Jr Ntr: ఎవరు ఎన్ని అనుకున్నా.. బొమ్మ అదిరిపోయింది .. ఇక నాలుగు రోజులే

ABN , Publish Date - Aug 10 , 2025 | 10:13 PM

‘25 సంవత్సరాలు క్రితం ‘కహోనా ప్యార్‌ హై’లో హృతిక్‌ డ్యాన్స్‌ చూసి మెస్మరైజ్‌ అయ్యాను. డాన్స్‌ అంటే నాకు మైఖేల్‌ జాక్సన్‌ మాత్రమే. ఇప్పుడు ఇండియాలో ఉన్న గొప్ప నటుల్లో హృతిక్‌ రోషన్‌ ఒకరు

‘తాత నందమూరి తారక రామారావు ఆశీస్సులు ఉన్నంత కాలం నన్ను ఎవరూ ఆపలేరు’ అని యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR) అన్నారు. హృతిక్‌తో కలిసి ఆయన నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వార్‌-2’. అయాన్‌ ముఖర్జీ దర్శకుడు. కియారా అడ్వాణీ కథానాయిక. ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్‌ వేడుకలో ఎన్టీఆర్‌ మాట్లాడారు.

‘25 సంవత్సరాలు క్రితం ‘కహోనా ప్యార్‌ హై’లో హృతిక్‌ డ్యాన్స్‌ చూసి మెస్మరైజ్‌ అయ్యాను. డాన్స్‌ అంటే నాకు మైఖేల్‌ జాక్సన్‌ మాత్రమే. ఇప్పుడు ఇండియాలో ఉన్న గొప్ప నటుల్లో హృతిక్‌ రోషన్‌ ఒకరు. ఇండియాలో గొప్ప డ్యాన్సర్‌ ఎవరంటే హృతిక్‌ రోషన్‌. ఆయనతో కలిసి డ్యాన్స్‌ చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. అయితే ఇక్కడ మనకంటే గొప్ప డ్యాన్సర్లు ఉన్నారు. అది మనం అంగీకరించాలి. నేను ఇలాగే ఉంటా.. మీరు అలాగే ఉండండి (అభిమానులను ఉద్దేశించి) ఇది ఎన్టీఆర్‌ చేస్తున్న హిందీ సినిమానే కాదు, హృతిక్‌ చేస్తున్న తెలుగు మూవీ కూడా’

ఆయన మాట నమ్మకపోతే..

‘వార్‌ 2’ చేయడానికి ముఖ్య కారణం.. కథ, అందులో బలం, దర్శకుడు, ఇతర విషయాలు కాదు. ‘నువ్వు ఈ సినిమా చేయాలి. మీ అభిమానులు గర్వపడేలా ఈ మూవీ తీస్తా’ అని చెప్పి నాకు నమ్మకం కలిగించిన ఆదిత్య చోప్రా గారికి నా ధన్యవాదాలు. ఆయన మాట నమ్మకుండా ఉండి ఉంటే, మీ ముందు ఇంత గర్వంగా నిలబడి ఉండేవాడిని కాదు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ యూనివర్స్‌లోకి నన్ను తీసుకున్నందుకు కృతజ్ఞతలు. నాకు ముంబై వెళ్లి ఉండటం అసలు నచ్చదు. కానీ నాకు యన హైద్రాబాద్‌లో ఉన్నట్లే అన్ని సదుపాయాలు సమకూర్చారు ఆదిత్యా చోప్రా. అయాన్‌ ముఖర్జీ తీసిన ‘బ్రహ్మాస్త్ర’కు ఈవెంట్‌కు నేను అతిథిగా రావాలి. కానీ ఆ రోజు కుదరలేదు. ఇప్పుడు ఆయన సినిమా తీసి నాకు దర్శకుడిగా ఈ ఈవెంట్‌కు వచ్చాడు. కాలం ఎప్పుడు ఎలా ప్లాన్‌ చేస్తుందో ఎవరూ ఊహించలేం. ఇద్దరు స్టార్స్‌ను, పెర్‌ఫార్మర్స్‌ను పెట్టుకుని మూవీని ఈ స్థాయిలో తీయడం నిజంగా అద్భుతం. ఈ సినిమా అద్భుతమైన అవుట్‌పుట్‌ రావడానికి అయాన్‌ ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపారు. ఎవరెన్ని కామెంట్స్‌ చేసినా ‘వార్‌2’ బొమ్మ అదిరి పోయింది. సినిమాలో ట్విస్ట్‌లు ఉన్నాయి. దయచేసి బయట పెట్టకండి. ఇందులో ఇద్దరం డాన్స్‌ చేసిన పాట ఎలా ఉంటుందో తెరపైనే చూడాలి’


