో ఇద్దరు కలుసుకుంటారు. ఇదే ఉత్కంఠభరితమైన తుది పోరుకు వేదిక అనాలి. అందుకనే క్లైమాక్స్‌ను ఓ క్లిప్ హ్యాంగర్‌లా తెరకెక్కించాం. ఇది రాబోయే భాగానికి కొనసాగింపుగా ఉంటుందనే అర్థానిస్తుంది’ అన్నారు.
కలెక్షన్లు ఎందుకు చెప్పడం లేదు..
సినిమా విడుదల రోజే సాయంత్రానికి ఎంత కలెక్ట్ చేసిందో పోస్టర్ విడుదల చేసి చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్. హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్స్ నుంచి ఇప్పటి దాకా ఎంత వసూలు చేసిందన్నది చిత్ర బృందం ప్రస్తావించలేదు. కలెక్షన్స్ పోస్టర్ ఎందుకు రిలీజ్ చేయలేదని దర్శకుడిని ప్రశ్నించగా జ్యోతికృష్ణ స్పందించారు. ‘మనం నిజాయతీగా కలెక్షన్స్ గురించి చెప్పినా.. కరెక్టా, కాదా అని చాలామంది చర్చిస్తుంటారు. విమర్శలు చేస్తుంటారు. కలెక్షన్స్ గురించి ఓ అంచనా అందరికీ ఉంటుంది. ట్రేడ్ ఎనలిస్ట్‌లు చెబుతూనే ఉంటారు. అందుకే ఒకప్పటిలాగా ‘విజయవంతంగా సినిమా ఆడుతోంది’ అని పోస్టర్ల ద్వారా చెబుతున్నాం. కలెక్షన్లకు సంబంధించి ప్రస్తుతానికి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి పోస్టర్ రాలేదని చెప్పారు.
ఏపీ భవన్‌లో ప్రత్యేక షో..
హరిహర వీరమల్లు చిత్రాన్ని ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆడిటోరియంలో శనివారం రాత్రి ఓ షో ప్రదర్శించగా అధికారులు, ఉద్యోగుల నుంచి మంచి స్పందన దక్కింది. ఆదివారం సాయంత్రం మరో షో వేయనున్నారు.