WAR2 Jr Ntr: పని చేయించుకుని పక్కన పెట్టడం కాదు.. వార్2 డైలాగ్స్‌ ఎవ‌రిని ఉద్దేశించి!

ABN , Publish Date - Aug 15 , 2025 | 01:41 PM

తెలుగు రాష్ట్రాల్లో వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌ను మించి ర‌జ‌నీకాంత్ కూలీ, ఎన్టీఆర్ వార్ 2 సినిమాల మ‌ధ్య హోరాహోరి జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

War 2

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌ను మించి ర‌జ‌నీకాంత్ (Rajinikanth) కూలీ (Coolie), ఎన్టీఆర్ (Jr NTR) వార్ 2 (War 2) సినిమాల మ‌ధ్య హోరాహోరి జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే రిలీజ్‌కు ముందు నుంచి విడుద‌ల అనంత‌రం మార్నింగ్‌, మ్యాట్నీ షోల వ‌ర‌కు అదిరిపోయే టాక్‌తో దూసుకు పోయిన కూలీ ఆపై నెమ్మ‌దించింది. దీంతో పాటే విడుద‌లైన వార్‌2 ముందు నుంచే బ‌జ్ అశించినంత‌గా లేక కాస్త వెనుక బ‌డిన‌ట్లు స్ప‌ష్టంగా తెల‌సినా విడుద‌ల అనంత‌రం మిశ్ర‌మ స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో చాలామంది సినిమా చూసిన వారు ఎవ‌రి అభిప్రాయాలు వారు చెబుతూ రెండు సినిమాలు అంత‌గా ఆక‌ట్టుకోలేక పోయాయ‌ని తేల్చారు. వారు అశించింది సినిమాలో లేక పోవ‌డంతో పెద‌వి విరుస్తూ సినిమా మైన‌స్‌లు ఇవే అంటూ త‌మ వ్యాఖ్యానాలు చెబుతూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలో వార్‌2లో గ్రాఫిక్స్, క్లైమాక్స్‌ తేలి పోయాయ‌ని, డ్యాన్స్ స‌రిగ్గా లేదంటూ పోస్టులు పెడుతూ వ‌చ్చారు.

క‌ట్ చేస్తే రెండో రోజు నుంచి కూలీని వెన‌క్కి నెట్టి వార్2 క‌లెక్ష‌న్ల ప‌రంగా ఇండియా వైడ్ దూసుకు పోతుంది. బుక్ మై షో లెక్క‌ల ప్ర‌కారం కూలీ చిత్రానికి గంట‌కు 40 వేట వ‌ర‌కు టికెట్లు తెగుతుండ‌గా వార్‌2కు 70 వేల వ‌ర‌కు టికెట్లు అమ్ముడ‌వుతూ బాక్సాఫీస్ వ‌ద్ద పుంజుకుంటోంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొద‌ట నిరుత్సాహ ప‌డ్డ‌ప్ప‌టికీ టికెట్ల విక్ర‌యాలు చూసి ఇప్పుడు సంబ‌రాల్లో మునిగి తేలుతున్నారు. అయితే వార్‌2 విష‌యంలో సినిమా రిలీజ్‌కు ముందు ఎన్టీఆర్ స్పీచ్ ఓ కార‌ణమైతే, ఆపై సినిమాలోని డైలాగ్స్ బ‌య‌ట‌కు రావ‌డంతో తిరిగి సినిమాకు క్రేజ్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అంతేగాక ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రీ ఎంట్రీ ఉంటుంద‌నేలా సోష‌ల్ మీడియాలో వార్త‌లు ఊపందుకుంటున్నాయి.

War

ఆ ఈవెంట్‌లో ఎన్టీఆర్ త‌న అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ “దేవుడు అనుగ్రహిస్తే, ఇంకా ఎన్నేళ్లైనా మీ అందరితో ముందుకు నడుస్తా. కానీ ఒక్కడినే మాత్రం ఎక్కడికీ వెళ్లను మనందరం కలిసి వెళ్దాం” అని స్పష్టం చేశారు. అంతేకాదు తాత నందమూరి తారకరామారావు గారి ఆశీస్సులు ఉన్నంత కాలం నన్నెవరూ ఆపలేరు అని గట్టిగా చెప్పారు. నా తొలి సినిమా ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు నా పక్కన కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు కోట్లాది అభిమానులు ఉన్నారు. ఈ జన్మ మీకే అంకితం అంటూ అభిమానులపై తన ప్రేమను వ్యక్తం చేశారు. ఈ క్ర‌మంలో ఆయన మాటలు విన్న అభిమానులు “సీఎం.. సీఎం” అంటూ హర్షం వ్యక్తం చేయడం కూడా ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అనే చర్చలకు మళ్లీ ఊతమివ్వ‌డ‌మే గాక కొత్త ఊహాగానాల‌కు తెర తీసింది.

అది అలాఉండ‌గానే ఇప్పుడు ‘వార్ 2’ సినిమాలో ఉన్న కొన్ని డైలాగ్‌లు కూడా రాజకీయ చర్చలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ఒక మనిషి ఇగోని కెలికితే ఎంత దూరమైనా వెళ్తాడు, పక్క కుర్చీలో కూర్చోవడానికి స్టేటస్ కావాలి పని చేయించుకుని పక్కన పెట్టడానికి అవసరం లేదు అనే డైలాగ్స్ పేలాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోషించిన పాత్ర అధికారం, పదవుల కోసం త‌పించే వ్యక్తిగా చూపించగా హృతిక్ రోషన్‌తో ఓ సన్నివేశంలో “ఫస్ట్ నేనే” ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్ గతంలో ఆయన టీడీపీకి చేసిన ప్రచారం, ఆ తరువాత పార్టీకి దూరమైన పరిణామాలను అభిమానులకు గుర్తు చేస్తోంది. అయితే.. కొంతమంది విశ్లేషకులు మాత్రం ఇవి యాదృచ్ఛికంగా వ‌చ్చిన డైలాగ్స్‌లా లేవ‌ని, గతంలో తనకు రాజకీయాల్లో ఎదురైన సమస్యల‌ను ఎన్టీఆర్ ఎప్పుడూ బహిరంగంగా చెప్ప‌క‌పోయినా ఈ సినిమాలోని డైలాగులు మాత్రం త‌న‌ ప‌రిస్థితుల‌ను గుర్తు చేసేలా ఉన్నాయ‌ని ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు. మ‌రి అభిమానులు కోరుకున్న‌ట్లు ఎన్టీఆర్ పొటిలిక‌ల్ ఎంట్రీ ఉంటుందా ఉండ‌దా అనే వాట‌న్నింటికి కాల‌మే స‌మాధానం చెప్పాలి.

Updated Date - Aug 15 , 2025 | 01:41 PM