War2.jpg

రాజమౌళికి థ్యాంక్స్‌ (Rajamouli)

'నేను ఓ సౌత్‌ ఆర్టిస్ట్‌ని అయినా ఆదిత్యా చోప్రా తన సినిమాలో నన్ను తీసుకుని ఇది మంచి సినిమా అవుతుంది... నీ అభిమానులు కాలర్‌ ఎగరేసేలా సినిమా ఇస్తానని మాటిచ్చారు. ఆ నమ్మకంతో ఈ సినిమా చేశా. ఈ విషయంలో రాజమౌళికి థ్యాంక్స్‌ చెప్పాలి. ఉత్తరాది, దక్షిణాది అనే హద్దులు చెరిపేశాడు’ అని తారక్‌ అన్నారు.

ఆ అభిమానితో మొదలై ఇక్కడిదాకా..

‘బాద్‌షా’ సినిమా ఈవెంట్‌లో ఓ అభిమాని తొక్కిసలాటలో మరణించాడు. అప్పటి నుంచి పబ్లిక్‌ ఈవెంట్‌లకు రావడం మానేశా. ఇప్పుడు 25 ఏళ్ల పూర్తి చేసుకున్న తరుణంలో మీ అందరిని కలవాలనీ, కృతజ్ఞతలు తెలపాలని వచ్చాను. దీనికి నాగవంశీ ఎంతో బలవంతపెట్టాడు. 25 ఏళ్ల క్రితం ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యా. స్వర్గీయ రామోజీరావు గారు తన బ్యానర్‌లో నన్ను పరిచయం చేశారు. ఆ సినిమా ప్రారంభానికి నాతో అమ్మానాన్న తప్ప ఎవరూ లేరు. మోహదీపట్నంలో ఇల్లు అయితే కాస్త దూరంగా అద్దెకు ఆఫీస్‌ తీసుకున్నా. అక్కడికొచ్చి మొదటిసారి నేను మీ అభిమానిని అని ఆదోనికి చెందిన మూజీబ్‌ వచ్చాడు. అప్పుడు మొదలైన నా జర్నీ 25 ఏళ్లు ఇక్కడి దాకా వచ్చింది. ఆ ఒక్కడి అభిమానం ఇంతమంది నా నా అభిమానులను సొంతం చేసింది. అది నా అదృష్టం. మీ ప్రేమ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గలేదు. నాన్న హరికృష్ణ, అమ్మ షాలినిలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అలాగే నన్ను ఎంకరేజ్‌ చేసిన దర్శక-నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమా షూటింగ్స్‌ తో నేను తీరిక లేకుండా ఉంటే ఇంటిలో ఉండి అన్ని చూసుకుంటున్న నా భార్య ప్రణతితో పాటు మా అబ్బాయిలు అభయ్‌ రామ్‌, భార్గవ్‌కి ప్రేమతో నా హగ్స్‌. ఇస్తున్నా. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నా బాధలు, సంతోషాలు పంచుకుంటున్నారు. జీవితాంతం మిమ్మల్ని ఆనందింపజేయడానికి శ్రమిస్తా. భవిష్యత్తులోనూ మనమందరం కలిసి ముందుకెళ్దాం. అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి’ అని తారక్‌ అన్నారు.

Updated Date - Aug 11 , 2025 | 12:44 AM